AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakha Agency: ఆ కొండ కూర రుచే వేరయా.. ఈ సీజన్లో అడవుల్లో సేకరించేందుకు పోటీ…

Visakha Agency: ప్రకృతి అందాల సమాహారం విశాఖ మన్యం. ఎన్నో వింతలు, విశేషాలతో పాటు గిరిజన సంప్రదాయం అందరికీ కట్టిపడేస్తుంది.

Visakha Agency: ఆ కొండ కూర రుచే వేరయా.. ఈ సీజన్లో అడవుల్లో సేకరించేందుకు పోటీ...
Konda Kura 2
Shiva Prajapati
|

Updated on: May 11, 2022 | 5:59 AM

Share

Visakha Agency: ప్రకృతి అందాల సమాహారం విశాఖ మన్యం. ఎన్నో వింతలు, విశేషాలతో పాటు గిరిజన సంప్రదాయం అందరికీ కట్టిపడేస్తుంది. గిరిజన ఆచార వ్యవహారాలతో పాటు నోరూరించే వంటకాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. అడవిని నమ్ముకునే ఆ అడవిబిడ్డలు.. ప్రకృతి లో లభించే ఆకుకూరలు, కాయలతోనే వారి వంటకాలు. ఈ కోవకే చెందుతాయి కొండకూరలు..! అదేంటి.. కొండ కూరలు ఏంటి అని అనుకుంటున్నారా..? అయితే ఈ సీజన్లో ప్రత్యేకమైన పుష్కలమైన పోషకాలతో కొండల్లో లభించే ఆకుకూరలు, వాటి వంటకాల విశేషాలు ఏంటో చూద్దాం ఒకసారి.

విశాఖ మన్యంలో ఆకు కూరలకు విశేష ప్రాముఖ్యత ఉంది. వాటిలో మండి కూర, కుంకోడి కూర, గొడ్రు కూర..! ఆకు కూరలెన్ని ఉన్నా.. ఈ సీజన్లో మాత్రమే ఏజెన్సీలో విరివిగా దొరికే ఈ కూరను సేకరించే పనిలో ఉంటారు గిరిజనులు. ప్రతియేటా ఈ ఆకు కూరలకు భలే గిరాకీ ఉంటుంది. ఇష్టపడి మరీ గిరిజనులంతా దీన్ని సేకరించేందుకు పోటీపడతారు.

మండి, గొడ్రు, కుంకోడి కూరల చెట్లు అడవి మెట్ట ప్రాంతాలతో విస్తరించి ఉన్నాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఏప్రిల్ వరకు ఎండలు, వర్షాలకు తోడు ఏజెన్సీ వాతావరణంలో ఈ చెట్లకు పాత ఆకులు రాలిపోతాయి. ఈ సీజన్లో చిగురించి గిరిజనుల అందరినీ ఆకర్షిస్తాయి. దీంతో ఈ సీజన్ వచ్చిందంటే చాలు గిరిజనులంతా ఆకు కూరలను సేకరించెందుకు పోటీ పడతారు.

ఇవి కూడా చదవండి

కూరల్లో మండి కూర తీగ జాతికి చెందినది. దీన్ని దేవతల రూపంలో పోలుస్తారు గిరిజనులు. పవిత్రంగా సేకరిస్తారు. కుంకోడి కూర, గొడ్రు కూర చెట్ల నుంచి సేకరిస్తారు. ఇలా సేకరించిన ఈ ఆకు కూరలను ఇంటికి తీసుకొచ్చి ఈ సీజన్లో కూరను వండడం ఆనవాయితీ.

ఒక్కో ఆకు కూరతో ఒక్కో రకమైన వెరైటీ డిష్ ను తయారు చేస్తారు గిరిజనులు. మండి, గొడ్రు కూరలను వేపుడు చేసి తింటారు. ఇక కుంకోడి కూరను పిండితో కలిపి కూరగా వంటకం చేస్తారు గిరిజనులు. వండిన ఆ కూరలను ఇంటిల్లిపాది ఇష్టంగా ఆరగిస్తారు. లొట్టలు వేసుకుని మరి ఆహా ఏమి రుచి అంటూ తింటారు.

పోషకాలు పుష్కలంగా ఉండే ఈ మండి, గొడ్రు, కుంకోడి కూరలు.. కేవలం వంటకంగా మాత్రమే కాకుండా దివ్య ఔషధంగా కూడా భావిస్తారు గిరిజనులు. రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని నమ్ముతుంటారు. మండి కూర కాస్త వగరుగా ఉన్నా… అందులో ఉండే పోషకాలు అమోఘమట. గొడ్రు కూర, మండి కూర వేపుడు తింటే.. పిల్లల్లో రక్తహీనత నివారణ తో పాటు.. మహిళల్లో ఉండే పలు అనారోగ్య సమస్యలకు కూడా బాగా పనిచేస్తాయి అన్నది కూడా గిరిజనుల నమ్మకం.. విశ్వాసం. అందుకే ఏ గిరిజన గ్రామంలో చూసినా ఈ కూరల గుమగుమ లే ఉంటాయి.

పూర్వ కాలం నుంచి ఈ ప్రత్యేక ఆకు కూరల వంటకాలు వండి ఇష్టంగా తింటుంటారు గిరిజనులు . అంతేకాదు.. ఈ ఆకుకూరలను అడవిలో సేకరించి సంతలలో అమ్ముతుంటారు. వాటికి కూడా ఈ సీజన్లో భలే గిరాకీ ఉంటుంది. గిరిజనుల వంటకాలను చూసి మైదాన ప్రాంత వాసులు కూడా ఈ కూరలను కొనుక్కొని తీసుకెళ్తుంటారు. ఇదండీ ఈ సీజన్లో గిరిజనుల ప్రత్యేక ఆకు కూర. వాటితో చేసే వంటకాలు. అవకాశం ఉంటే మీరు అలా ఏజెన్సీ కి వెళ్లి ఈ ఆకుకూరల రుచిని ఆస్వాదించండి.