AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prakasam Barrage: ఛాలెంజ్‌గా మారిన బోట్ల తొలగింపు ప్రక్రియ.. ఇవాళ ప్లాన్‌-B రెడీ.. విశాఖ నుంచి డైవింగ్‌ టీమ్‌లు

ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న భారీ బోట్ల తొలగింపు సాధ్యపడలేదు. దాదాపు 5 గంటల పాటు ప్రయత్నించినా బోట్లు కదలకపోవడంతో మంగళవారం సాయంత్రం పనులు నిలిపేశారు. ప్రకాశం బ్యారేజీకి కొద్ది రోజుల క్రితం భారీ వరద వచ్చినప్పుడు 5 బోట్లు వచ్చి బ్యారేజీ గేట్లను ఢీ కొన్నాయి. వాటిలో ఒకటి వరద ప్రవాహానికి దిగువకు కొట్టుకుపోయింది.

Prakasam Barrage: ఛాలెంజ్‌గా మారిన బోట్ల తొలగింపు ప్రక్రియ.. ఇవాళ ప్లాన్‌-B రెడీ.. విశాఖ నుంచి డైవింగ్‌ టీమ్‌లు
Prakasam Barrage Boat Incident
Surya Kala
|

Updated on: Sep 11, 2024 | 6:55 AM

Share

ప్రకాశం బ్యారేజ్‌లో బోట్ల తొలగింపు ప్రక్రియ…అధికారులకు ఛాలెంజ్‌గా మారింది. 5 గంటల పాటు అష్టకష్టాలు పడ్డా…బోట్లు అర అంగుళం కూడా కదల్లేదు. అవి కదలమంటే కదలమని మొరాయిస్తున్నాయి. ప్లాన్‌ A ఫెయిల్‌ అవడంతో ఇవాళ ప్లాన్‌ Bని సిద్ధం చేశారు అధికారులు.

ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న భారీ బోట్ల తొలగింపు సాధ్యపడలేదు. భారీ క్రేన్లు వినియోగించినా… గేట్లకు అడ్డంగా పడిన భారీ పడవలు ఇంచు కూడా కదల్లేదు. దాదాపు 50 టన్నుల బరువు లేపే సామర్థ్యం ఉన్న రెండు భారీ క్రేన్లతో కలిపి లేపినా ఆ బోట్లు కదల్లేదు. ఒక్కో బోటు బరువు 20 టన్నుల పైనే ఉండడం, బోట్లు ఒకదానితో మరొకటి చిక్కుకుని ఉండడం, ఒక బోటు కింద మరో బోటు ఉండడం…వాటి నిండా ఇసుక ఉండడంతో వాటిని కదిలించడం సాధ్యం కాలేదు.

దాదాపు 5 గంటల పాటు ప్రయత్నించినా బోట్లు కదలకపోవడంతో మంగళవారం సాయంత్రం పనులు నిలిపేశారు. ప్రకాశం బ్యారేజీకి కొద్ది రోజుల క్రితం భారీ వరద వచ్చినప్పుడు 5 బోట్లు వచ్చి బ్యారేజీ గేట్లను ఢీ కొన్నాయి. వాటిలో ఒకటి వరద ప్రవాహానికి దిగువకు కొట్టుకుపోయింది. మిగిలిన నాలుగు బోట్లను తొలగించడానికి ఇరిగేషన్‌ అధికారులు, నిపుణుల బృందం నానా తిప్పలు పడింది.

ఇవి కూడా చదవండి

మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆపరేషన్‌ బోట్ల తొలగింపు జరిగింది. నదిలో ఒరిగిపోయిన బోట్లను వైర్‌తో లాక్‌ చేసి, వాటిని యథా స్థితికి తీసుకుని వచ్చి, డైరెక్షన్‌ మార్చి వరద ప్రవాహం ద్వారా దిగువకు పంపించేందుకు అధికారులు, నిపుణుల బృందం చాలా శ్రమించింది. అయితే ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం, భారీ బరువు ఉన్న బోట్లు కావడంతో ఈ ప్రయత్నాలు ఫలించలేదు.

ప్లాన్‌ A ఫెయిల్‌ అవడంతో ప్లాన్‌ Bని సిద్ధం చేశారు అధికారులు. దీనికోసం విశాఖ నుంచి డైవింగ్ టీమ్‌లను రప్పిస్తున్నారు. ఈ టీమ్‌ నీటి లోపలకు వెళ్లి భారీ కట్టర్లతో బోట్లను ముక్కలుగా కోయనున్నారు. బోట్లను ముక్కలు చేశాక పరిస్థితిని బట్టి, వాటిని ప్రవాహం ద్వారా దిగువకు పంపడం, లేదా క్రేన్ల సాయంతో పైకి లాగి బ్యారేజీ నుంచి దూరంగా తరలించడం చేస్తారు. ఇక 120 టన్నుల బరువును లేపే ఎయిర్ బెలూన్స్‌ని కూడా రంగంలోకి దించుతున్నారు. బోట్ల తొలగింపు ప్రక్రియ…అధికారులు, నిపుణులకు ఛాలెంజ్‌ విసురుతోంది.