విశాఖపట్నం, ఆగస్టు28: – భారత్ చంద్రుడు పై అడుగుపెట్టినా.. తమకు మాత్రం చీకటి నుంచి విముక్తి కలగడం లేదని ఆ గిరిజనుల ఆవేదన. అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేదు.. ప్రజా ప్రతినిధులకు మొరపెట్టిన వినే వాడే లేడు. దీంతో చిమ్మ చీకటిలో దివిటీలు పట్టుకొని పాదయాత్రతో నిరసన తెలిపారు గిరి పుత్రులు. తమ మొర ఆలకించి సమస్య తీర్చాలంటూ వేడుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపెల్లి, ఎన్ ఆర్ పురం పంచాయతీ పరిధిలో కొండ శిఖర గ్రామాలు 8 గ్రామాల్లో1500 మంది జనాభా నివాసముంటున్నారు. వాళ్లకు సూర్యాస్తమయం అయితే జీవితం అంధకారమే. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు గడుస్తున్నా.. భారత్ చంద్రునిపై అడుగుపెట్టినా .. ప్రపంచం ఆధునికత వైపు పరుగులు పెడుతున్న.. ఆ గ్రామ ప్రజలకు మాత్రం ఇంకా అంధకారమే. కరెంటు సౌకర్యం లేక చీకటి పడితే చాలు బిక్కు బిక్కుమంటూ ఆ జీవనమే.
చిమ్మ చీకట్లో దివిటీలతో నిరసన..
– బూరిగ, చిన్నకోనిల, బొంగిజ, రాయిపాడు, బెంజిన్ వలస, గూడెం, దెబ్బలపాడు, కరకవలస గ్రామాల్లో కొండదొర తెగ ఆదివాసి గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. కరెంటు సౌకర్యం కల్పించాలంటూ.. కనిపించిన వారందరినీ అభ్యర్థించారు కానీ ఫలితం లేదు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వస్తున్న నాయకులు ఆ తర్వాత ముఖం చాటేస్తున్నారు. దీంతో.. ఇక చేసేది లేక నిరసన బాట పట్టారు. రాత్రి బొంగిజ గ్రామంలో గ్రామంలో కాగడాల చేతబట్టి.. చిమ్మ చీకట్లో రాయిపాడు. చిన్న కోనల. బూరుగు వరకు పాదయాత్ర చేస్తూ నిరసన తెలిపారు. చీకటిలో నడుచుకుని వెళ్తూ తమ బాధను చెబుతున్నారు. ఎన్నాళ్ళీ చీకటి బతుకులు అంటూ ప్రశ్నిస్తున్నారు.
మా గ్రామాల్లో ఒకరోజు గడపండి..
– వెలుతురులో సుఖాలు అనుభవించే అధికారులు ప్రజాప్రతినిధులు.. ఒకరోజు తమ గ్రామంలోని చీకటిలో గడిపితే తమ బాధలు తెలుస్తాయని అంటున్నారు. డిజిటలైజేషన్ వైపు భారత్ పరుగులు పెడుతున్న.. టీవీ చూసే భాగ్యం కూడా తమకు కలగలేదని వాపోతున్నారు. తమ గ్రామాల్లోని యువతకు పెళ్లి సంబంధం తెలుసుకునేందుకు ఎవరు ముందుకు రావడం లేదని.. శుభ కార్యాలైన పండగలైన భోగి మంటలు వేసుకొని ఆ వెలుతురులోనే గడపాల్సిన పరిస్థితిలో ఏర్పడ్డాయని అంటున్నారు బూరుగ గ్రామానికి చెందిన గిరిజనుడు పెంటయ్య, చినకోనల గ్రామానికి చెందిన సింహాచలం.
– ఇప్పటికైనా తన గోడు విని అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించి జీవితాల్లో వెలుగులు నింపాలని వేడుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి…