AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోటి దురుసు చింతమనేని ఇప్పడు ఎక్కడ ఉన్నారు?

చింతమనేని ప్రభాకర్.. టీడీపీ ఫైర్ బ్రాండ్.. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరుకు చెందిన ఈ మాజీ ఎమ్మెల్యే తెలియని వారుండరు. అంతగా ఈయన పేరు మార్మోగింది. అధికారంలో ఉన్నపుడు అధికారంలో లేనప్పుడు కూడా ఆయన మీడియా వార్తల్లో సంచలనంగా మారిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కేసులు వెంటాడుతున్నాయి. ఆయన ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా అఙ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో ఆయన కోసం ప్రత్యేక బృందాలుగా విడిపోయి […]

నోటి దురుసు చింతమనేని ఇప్పడు ఎక్కడ ఉన్నారు?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 06, 2019 | 5:17 PM

Share

చింతమనేని ప్రభాకర్.. టీడీపీ ఫైర్ బ్రాండ్.. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరుకు చెందిన ఈ మాజీ ఎమ్మెల్యే తెలియని వారుండరు. అంతగా ఈయన పేరు మార్మోగింది. అధికారంలో ఉన్నపుడు అధికారంలో లేనప్పుడు కూడా ఆయన మీడియా వార్తల్లో సంచలనంగా మారిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కేసులు వెంటాడుతున్నాయి. ఆయన ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా అఙ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో ఆయన కోసం ప్రత్యేక బృందాలుగా విడిపోయి మరీ పోలీసులు గాలిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమికి చెందిన కొందరు ఎస్సీ యువకులపై చింతమనేని దౌర్జన్యం చేశారని కేసు నమోదైంది. ఇసుక తవ్వకం వ్యవహారంలో తమను కులం పేరుతో చింతమనేని దూషించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఆయనతో పాటు ఆయన అనుచరులు మరికొందరిపైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో ఆయన గత శుక్రవారం నుంచి కనిపించకుండా పోయారు.

చింతమనేని ప్రభాకర్..నోటి దురుసు ఎక్కువగల ప్రజా ప్రతినిధి అనేది చాలమంది చెప్పే మాట. ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా, అప్పటి విప్‌గా బాధ్యతలు నిర్వహించారు. పదునైన వ్యాఖ్యలతో అప్పటి ప్రతిపక్షపార్టీ, ఇప్పటి అధికార పార్టీ వైసీపీపై ఒక రేంజ్‌లో విమర్శలు చేసిన నాయకుడు చింతమనేని. మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దాడి తర్వాత చింతమనేని గురించి బాహ్యప్రపంచానికి ఎక్కువగా తెలిసింది అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పటి వరకు ఆయనకు నోటి దురుసు మాత్రమే ఎక్కువని అంతా అనుకునే వారు. కానీ ఇసుక తరలింపు వ్యవహారంలో ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోలు హల్‌చల్ చేసిన తర్వాత చింతమనేని దూకుడు ఎంతగా ఉంటుందో బయటపడింది.

గత ప్రభుత్వ హయాంలో అధికారాన్నిఅడ్డుగా పెట్టుకుని స్ధానికింగా రెచ్చిపోయిన చింతమనేనిని ప్రస్తుతం కేసుల బెడద వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. ఆయనపై ఇప్పటి వరకు 50 కేసులు ఉన్నట్టు స్వయానా జిల్లా ఎస్పీ తెలిపారు.

గత ప్రభుత్వ హయంలో చింతమనేనిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే ఆయన పవర్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. 2009లో వైఎస్ హవాలో కూడా గెలిచి తన సత్తా చాటుకున్న నేత చింతమనేని. అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్‌ను వేదికపైనే చేయిచేసుకున్న వ్యక్తి చింతమనేని. దెందులూరులో చింతమనేనికి ఎదురు నిలిచే ధైర్యం ఎవ్వరికీ లేకుండా పోయింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మార్వో వనజాక్షి, ఒక ఏఎస్సైపై దాడులు, ఎస్సీ వర్గానికి చెందిన వారిని కులం పేరుతో దూషించడం ఇవన్నీ ఆయనకు మామూలు సంఘటనలుగానే కనిపించాయి. ఆఖరిని ఎన్నికల ముందు కూడా ఓ ఆర్టీసీ డ్రైవర్‌ను కొట్టిన సంఘటన, తన నియోజకవర్గంలో ఎస్సీలకు రాజకీయాలు ఎందుకు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ చింతమనేనికి చాల చిన్న విషయాలుగానే అనిపించాయి.

1995లో ఏలూరులో చింతమనేనిపై మొట్టమొదటిసారి రౌడీషీట్ ఓపెన్ చేశారు. అప్పటినుంచి ఆయనపై కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఉద్వోగిపై దాడి కేసులో ఐపీసీ సెక్షన్లు 506,323,356 రెడ్ విత్ 34, కింద దెందులూరు పోలీస్‌స్టేషన్‌లోను, ఏలూరు త్రీ టౌన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, ముసునూరులో ట్రాఫిక్ పోలీస్‌పై దాడి చేసిన కేసు, వన్యప్రాణి అభయారణ్యం చట్టం కింద కైకలూరులో కేసు, ఆర్టీసీ డ్రైవర్‌ను కొట్టినందుకు హనుమాన్ జంక్షన్‌లో కేసు, ఇక ఎమ్మార్వో వనజాక్షి కేసు, తాజాగా మరోసారి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఇలా దాదాపు 50 కేసులు ఈ మాజీ ఎమ్మెల్యేను వెంటాడుతున్నాయి.

వివాదాలు ఆయనకు కొత్తకాదు.. ఆయన నోరు, చేయి ఎప్పడూ ఖాళీగా ఉండవు అంటారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని కొనితెచ్చుకునే చింతమనేని గతంలో పెరిగిన పెన్షన్ తీసుకుందాని వెళ్లిన ఓ వృద్ధుణ్ని అంతా చూస్తుండగానే నీ కొడుకు వైసీపీ ఉంటూ టీడీపీ ఇచ్చే పెన్షన్ తీసుకోడానికి సిగ్గు లేదా అంటూ దుర్భాషలాడాడు చింతమనేని. దీంతో తీవ్ర మనస్థాపంతో ఆ వృద్ధుడు అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఇదే విషయంపై వృద్ధుడి కొడుకు నిలదీస్తే అతడిని అరెస్టు చేయాలని పోలీసులకు ఆర్డర్ వేశాడు. ఇలా నోటి దురుసుతో ప్రజలను బెంబేలెత్తించిన వ్యక్తి చింతమనేని.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఎంతగా రెచ్చిపోయి ప్రవర్తించినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం కూడా స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. విపక్ష పార్టీలు ఎన్ని ఆందోళలను చేసినా కూడా పోలీసులు కూడా స్పందించలేదు. అయితే టీడీపీలో చింతమనేని వ్యవహారం పార్టీకి చేటు తెచ్చే విధంగా ఉందని ఎంతోమంది నొచ్చుకున్నారు. బాధ్యతగల ప్రజా ప్రతినిధిగా ఉంటూ ఇలా నోరు పారేసుకోవడం మంచిదికాదని, అది పార్టీకి నష్టం చేస్తుందని కూడా తమ అభిప్రాయాన్ని అధినేతకు చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, ఎస్సీ,ఎస్టీ వర్గాలపై చింతమనేని వ్యవహార శైలిపై అధినేతకు ఎన్నిసార్లు చెప్పినా ఆయన స్పందించకపోవడంతో చెప్పి చెప్పి వదిలేశారు.

ఓడిపోవాలని ఓటమి అనుకుంటే తప్ప తాను ఓడిపోనంటూ బీరాలు పలికిన చింతమనేని దెందులూరులో దారుణంగా ప్రజావ్యతిరేకతను మూటకట్టుకున్నారు. దాంతో ఆయన ఓడిపోక తప్పలేదు. తాను అధికారుల అవినీతిని, అలసత్వాన్ని ప్రశ్నించడం కోసమే నోటికి పనిచెబుతానని చింతమనేని గతంలో చెప్పారు. ఆయనలో నీతి ఏమాత్రం ఉందో ప్రస్తుతం ప్రభుత్వం వెలికితీసే పనిలో పడింది.

ప్రస్తుతం చింతమనేని పోలీసులకు చిక్కకుండా అఙ్ఞాతంలోకి వెళ్లిపోవడం పార్టీని కూడా కలవరపెడుతోంది. మరోవైపు తమ పార్టీ నేతలపై వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతూ తప్పుడు కేసులు బనాయిస్తోందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. అయితే దాదాపు 50 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఈ మాజీ ఎమ్మెల్యే విషయంలో ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి.