Renuka Chowdary: గుడివాడ నుంచి పోటీ చేసి గెలుస్తా.. కొడాలి నాని వ్యాఖ్యలకు రేణుకా చౌదరి స్ట్రాంగ్ కౌంటర్..
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేస్తానంటూ రేణుక చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Renuka Chowdary on Kodali Nani: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేస్తానంటూ రేణుక చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణుకా ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఏపీ రాజధానిగా ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమానికి, పాదయాత్రకు మొదటనుంచి మాజీ ఎంపీ రేణుకా చౌదరి మద్దతు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రలో కూడా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెపై వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శలు గుప్పించారు. ఖమ్మంలో కార్పొరేటర్‌గా కూడా గెలవలేని రేణుకా చౌదరికి అమరావతిలో ఏం పని అంటూ.. ప్రశ్నించారు. అయితే, కొడాలి కామెంట్ పై రేణుక చౌదరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఘాటుగా స్పందించారు. కొడాలి నాని లారీలు కడుక్కునే సమయంలోనే తాను కార్పొరేటర్‌ని అంటూ రేణుకా చౌదరి పేర్కొన్నారు.. నీకు చరిత్ర తెలియదు అంటూ కొడాలికి సూచించారు. గూగుల్ కొట్టు.. రేణుకా చౌదరి అంటే ఏమిటో నీకు తెలుస్తుందన్నారు.
తాను టీడీపీకి మద్దతుగా లేనని.. ఖమ్మంలోనే గెలవలేనని కొడాలి నాని మాట్లాడుతూ తనకు మంచి ఐడియా ఇచ్చారని రేణుకా చౌదరి పేర్కొన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో ఆయన నియోజకవర్గం గుడివాడ నుంచే పోటీ చేస్తానంటూ పేర్కొన్నారు. తాను మున్సిపల్ కార్పొరేటర్ గా చేశానని, ఎంపీగా, కేంద్ర మంత్రిగా చేశానని.. ఎమ్మెల్యేగా ఎప్పుడూ చేయలేదు.. గుడివాడలో పోటీ చేసి గెలిచి చూపిస్తా అంటూ పేర్కొన్నారు. గుడివాడ ప్రజలు చాలా తెలివైన వాళ్లని.. రాజకీయాలలో ఏమైనా జరగొచ్చు.. ప్రజలు మార్పును కోరుకుంటున్నారు.. అంటూ రేణుకా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు అభిమానం.. ఓటింగ్ ఉందని కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తానని స్పష్టంచేశారు. నా ముఖమే నాకు పాస్పోర్ట్.. నేను చేసిన సేవే నన్ను గెలిపిస్తుంది.. గుడివాడ నుంచి నేను గెలిచే చూపిస్తా అంటూ రేణుకా పేర్కొన్నారు.
కాగా.. రేణుకా చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీలో ఆసక్తికరంగా మారాయి. రేణుకా చౌదరి పోటీ చేస్తే.. పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటూ చర్చించుకుంటున్నారు. ఇంకా, రేణుకా వ్యాఖ్యాలపై కొడాలి నాని ఏ విధంగా స్పందిస్తారనేది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి