
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే L.C. గేటు వద్ద పెను ప్రమాదం తప్పింది. ట్రైన్ కాసేపటిలో ఆ మార్గంలో వస్తుంది అనగా రైల్వే సిబ్బంది రైల్వే గేట్‌ను వేయబోయారు. అది గమనించిన AP 30 TA 0221 నంబర్ గల టాటా AC మ్యాజిక్ వాహనం డ్రైవర్ గేటు పడక ముందే రైల్వే ట్రాక్ దాటాలని వేగంగా దూసుకొచ్చాడు. కానీ అప్పటికే గేటు పడిపోవడంతో.. వాహనాన్ని కంట్రోల్ చేయలేక గేట్‌ను ఢీకొట్టాడు. అయితే అదృష్టవశాత్తు గేట్ స్ట్రాంగ్‌గా ఉండడంతో కారు పట్టాలపైకి వెళ్లకుండా అక్కడే ఆగిపోయింది. కానీ గేట్ మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయింది.
రైల్వే గేట్ విరిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది రంగంలోకి దిగారు. డ్యామేజ్ అయిన రైల్వే గేట్ స్థానంలో తాత్కాలిక గేట్ ను ఏర్పాటు చేసి ప్రధాన గేట్‌కి మరమ్మత్తులు చేపట్టారు. గేట్ మరమ్మత్తులు పూర్తయ్యేవరకు తాత్కాలిక గేట్ ద్వారా ఆ మార్గంలో ప్రయాణించే వాహనాలను అడ్డుకున్నారు. గేటు మరమ్మతులు పూర్తవ్వటానికి గంట పాటు సమయం పట్టింది. దీంతో గేటుకి ఇరువైపులా రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. తర్వాత పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే LC గేట్ ఇటీవల తరచూ ప్రమాదాలకు గురవుతోంది. కిందటేడాది ఏప్రిల్ లో లగేజీ ఆటో సరిగ్గా ఇదే విధంగా రైల్వే గేట్ ను ఢీ కొనగా.. గేట్ డ్యామేజ్ అయింది. ఇలాగే ఇంతకు ముందు కూడా పలుమార్లు రైల్వే గేట్ వద్ద ప్రమాదాలు చోటు చేసుకున్నాయి . ఇప్పటికైనా రైల్వే గేటు వద్ద ప్రమాదాలు నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని పలాస కాశీబుగ్గ పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.