AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇదేం పంచాయతీ రా నాయనా.. మొగుడు కొట్టినందుకు కాదు.. తోటికోడలు నవ్వినందుకు అన్నట్లుంది కథ..

ప్రేమ గెలిచింది.. పెద్దలు ఒప్పుకున్నారు.. పెళ్లి కూడా అయిపోయింది.. కానీ ఆ ఇంటి తోటికోడలు మాత్రం ససేమిరా అంది.. వినడానికి వింతగా ఉన్నా.. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కులాలు వేరైనా భర్తకు, అత్తమామలకు లేని ఇబ్బంది.. ఆ తోటికోడలికి ఎందుకు వచ్చిందో ఏమో కానీ, ఏకంగా కుటుంబాన్నే కులం నుంచి వెలివేయాలని పంచాయతీ పెట్టింది.

Andhra Pradesh: ఇదేం పంచాయతీ రా నాయనా.. మొగుడు కొట్టినందుకు కాదు.. తోటికోడలు నవ్వినందుకు అన్నట్లుంది కథ..
Inter Caste Marriage Dispute In Prakasam
Fairoz Baig
| Edited By: |

Updated on: Feb 09, 2026 | 6:13 PM

Share

విచిత్రమైన సమస్యతో ఓ ప్రేమజంట ప్రకాశం జిల్లా పోలీసులను ఆశ్రయించారు. వీరిద్దరి కులాలు వేరైనా వీరి ప్రేమను ఇరువైపులా తల్లిదండ్రులు అంగీకరించడంతో హాయిగా పెళ్లి చేసున్నారు. అయితే ఆమె తోటికోడలుకు కులం సమస్య వచ్చిపడిందట. తన కన్నా తక్కువ కులానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మరిదిని, అందుకు సపోర్ట్‌ చేసిన తన భర్త, అత్తమామలను కులం నుంచి వేలేయాలని పంచాయతీ పెట్టించింది. దీంతో ఈ పంచాయతీ పోలీసుల దగ్గరకు చేరింది. టెక్నాలజీ ఇంతగా అభివృద్ది చెందిన ప్రపంచం గ్లోబల్‌ విలేజ్‌గా మారిన ఈ కాలంలో కూడా ఈ కులం గొడవలేంటయ్యా అంటూ పోలీసులు తలలు బాదుకుంటున్నారు.

భర్త, అత్తమామలకు లేని ఇబ్బంది తోటికోడలుకు ఎందుకంటూ..

ప్రకాశంజిల్లా కొత్తపట్నం మండలం సంకువానికుంటకు చెందిన ఎస్సీ మాల సామాజికవర్గానికి చెందిన చెక్క సాత్విక, అదే మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన గౌడ సామాజికవర్గానికి చెందిన రాకేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరి కులాలు వేరైనా ఇరువైపులా పెద్దలు అంగీకరించడంతో ఆరు నెలల క్రితం పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి ప్రేమ వివాహం సాత్విక తోటికోడలు చాందినికి ఇష్టం లేదు. ఈ క్రమంలో కాపురానికి వచ్చిన తనను తన తోటికోడలు చాందిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కులం పేరుతో దూషిస్తూ, పలుమార్లు దాడికి పాల్పడిందంటూ సాత్విక కొత్తపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఏం కట్లుబాట్లయ్యా బాబూ..

ఆరు నెలల క్రితం కులాలు వేరైనా పెద్దల అంగీకారంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న సాత్విక, రాకేష్‌లు కొత్తపట్నం మండలం రాజుపాలెంలో కాపురం ఉంటున్నారు. అదే ఇంట్లో కాపురం ఉంటున్న వెంకయ్య పెద్ద కోడలు చాందినికి వేరే కులస్థురాలైన సాత్వికతో కలిసి ఉండటం ఇష్టంలేదు. ఈ క్రమంలో తన భర్తతో పాటు అత్తమామలతో తరచూ చాందిని గొడవపడుతోంది. అంతేకాకుండా సాత్వికను ఇంటినుంచి గెంటేయాలని లేకుంటే తమ కులం నుంచి తన అత్తమామలను కూడా వెలేయాలంటూ తన కుల పెద్దలతో పంచాయతీ పెట్టించింది. దీంతో తీవ్ర అవమానానికి గురైన సాత్విక తనను తోటికోడలు చాందిని నుంచి రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త రాకేష్‌, అత్తమామలతో కలిసి కొత్తపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇవి కూడా చదవండి

ఫిర్యాదు చేసినా తనపై చాందిని వేధింపులు ఆపకపోవడంతో ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్‌ సెల్‌లో మరోసారి భర్త, అత్తమామలతో కలిసి వచ్చి ఫిర్యాదు చేసింది. తన భర్త కులం నుంచి తన కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలని చాందిని చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని పోలీసులను వేడుకుంటోంది. అంతేకాకుండా తన తోటికోడలు తన సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులతో కలిసి తప్పుడు ప్రాంసరీ నోటు పత్రాలు సృష్టించి తాము 12 లక్షలు తీసుకున్నామని, ఆ డబ్బులు కట్టకపోతే గ్రామం నుంచి బహిష్కరించే కుట్ర చేస్తున్నారని సాత్విక, ఆమె భర్త రాకేష్‌లు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us