AP News: ఈ పార్టీ నాయకులకు ఏమైంది.. సీటు విషయంలో పోటీలెందుకు..

|

Feb 22, 2024 | 9:22 PM

ఆ టికెట్‌ నాది, ఆ సీటు నాది, ఆ నియోజకవర్గం నాది.. ఇలా చెప్పుకోవాల్సిన పరిస్థితి టీడీపీ సీనియర్లది. ఒకప్పడు నియోజకవర్గాన్ని, జిల్లాను సైతం శాసించిన టీడీపీ సీనియర్లు.. ఇప్పుడు ఒక్క అసెంబ్లీ టికెట్‌ కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోంది. ఎవరికి వారు ముందుగానే కర్చీఫ్‌ వేసుకుని, ఈ సీట్లో మరొకరు కూర్చోడానికి వీల్లేదన్నట్టుగా అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ చేస్తున్నారు.

AP News: ఈ పార్టీ నాయకులకు ఏమైంది.. సీటు విషయంలో పోటీలెందుకు..
Telugu Desam Party Leaders
Follow us on

ఆ టికెట్‌ నాది, ఆ సీటు నాది, ఆ నియోజకవర్గం నాది.. ఇలా చెప్పుకోవాల్సిన పరిస్థితి టీడీపీ సీనియర్లది. ఒకప్పడు నియోజకవర్గాన్ని, జిల్లాను సైతం శాసించిన టీడీపీ సీనియర్లు.. ఇప్పుడు ఒక్క అసెంబ్లీ టికెట్‌ కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోంది. ఎవరికి వారు ముందుగానే కర్చీఫ్‌ వేసుకుని, ఈ సీట్లో మరొకరు కూర్చోడానికి వీల్లేదన్నట్టుగా అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ చేస్తున్నారు. మరోవైపు పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాట్లపై చర్చలు జరుగుతున్నాయి. ఎవరికెన్ని, ఎవరికి ఎక్కడ అని చంద్రబాబు-పవన్ ఓ అండర్‌స్టాండింగ్‌కు వస్తున్నారు. కాని, అంత వరకు వేచి చూసే పరిస్థితి కనిపించడం లేదు. తీరా ఉమ్మడి అభ్యర్ధుల జాబితా విడుదలైతే, అందులో తమ పేర్లు ఉండకపోతే, అప్పుడు బాధపడి లాభం లేదు కాబట్టి.. ముందుగానే జాగ్రత్తపడితే పోలా అని ఎవరికి వారు ‘ఆ సీటు నాది’ అని ప్రకటించేసుకుంటున్నారు.

నిమ్మకాయల చినరాజప్ప. ఈయన సిట్టింగ్‌ ఎమ్మెల్యే. గతంలో మంత్రిగానూ చేశారు. అంతటి సీనియర్‌ కూడా.. పెద్దాపురం నుంచి తానే పోటీ చేస్తానని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం లేకపోలేదు. పెద్దాపురం టికెట్‌ ఈసారి చినరాజప్పకు ఇవ్వడం లేదు అనే ప్రచారం నడుస్తోంది. చినరాజప్ప ఆరోగ్యం బాగోలేదంటూ కొందరు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. చాలా ప్లాన్డ్‌గానే ఈ ప్రచారం చేస్తున్నారు. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి. టీడీపీలో చంద్రబాబు కంటే తానే సీనియర్‌నని చెబుతూ ఉంటారు. అలాంటిది, ఆయనకు కూడా సీటు గ్యారెంటీ లేదు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేయబోతున్నాను అని ఒకటికి రెండుసార్లు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందంటే.. ఏ క్షణమైనా సీటు చేజారిపోవచ్చనే కదా అర్థం. ఇక్కడ జనసేన నేత కందుల దుర్గేష్ నుంచి తీవ్ర పోటీ ఉంది. రాజమండ్రి రూరల్‌ నుంచి పోటీ చేస్తున్నట్టు కందుల దుర్గేష్‌ ప్రకటించేసుకున్నారు కూడా. ఇదే విషయం పవన్‌ కల్యాణ్‌ కూడా తమకు చెప్పేశారంటున్నారు కందుల దుర్గేష్. ఈ స్టేట్‌మెంట్‌పై బుచ్చయ్య చౌదరి ఫైర్ అవుతున్నారు. ఆల్రడీ రాజానగరం సీటును జనసేన తీసుకుంది కాబట్టి.. రాజమండ్రి రూరల్‌ సీటు అడగవద్దని అల్టిమేట్టం ఇచ్చారు. అయినా, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ధైర్యంగా ఉండొచ్చని చంద్రబాబు ఎప్పుడో చెప్పారంటూ గుర్తు చేస్తున్నారు.

జగ్గంపేట టీడీపీ సీనియర్‌ నేత జ్యోతుల నెహ్రూ సైతం టికెట్‌ తనకే వస్తుందని చెప్పుకుంటున్నారు. ఇక్కడ జనసేన నుంచి పోటీ లేనప్పటికీ.. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పవన్‌ కల్యాణ్‌ను కలిశారనే వార్తలు వచ్చాయి. జనసేన తరపున జగ్గంపేట టికెట్‌ను జ్యోతుల చంటిబాబు ఆశిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. నిజానికి చంటిబాబు టీడీపీలోకే రావాల్సింది గానీ జ్యోతుల నెహ్రూ నుంచి గట్టి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యకర్తలకు క్లియర్ మెసేజ్ పంపారు నెహ్రూ. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోనూ సీటు సిగపట్లు మొదలయ్యాయి. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరబోతున్నట్టు ప్రకటించారు. నరసాపురం టికెట్టే టార్గెట్‌గా ఆ పార్టీలో జాయిన్ అవుతున్నారు. కొత్తపల్లి టార్గెట్‌ నరసాపురం టికెట్టే అయితే.. టీడీపీ నుంచి టికెట్‌ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పరిస్థితేంటి మరి?

ఇవి కూడా చదవండి

ఓవరాల్‌గా.. అందరికీ గోదావరి జిల్లాల్లోని టికెట్లే కావాలి. రెండు పార్టీలు బలంగా ఉన్నదీ ఇక్కడే కాబట్టి.. వీలైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. జనసేన అయితే.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ముమ్మడివరం, రాజమండ్రి రూరల్, రాజానగరం, కొత్తపేట, అమలాపురం, రామచంద్రాపురం, రాజోలు, పి.గన్నవరం సీట్లను ఆశిస్తోంది. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, గోపాలపురం, కొవ్వూరు, పోలవరం, ఆచంట సీట్లు అడుగుతోంది. అటు బీజేపీ కూడా గోదావరి జిల్లాల్లోనే తమకు పట్టు ఉందని చెబుతోంది. ముఖ్యంగా నరసాపురం ఎంపీ టికెట్‌ను బీజేపీ అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ నరసాపురం ఎంపీ సీటు బీజేపీకి ఇస్తే.. అదే సెగ్మెంట్‌లోని అసెంబ్లీ స్థానాలను కూడా అడుగుతుంది. ఇప్పటికే, టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు జరగలేదు. ఇప్పుడు బీజేపీ కూడా అడిగితే.. పోటీ మరింత తీవ్రంగా ఉంటుంది. మొత్తంగా సీటు పోటు ఎవరికి ఎక్కువయ్యా అంటే.. అది టీడీపీలోని సీనియర్‌ లీడర్లకే. ఒకప్పుడు పార్టీలో చక్రం తిప్పిన సీనియర్‌ నాయకులు.. ఇప్పుడు టికెట్లు మావే అని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. మరి నిజంగానే సీట్లు దక్కించుకుంటారా, త్యాగం చేస్తారా చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..