Sajjala Ramakrishna Reddy: ఈసీకి ఫిర్యాదు చేశాం.. ఎమ్మెల్సీ ఫలితాలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు..
కంచుకోటలో ఘోర పరాజయం వైసీపీ సీనియర్లని కలవరపెడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కారణమా? నాయకుల మధ్య సమన్వయలోపమా? అనే విషయంపై నాయకుల్లో హైటెన్షన్ రేపుతోంది.
కంచుకోటలో ఘోర పరాజయం వైసీపీ సీనియర్లని కలవరపెడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కారణమా? నాయకుల మధ్య సమన్వయలోపమా? అనే విషయంపై నాయకుల్లో హైటెన్షన్ రేపుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన సజ్జల.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు వైఎస్సార్‌సీపీని బాగా ఆదరించారంటూ పేర్కొన్నారు. అలాగే ఫలితంతో టీడీపీ బలం పెరిగిందనడం హాస్యాస్పదంగా ఉందంటూ కొట్టి పారేశారు. ఓట్ల బండిల్‌లో ఏదో గందరగోళం జరిగిందని.. కౌంటింగ్‌లో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశామని సజ్జల తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలతోనే ఏదో అయిపోయిందని అనుకోవద్దంటూ ప్రతిపక్ష టీడీపీకి కౌంటర్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఓట్లు వేసింది సమాజంలోని చిన్న సెక్షన్ మాత్రమేనని.. ఇవి ప్రజలను ప్రభావితం చేసేవి కావంటూ పేర్కొన్నారు. లెఫ్ట్ పార్టీల ఓట్లు టీడీపీకి వెళ్లాయని.. దీంతో ఫలితం ప్రతికూలంగా వచ్చిందన్నారు. ఈ ఫలితంతో టీడీపీ బలం పెరిగిందనడం హాస్యాస్పదంగా ఉందంటూ పేర్కొన్నారు.
మొదటిసారి ఉపాధ్యాయుల స్థానాలు గెల్చుకున్నామని.. టీచర్స్ తమను బాగా ఆదరించారని సజ్జల రామకృష్ణరెడ్డి పేర్కొన్నారు. ఇది పెద్ద విజయమని.. తమ ఓటర్లు వేరే ఉన్నారంటూ పేర్కొన్నారు. తమకు సంతృప్తికరంగానే ఓట్లు వచ్చాయని.. ఈ ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపవంటూ స్పష్టంచేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..