AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: శ్రీశైలం వెళ్లేవారికి అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ..

శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు నల్లమల అడవిలో ప్రత్యేక ఆంక్షలు విధించింది. దీంతో అటవీ ప్రాంతం గుండా శ్రీశైలం వెళ్లేవారు దీని గురించి తెలుసుకోవాల్సిందే..

Srisailam: శ్రీశైలం వెళ్లేవారికి అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ..
Srisailam
M Sivakumar
| Edited By: |

Updated on: Jul 01, 2026 | 7:11 PM

Share

శ్రీశైలం వెళ్లే భక్తులు, నల్లమల అటవీ ప్రాంతాన్ని సందర్శించాలనుకునే పర్యాటకులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సమాచారం ఇది. నల్లమల అడవిలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ అటవీ శాఖ జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ మూడు నెలల పాటు అడవిలోని పలు ప్రాంతాల్లో పర్యాటకుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నారు. నాగార్జునసాగర్– శ్రీశైలం పులి అభయారణ్యం దేశంలోనే ప్రముఖ పులుల సంరక్షణ కేంద్రాల్లో ఒకటి. వర్షాకాలం పులుల సంతానోత్పత్తికి అత్యంత కీలకమైన సమయం కావడంతో వాటి సహజ జీవనానికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో అడవిలో మనుషుల రాకపోకలు తగ్గించడం ద్వారా పులులు స్వేచ్ఛగా సంచరించడంతో పాటు సంతానోత్పత్తికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అదే సమయంలో వన్యప్రాణులు అడవిలోకి వచ్చే వారిపై దాడి చేసే ప్రమాదం కూడా ఉండటంతో భద్రతా దృష్ట్యా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నారు…

జూలై నుంచి సెప్టెంబర్ వరకు నల్లమలలో నిర్వహించే జంగిల్ సఫారీలు పూర్తిగా రద్దు చేశారు. మార్కాపురం, ఆత్మకూరు, నంద్యాల అటవీ డివిజన్ల పరిధిలోని సఫారీ సేవలు ఈ కాలంలో అందుబాటులో ఉండవు. అలాగే అడవి ప్రాంతంలోని ఇష్టకామేశ్వరీ దేవాలయం, రుద్రకోడూరు క్షేత్రం, గుండ్ల బ్రహ్మేశ్వర ఆలయాల సందర్శనకు కూడా అనుమతి ఇవ్వరు. కాబట్టి ఈ ప్రాంతాలకు వెళ్లే యాత్రికులు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలను సవరించుకోవాలని అధికారులుసూచిస్తున్నారు. అయితే శ్రీశైలం ప్రధాన ఆలయ దర్శనానికి సాధారణ రహదారుల ద్వారా వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. బఫర్ జోన్ పరిధిలోని కొన్ని ఎకో టూరిజం కేంద్రాలు మాత్రం పరిస్థితులను బట్టి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న అటవీ శాఖ, ఈ ఆంక్షలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేసింది. నల్లమల అడవిలో పులులతో పాటు చిరుతలు, ఎలుగుబంట్లు, దుప్పులు, అనేక రకాల పక్షులు నివసిస్తున్నాయి..

వర్షాకాలంలో వీటి జీవచక్రం అత్యంత కీలక దశలో ఉండటంతో అడవిలో మానవ జోక్యం తగ్గించడం వల్ల జీవవైవిధ్య పరిరక్షణకు ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏడాది అమలు చేసే ఈ చర్యలు పులుల సంఖ్య పెరగడానికి కూడా దోహదపడుతున్నాయని అటవీ శాఖ పేర్కొంటోంది. అందువల్ల నల్లమల వెళ్లే భక్తులు, పర్యాటకులు ముందుగానే తాజా మార్గదర్శకాలను తెలుసుకుని ప్రయాణం ప్లాన్ చేసుకోవడం మంచిది.

Follow Us