ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటర్ల జాబితా తయారీలో ఎన్నికల కమిషన్ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే అక్టోబర్ లో డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను ప్రకటించింది ఎన్నికల కమిషన్. దీనిపై అభ్యంతరాలకు,కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు, ఒక ప్రాంతంలో ఉన్న ఓటు వేరే ప్రాంతానికి మార్చుకునేందుకు గడువు విధించింది. అయితే డ్రాఫ్ట్ జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు.
ఒకే ఇంటి నెంబర్ తో వందలాది మందికి ఓటర్ గుర్తింపు కార్డులు ఉండటం, ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం వంటి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు ఆంధ్రప్రదేశ్ లో ఓటు వేయకుండా చూడాలని, డబుల్ ఎంట్రీలను తొలగించాలని కూడా వైఎస్సార్ కాంగ్రె్స్ పార్టీ ఫిర్యాదు చేసింది. మరో వైపు తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ రెండు ప్రధాన పార్టీలు కూడా సీఈవోకు ఫిర్యాదు చేస్తున్నాయి. బూత్ లెవల్ ఆఫీసర్ల నుంచి కలెక్టర్ల వరకూ గంపగుత్తగా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా ఫిర్యాదుల పరంపర కొనసాగుతూ ఉంది. దీంతో ఎన్నికల కమిషన్ ఇలాంటి ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తోంది.
మరోవైపు రాజకీయ పార్టీలు,ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం సీనియర్ ఐపీఎస్ అధికారులను కూడా జిల్లాలవారీగా పరిశీలకులుగా నియమించింది. ఈ అధికారులు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి ఓటర్ జాబితాపై రూపకల్పనపై జిల్లా స్థాయి అధికారులకు సూచనలు చేయడంతో పాటు ఫిర్యాదులు వచ్చిన చోట స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా చివరిదశకు చేరుకుంది. రేపటితో ఓటర్ నమోదు, ఇతర మార్పులకు గడువు ముగియనుంది.
రాష్ట్రంలో 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్ జాబితాను రూపొందించే పనిలో పడ్డారు ఎన్నికల కమిషన్ అధికారులు. దీంట్లో భాగంగా జనవరి ఐదో తేదీన ఫైనల్ ఎస్ ఎస్ ఆర్ విడుదల చేయనున్నారు. దీనికోసం కొత్తగా ఓటర్ గా నమోదు చేసుకోవడం, ఒక ప్రాంతంలో ఉన్న ఓటును వేరే ప్రాంతానికి మార్పు చేసుకోవడం, లేదంటే ఓటు హక్కు రద్దు చేసుకోవడం వంటి వాటికి ఈనెల 9 వ తేదీని గడువుగా పెట్టింది. 2024 జనవరి ఒకటో తేదీకి 18 సంవత్సరాలు నిండే వాళ్ళు కొత్తగా ఓటర్ గా నమోదు చేసుకోవచ్చు.. దీనికోసం ఫారం-6 ను ఉపయోగించి ఆన్ లైన్ లో కొత్త ఓటరు నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఉన్న ఓటు లో మార్పులు చేర్పులు చేయవలసిన వారు ఫారం – 8ని సీఈఓ ఆంధ్రా వెబ్ సైట్ నుంచి పూర్తి చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల ఓట్లు వేరే పోలింగ్ బూత్‌ల పరిధిలో నమోదైతే వాటిని ఒకే పోలింగ్ బూత్ పరిధిలోకి మార్చుకునే చాన్స్ ఉంటుంది.
ఇక ఫారం-6 A ద్వారా భారత పాస్ పోర్ట్ ఉన్న విదేశాల్లో ఉన్న వారికి ఓటర్ గా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇక కీలకమైన ఫారం – 7 ద్వారా ఓటు తొలగించుకునే అవకాశం ఉంటుంది. ఓటు తొలగించడం లేదా అభ్యంతరం తెలపడానికి ఫారం- 7ను ఉపయోగిస్తారు. పాస్ పోర్టు ఫోటో, వయసు ధ్రువపత్రం, అడ్రస్ ప్రూఫ్, ఫోన్ నెంబర్ దగ్గర పెట్టుకొని ఈ ఫారంలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఆఫ్ లైన్ లో కూడా ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ లేదా బూత్ లెవెల్ ఆఫీసర్ వద్ద నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఫారంలు నింపే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. అయితే ఓట్ల తొలగింపునకు సంబంధించి ఫారం – 7 లను ఎక్కువగా వినియోగిస్తూ ఓటర్ అనుమతి లేకుండా తొలగించేస్తున్నారని ఈసీకి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇదే సమయంలో తమ పార్టీకి అనుకూలంగా ఉండే వారిని ఫారం – 6 ద్వారా కొత్తగా ఓటు హక్కు కల్పించేలా అక్రమాలకు పాల్పడుతున్నారని సీఈఓ ముకేష్ కుమార్ మీనాకు ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే ఈనెల 9తో గడువు ముగుస్తుండటంతో ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఈనెల 9వ తేదీతో ఓటర్ నమోదు, ఇతర మార్పులకు గడువు ముగియనుంది. ఈనెల పదో తేదీనుంచి కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిలో మార్పులు- చేర్పులు, కొత్తగా ఓటు హక్కు కల్పించే ప్రక్రియను ఈనెల 26లోగా పూర్తి చేయనున్నారు. ఇక జవనరి ఐదో తేదీన ఫైనల్ ఎస్ ఎస్ ఆర్ ప్రకటించేలా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా చర్యలు తీసుకుంటున్నారు. అయితే రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో ఈసారి ఓటర్ జాబితా ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..