AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రైల్వే ట్రాక్ దగ్గర అనుమానస్పద వ్యక్తులు.. సడెన్‌గా పోలీసుల ఎంట్రీ.. 10 రౌండ్ల కాల్పులతో..

పొన్నూరు మండలం ఆలూరు రైల్వేగేట్ సమీపంలో కాల్పుల కలకలం రేగింది. రైల్వే ట్రాక్ వెంట కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించిన గస్తీలో ఉన్న పోలీసులు.. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు గాల్లోకి 10 రౌండ్ల కాల్పులు జరిపారు.

Andhra Pradesh: రైల్వే ట్రాక్ దగ్గర అనుమానస్పద వ్యక్తులు.. సడెన్‌గా పోలీసుల ఎంట్రీ.. 10 రౌండ్ల కాల్పులతో..
Police Open Fire In Air As Robbers Attack In Guntur
Krishna S
|

Updated on: May 12, 2026 | 8:24 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. పొన్నూరు మండలం ఆలూరు రైల్వేగేట్ సమీపంలో దొంగల ముఠాపై పోలీసులు కాల్పులు జరిపారు. సిగ్నల్ వ్యవస్థను ధ్వంసం చేసి రైలు దోపిడీకి ప్లాన్ చేసిన ముఠాను పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో రైల్వే ట్రాక్ వెంట కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కట్టర్లు, ఇతర మారణాయుధాలతో తిరుగుతుండటాన్ని గస్తీలో ఉన్న పోలీసులు గమనించారు. వారి కదలికలను బట్టి రైలును ఆపి దోపిడీకి పాల్పడే సిగ్నల్ ట్యాంపరింగ్ ముఠాగా గుర్తించారు. పోలీసులు వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, దొంగలు ఒక్కసారిగా పోలీసులపైకి రాళ్లు రువ్వుతూ దాడులకు దిగారు. దీంతో పోలీసులు గాల్లోకి 10 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులతో షాక్ తిన్న దొంగలు, పట్టుబడతామనే భయంతో పారిపోయారు.

షూట్ అవుట్ హెచ్చరిక

గుంటూరు రైల్వే రూట్‌లో గత కొంతకాలంగా దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. సరిగ్గా నెల రోజుల క్రితం ఇదే రూట్‌లో ఒకేసారి 5 కోచ్‌లలోకి చొరబడిన దొంగలు, ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసి భారీగా బంగారం, నగదు దోచుకెళ్లారు. ఈ ముఠా రైల్వే సిగ్నల్ వ్యవస్థను దెబ్బతీసి రైలు ఆగేలా చేస్తారు. రైలు ఆగగానే బోగీల్లోకి చొరబడి మెరుపు దాడి చేస్తారు. ఈ వరుస ఘటనలను సీరియస్‌గా తీసుకున్న రైల్వే పోలీసులు.. ‘‘సిగ్నల్ ట్యాంపరింగ్‌కు పాల్పడితే షూట్ అవుట్ తప్పదు’’ అని ఇటీవలె బహిరంగంగా హెచ్చరించారు.

అప్రమత్తమైన రైల్వే శాఖ.. గాలింపు ముమ్మరం

ఈ ఘటన తర్వాత రైల్వే అధికారులు, పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆలూరు ప్రాంతంలో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. పరారీలో ఉన్న దొంగల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. రైల్వే ట్రాక్ భద్రతపై ప్రయాణికులు ఆందోళన చెందకుండా పెట్రోలింగ్‌ను పెంచారు.

Follow Us