AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: దారుణం.. పింఛన్ డబ్బుల కోసం మృగంలా మారాడు.. ఇలాంటి కొడుకు ఎవ్వరికీ ఉండొద్దు..

అనారోగ్యంతో మంచం పట్టిన తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నకొడుకే కాలయముడులా మారి అత్యంత పాశవికంగా హతమార్చిన ఘటన విజయనగరం జిల్లాలో కలకలం రేపింది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని పెన్షన్ డబ్బు కోసం నిరంతరం వేధించి వేధించి చివరికి మృగంలా మారి ప్రాణాలు తీశాడు. ఇంతకీ అసలు ఆ మంచం పట్టిన తండ్రిని హతమార్చడానికి కారణాలేంటి?

Andhra Pradesh: దారుణం.. పింఛన్ డబ్బుల కోసం మృగంలా మారాడు.. ఇలాంటి కొడుకు ఎవ్వరికీ ఉండొద్దు..
Crime News
Gamidi Koteswara Rao
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 08, 2025 | 8:51 AM

Share

అనారోగ్యంతో మంచం పట్టిన తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నకొడుకే కాలయముడులా మారి అత్యంత పాశవికంగా హతమార్చిన ఘటన విజయనగరం జిల్లాలో కలకలం రేపింది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని పెన్షన్ డబ్బు కోసం నిరంతరం వేధించి వేధించి చివరికి మృగంలా మారి ప్రాణాలు తీశాడు. ఇంతకీ అసలు ఆ మంచం పట్టిన తండ్రిని హతమార్చడానికి కారణాలేంటి? తండ్రి పట్ల ఎందుకు మృగంలా ప్రవర్తించాడు? అనే సందేహాలు జిల్లావాసుల్లో మెదులుతున్నాయి. ఇదో అమానవీయ ఘటనగా భావిస్తున్నారు గ్రామస్తులు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా బాడంగి మండలం గొల్లాదిలో జరిగిన ఈ దారుణం అందరినీ శోకసంద్రంలో ముంచింది. గొల్లాది గ్రామంలో మామిడి సత్యం (62) పై అనే వృద్ధుడు గత కొన్నాళ్లుగా పక్షవాతం బారిన పడి మంచానికే పరిమితమయ్యాడు. తన కష్టం చెప్పుకోవడానికి నోటి వెంట మాట కూడా రాని అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు సత్యం.. ఈ క్రమంలో అతని కుమారుడు రాము దారుణానికి పాల్పడ్డాడు.

మామిడి సత్యానికి రాము(32) అనే ఒక కుమారుడు, కోడలు గంగమ్మ, ఇద్దరు మనుమరాలు ఉన్నారు. కొడుకు రాము తరచు మద్యం తాగేవాడు.. ఇలా మద్యానికి బానిసై.. మద్యం మత్తులో కుటుంబసభ్యులను వేధిస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 1 వ తేదీన తండ్రికి పక్షవాతానికి చెందిన ఫించన్ వచ్చింది. ఆ ఫించన్ డబ్బులు కోడలికి ఇచ్చాడు సత్యం.. ఆ మరుసటి రోజు సాయంత్రం మద్యం కోసం తన తండ్రికి చెందిన ఫించన్ డబ్బులు ఇవ్వాలని భార్యను అడిగాడు. అందుకు ఫించన్ డబ్బులతో సత్యంకు మెడిసిన్ కొనాలని, ఫించన్ డబ్బులు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది రాము భార్య. దీంతో పట్టరాని కోపంతో తన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని భార్యతో గొడవపడ్డాడు. భార్యను కొట్టాడు.

ఆ సమయంలో అక్కడే ఉన్న తండ్రి సత్యం తన నోటి నుండి మాటలు రాకపోవడంతో కోడలిని బయటకు వెళ్లాలని చేతులతో సైగ చేశాడు. దీంతో రాము భార్య అక్కడ నుండి బయటకు పరుగెత్తింది. దీంతో తాను డబ్బులు అడుగుతుంటే ఇవ్వకపోగా తన భార్యను వెనకేసుకొస్తావా అని పట్టరాని కోపంతో కదల్లేని స్థితిలో ఉన్న తండ్రి పై కత్తితో దాడి చేశాడు. క్షణికావేశంలో కత్తితో తండ్రి గొంతు కోసి, తలను వేరు చేసి అతి క్రూరంగా హత్య చేశాడు. అనంతరం ఆ తలను ఒక సిమెంట్ బొచ్చెలో పెట్టి ఇంటికి కొద్దిదూరంలో పడేశాడు.

తండ్రి శరీరం మంచంపై రక్తపు మడుగులో పడి ఉండగా, తల లేకపోవడంతో అంతా భయాందోళనకు లోనయ్యారు. తరువాత కొంతసేపు పరిసరాల్లో వెతికిన తరువాత ఎట్టకేలకు సత్యం తల కనిపించింది. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తరువాత పరారీలో ఉన్న రామును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. కుటుంబాన్ని అంతా తానై చూడాల్సిన రాము మద్యం మత్తులో తండ్రిని హతమార్చి కటకటాలపాలై కుటుంబాన్ని రోడ్డున పడేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..