పూర్వం రోజుల్లో పల్లెల్లో గ్రామస్థుల మధ్య తలెత్తే వివాదాలు, న్యాయ పరమైన తగువులు వారి కుల పెద్దలు విచారించి అందరికీ తీర్పులు చెప్పేవారు. ఆయా గ్రామాల్లో బలం ఉన్న వ్యక్తులదే రాజ్యమన్నట్లు ఉండేది. దీంతో పక్షపాతంతో కొన్ని సందర్భాల్లో పెద్దలు ఇచ్చే తీర్పులు వివాదాస్పదంగా మారుతుండేవి. ఒకవేళ ఎవరైనా పెద్ద మనుషుల మాటను కాదంటే వారికి విధించే శిక్ష ఏమంటే.. వారింటికి ఎవ్వరూ పనికి వెళ్లకుండా, మాట్లాడకుండా చేసేవారు. కనీసం వారితో ఎవ్వరూ మాట్లాడకుండా, పాలు కూడా పోయకుండా ఉండేవారు. ఇలాంటి కట్టుబాట్లతో సామాన్యులు తీవ్ర వివక్షతకు గురికావటం సాధారణంగా మారిపోయేది. ఇప్పటికీ పలు గ్రామాల్లో ఇలాంటి వివక్షలు, గ్రామ బహిష్కరణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం మిద్దెవారిపాలెంలో చోటు చేసుకుంది.
దళితులు తమ భూముల్లో చెరువు తవ్వకం నిలిపివేయాలని కొందరు నాయకులు అడ్డుకోగా వారి మాట లెక్క చేయలేదని ఆరు దళిత కుటుంబాలను గ్రామస్థులు వెలి వేశారు. వారికి కనీసం ఊర్లో నిత్యావసర వస్తువులు అలాగే పాలు కూడా అమ్మకూడదంటూ కుల పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గ్రామంలోని ఆ కుటుంబాలతో ఎవరూ మాట్లాడం లేదు. చెరువులు త్రవ్వకం, అంబేద్కర్ విగ్రహం నెలకొల్పిన విషయంలో.. మా మీద కొందరు గ్రామస్థులు కక్షతో వెలివేసారంటూ మహిళలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రతి చిన్న విషయానికి తమని చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి బాధితులు పోలీస్‌లకు ఫిర్యాదు చేయడంతో గ్రామానికి చేరుకున్న నర్సాపురం డీఎస్పీ రవి మనోహరాచారి 10 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గ్రామస్థులతో చర్చించి మళ్లీ ఎటువంటి గొడవలు జరగకుండా గ్రామస్థులతో కలిపి శాంతి కమిటీ వేశారు.
ఇదిలా ఉండగా ఇదే జిల్లాలోని పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో గతంలో వెలివేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం స్రృష్టించింది. దీనిపై కేసులు నమోదయ్యాయి. బాధితులకు పూర్తి న్యాయం జరగలేదని ఇప్పటికి ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇక ఆచంట నియోజకవర్గంలో ఇప్పటికీ ఒక బీసీ సామాజిక వర్గం వారు తమ గ్రామాలలో కుల సంఘాలు చెప్పిందే వేదం.. వారి మాటకు ఎదురు చెబితే కుల బహిష్కరణ, గ్రామంలో వెలి వేయడం లాంటివి జరుగుతాయని భావిస్తున్నారు. ఇలాంటి ఘటనలు కూడా తరుచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే చాలామంది కుల సంఘాలని ఎదురించి పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోతున్నారు. కొందరు వారి తీర్పును వ్యతిరేకించి పోలీసులకు ఫిర్యాదు చేసినా రాజకీయ ఒత్తిడితో రాజీ కుదుర్చుకుంటున్నారు.
అయితే పోలీసులు,రెవెన్యూ సిబ్బంది.. గ్రామంలో వెలి వేస్తే కఠిన శిక్షలు విధిస్తామని ప్రజలకు అవగాహన కల్పించడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. చట్టం ప్రకారం ఎవరినైనా వెలి వేస్తే బాధితుడి ఫిర్యాదు పై పోలీసులు 3(1) సెక్షన్ 6 (PCR యాక్ట్ )ఎస్సీ లు అయితే (zc) of SC ST యాక్ట్ ల క్రింద కేసులు నమోదు చేస్తారు. కేసు నిరూపించబడితే ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రజల్లో చట్టాలు పట్ల అవగాహన కల్పించాలి. అదేవిధంగా పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసే బాధితులకు సరైన న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగే విధంగా పోలీసులు వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
( రిపోర్టర్ : బీ.రవి కుమార్, టీవీ9 )