ఉత్తరాంధ్ర గేమ్ ఛేంజర్.. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..
ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖకు 45 కిలోమీటర్ల దూరంలో 2,200 ఎకరాల్లో నిర్మించిన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు గేమ్ ఛేంజర్‌గా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం కానుంది. విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం కోసం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కె. అచ్చెన్నాయుడు, వంగాలపూడి అనిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర సంస్కృతిని, కళా వారసత్వాన్ని ప్రతిబింభించేలా ఉండాలని, గిరిజన సంప్రదాయాలు, స్థానిక హస్తకళల ప్రదర్శనతో ఈ ప్రాంతపు ఉత్సాహాన్ని ప్రతిబింబించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యువతను, విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ఈ వేడుకను ఒక పండుగలా నిర్వహించాలని చంద్రబాబు సూచించారు.
మారనున్న ఉత్తరాంధ్ర రూపురేఖలు
2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకున్న ఈ ప్రాజెక్టును, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి, యుద్ధ ప్రాతిపదికన రెండేళ్లలోనే పూర్తి చేసింది. నీటిపారుదల, రహదారులు, ఓడరేవులు వంటి మౌలిక సదుపాయాలతో పాటు ఇప్పుడు విమానాశ్రయం కూడా అందుబాటులోకి వస్తుండటంతో, ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ఆర్థిక స్వరూపాన్ని సమూలంగా మార్చే గేమ్ ఛేంజర్ కానుందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు శంషాబాద్ విమానాశ్రయం ఏ విధంగా అయితే భారీ అభివృద్ధిని తీసుకువచ్చిందో, భోగాపురం విమానాశ్రయం కూడా ఉత్తరాంధ్రకు అదే స్థాయి అభివృద్ధి తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎయిర్ పోర్టు పర్యాటకం, పారిశ్రామికాభివృద్ధికి ఉత్ప్రేరకంగా పనిచేయడమే కాకుండా, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించి, సంపదను పెంపొందిస్తుందన్నారు.
విశాఖ నగరానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో..
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద, విశాఖ నగరానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి-16కు సమీపంలో సుమారు 2,200 ఎకరాల విస్తీర్ణంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. 2019 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2024 సెప్టెంబర్‌లో ఈ విమానాశ్రయానికి ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’గా నామకరణం చేశారు. ప్రస్తుతం విశాఖ నగరంలోని ఐఎన్ఎస్ డేగా నేవల్ ఎయిర్‌బేస్ నుంచి కొనసాగుతున్న పౌర విమానయాన కార్యకలాపాలు దశలవారీగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు మారనున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
