Andhra Pradesh: ఆ ఆలయంలో అధిపత్య రాజకీయం.. ఛైర్మన్‌ది ప్రతిపక్షం, పాలకమండలిది అధికార పక్షం

| Edited By: Aravind B

Aug 29, 2023 | 5:34 PM

Vishakapatnam News: దేవాలయాల్లో ఆధిపత్య పోరు సాధారణం అయిపోయింది. ముఖ్యంగా పాలక మండళ్లు vs అధికారుల మధ్య దాదాపు అన్ని దేవాలయాల్లో వివాదాలు నడుస్తూనే ఉంటాయి. కానీ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మాత్రం పాలమండలినే రెండు గ్రూపులుగా విడిపోవడంతో అభివృద్ది దాదాపు ఆగిపోయింది. ఆలయ అనువంశిక ధర్మకర్తగా వచ్చి.. ఛైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు కాగా మిగతా పాలకమండలి సభ్యులు అధికార వైసీపీకి చెందిన వారు కావడంతో నాలుగేళ్లుగా దేవస్థానం అభివృద్ది జరగడం లేదు.

Andhra Pradesh: ఆ ఆలయంలో అధిపత్య రాజకీయం.. ఛైర్మన్‌ది ప్రతిపక్షం, పాలకమండలిది అధికార పక్షం
Varaha Lakshmi Narasimha Temple
Follow us on

విశాఖపట్నం న్యూస్, ఆగస్టు 29:  నేనేమీ రబ్బర్ స్టాంప్‎ను కాను.. మీ ఇష్టం వచ్చిన అజెండా పంపి ఆమోదించడానికి.. అజెండా అంటే ఛైర్మన్ ఆయిన నేను కానీ లేదంటే కార్య నిర్వహణ అధికారి కానీ తయారు చేయాలి.. కానీ ముందే నిర్ణయాలు తీసుకుని ర్యాటిఫికేషన్ కోసం పంపినట్టు పంపితే నేను ఆమోదించాలా? నెవర్…. సింహాచల క్షేత్ర శ్రీ వరాహ నారసింహ స్వామి ఆలయ ఆనువంశిక ధర్మకర్త, ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇవి. అయితే పాలక మండలి సభ్యుల వాదన వేరే వుంది, ఆలయ అభివృద్ధి జరిగితే ప్రభుత్వానికి పేరు వస్తుందనీ, ట్రస్ట్ బోర్డ్ సమావేశాలకు సమయం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారన్నది ట్రస్ట్ బోర్డ్ సభ్యుల ఫిర్యాదు. అసలు ఆ గుడిలో ఏం జరుగుతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

దేవాలయాల్లో ఆధిపత్య పోరు సాధారణం అయిపోయింది. ముఖ్యంగా పాలక మండళ్లు vs అధికారుల మధ్య దాదాపు అన్ని దేవాలయాల్లో వివాదాలు నడుస్తూనే ఉంటాయి. కానీ విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మాత్రం పాలమండలినే రెండు గ్రూపులుగా విడిపోవడంతో అభివృద్ది దాదాపు ఆగిపోయింది. ఆలయ అనువంశిక ధర్మకర్తగా వచ్చి.. ఛైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు కాగా మిగతా పాలకమండలి సభ్యులు అధికార వైసీపీకి చెందిన వారు కావడంతో నాలుగేళ్లుగా దేవస్థానం అభివృద్ది ఒకడగు ముందుకు, వంద అడుగులు వెనక్కు పడుతున్నాయి. వాస్తవానికి ప్రతి రెండు నెలలకు ఒకసారి, ముఖ్యమైన పండుగలు లాంటివి ఉన్నప్పుడు ప్రత్యేకంగా పాలక మండలి సమావేశం అయి భక్తులకు అవసరమైన ఏర్పాట్లు, ఇతర అభివృద్ది ప్రాజెక్టులపై చర్చించి నిర్ణయం తీసుకుని తీర్మానం చేస్తాయి. వీటిని కార్య నిర్వహణ అధికారి నేతృత్వం లో పూర్తి చేస్తుంటారు.

కానీ ఈ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి సింహాచలంలో మాత్రం భిన్నమైన పరిస్థితి. మిగతా ఆలయాలకు ఛైర్మన్ తో సహా పాలకమండలిని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కి చెందిన వారితో ఈ ఆలయ కమిటీలు ఉంటుంటాయి. టీటీడీ అయినా, ఇంద్ర కీలాద్రిపై ఉన్న దుర్గ గుడి కానీ, అన్నవరం సత్య దేవుడు అయినా అధికార పార్టీ నామినేట్ చేసిన కమిటీలే ఉంటాయ్. కానీ సింహాచలం లో మాత్రం వేరు. ఇక్కడ ఛైర్మన్‎గా దేవాలయ ఆనువంశిక ధర్మకర్త శాశ్వతంగా ఉంటారు. పాలక మండలి మాత్రం అధికార పార్టీ నామినేట్ చేయొచ్చు. కానీ తుది నిర్ణయం ఛైర్మన్‎దే. దీంతో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే అశోక్ ను ఛైర్మన్‎గా తీసేసి వారి కుటుంబానికే చెందిన సంచయిత గజపతి రాజును చైర్మన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై అశోక్ ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో వారసత్వ మొదటి తరం పురుషుడైన అశోక్ కే ఆ స్థానం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో మళ్లీ ఛైర్మన్‎ పగ్గాలు చేపట్టిన అశోక్ తనదైన శైలిలో వెళ్తూ ప్రభుత్వం కానీ, ఈ ప్రభుతం నియమించిన ఆలయ కమిటీ తీసుకుంటున్న నిర్ణయాలను ఏ మాత్రం అంగీకరించడం లేదు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా ఆరు నెలలుగా ఒక్క ట్రస్ట్ బోర్డ్ సమావేశం కూడా కాలేదు. చివరిగా ఈ ఏడాది మార్చ్ 1 న జరిగిన ట్రస్ట్ బోర్డ్ సమావేశం తర్వాత మూడు సార్లు ప్రయత్నించినా వీలు కావడం లేదు. దీనికి అశోక్ గజపతి రాజు సమయం ఇవ్వకపోవడమే కారణమని పాలక మండలి సభ్యులు అంటుంటే మూడు డేట్లు ఇస్తే ఏదో ఒక రోజు వస్తానంటే అలా చేయడం లేదని.. ఈలోపు కార్యక్రమాలు చేసేసి ఆమోదించాలని తాజాగా అజెండా పంపారంటున్నారు అశోక్. తానేమీ రబ్బర్ స్టాంప్ కాదని, నాతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు అశోక్. ఇది తాజా వివాదంగా మారింది. మరోవైపు అశోక్ పై దేవస్థాన పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆనువంశిక ధర్మకర్తగా ఉంటూ రబ్బర్ స్టాంప్ అనడం అన్యాయం అన్నారు. అశోక్ పాలక మండలి సమావేశాలకు సమయం ఇవ్వరని, ఆయనతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని 8 నెలలుగా అధికారులు ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నారన్నారు. అదే సమయంలో దేవాలయ అభివృద్ధికి అశోక్ నే అడ్డంకి అని.. తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో కూడా అసలు దేవస్థానానికి ట్రస్ట్ బోర్డ్ మండలి లేకుండానే చేశారంటూ ఎద్దేవా చేస్తున్నారు పాలక మండలి సభ్యులు. అనువంశీక ధర్మకర్త కావడంతో అంతా నా ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారని, ఆయన వైఖరి వల్లే పంచ గ్రామాల సమస్యతో పాటు పలు సమస్యలు సుదీర్ఘంగా పెండింగ్‎లో ఉన్నాయంటూ అశోక్ రిజైన్ చేయాలని మండి పడుతున్నారు ట్రస్ట్ బోర్డ్ సభ్యులు.

పంచాగ్రామాల సమస్యకు పరిష్కారం కరవు
మరోవైపు దశాబ్దాలుగా ఆలయ భూములతో అనుసంధానమై ఉన్న పంచగ్రామాల సమస్య ఉంది. ఏవి ఆలయ భూములో, ఏవి కావో తేలక కోర్టులో కేసు ఉండడంతో సమీప ఐదు గ్రామాల ప్రజలు చిన్న బాత్ రూం కట్టుకోవడానికి కాదు కాదా, మరమ్మత్తు చేయడానికి కూడా అవకాశం లేకపోవటంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మాస్టర్ ప్లాన్ అమలు పనులు జరగాలి. ప్రసాదం స్కీమ్ కింద కేంద్రం 50 కోట్లు ఇచ్చింది.. ఆ పనులు కూడా జరగాలి. కానీ అలాంటివి ఏవీ జరగకపోవడంతో ఆందోళన నెలకొంది. ఓ వైపు అశోక్ పట్టుదల, మరో వైపు అధికార పార్టీకి చెందిన ట్రస్ట్ బోర్డ్ సభ్యులు గత నాలుగేళ్లుగా సింహాచల దేవస్థాన అభివృద్ధి అగమ్య గోచరంలో పడిందని చెప్పటానికి ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సమస్యకు ఎప్పుడు పరిష్కారం జరుగుతుందనని స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్నారు.