Andhra: ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్ గరుడ పేరుతో దాడులు
మెడికల్ మాఫియాపై ఏపీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆపరేషన్ గరుడ పేరుతో.. అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో తనిఖీలు చేసిన అధికారులు... కీలక విషయాలు గుర్తించారు. ఈ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఆదేశాల మేరకు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (వి అండ్ ఇ) విభాగం, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఈగిల్ యూనిట్, స్థానిక పోలీసు దళాల సహకారంతో నిర్వహించబడుతోంది.

మందుల దుకాణాల పేరుతో పెద్ద దందా నడుస్తోంది. దీంతో ఆపరేషన్ గరుడ పేరుతో ఏపీ వ్యాప్తంగా మెడికల్ షాపులు, ఏజెన్సీలపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈగల్ టీమ్స్, పోలీస్, మెడికల్ అధికారులు కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ గరుడ కోసం మొత్తం 100 టీమ్‌లు రంగంలోకి దిగాయి. ఈ తనిఖీల్లో నిషేధిత మందుల సరఫరా, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్ తరహాలో వాడేందుకు కొన్ని రకాల టాబ్లెట్లు, ఇంజెక్షన్లను మెడికల్ షాపుల నుంచి యువత కొనుగోలు చేస్తున్నట్లు సమాచారంతో అధికారులు మెడికల్ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మెడికల్ షాపుల్లో మందుల నాణ్యత, రికార్డులను అధికారులు పరిశీలించారు.
ఈ తనిఖీల్లో కీలక విషయాలు గుర్తించారు అధికారులు. చాలా చోట్లు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్నట్లు తేలింది. ఇకపై ఇలా అనుమతుల్లేకుండా విక్రయిస్తే కేసులు తప్పవని అధికారులు హెచ్చరించారు. ప్రిస్క్రిప్షన్ మీద అమ్మాల్సిన మందులు మాత్రమే మందుల షాపులో విక్రయించాలని సూచించారు. శాంపిల్ డ్రగ్స్ అమ్మినా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. NRX డ్రగ్స్‌ను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టిపరిస్థితుల్లో అమ్మకూడదని, కొన్నిచోట్ల అనధికారికంగా న్యూ డ్రగ్స్‌ని ప్రిస్కిప్షన్ లేకుండా అమ్ముతున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చాయని డ్రగ్స్ కంట్రోల్, విజిలెన్స్ అధికారులు చెప్పారు. షాపులోని మెడిసిన్‌కు సంబంధించిన డేటా మెయింటైన్ చేయట్లేదని అధికారులు తెలిపారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మెడికల్ షాపులకు అనుమతులు లేనట్లు గుర్తించారు. కొన్ని చోట్ల లైసెన్స్ ఒకరిది.. నిర్వహణ మాత్రం మరొకరిది అన్నట్టు ఉంది పరిస్థితి. మెడికల్ షాప్ లో బీ ఫార్మసీ పూర్తి చేసిన వారు లేక, చాలా వరకు సంబంధిత కోర్సు చేసిన వారి సర్టిఫికెట్లు అద్దెకు తెచ్చుకుని లైసెన్స్ తీసుకొని మరి మెడికల్ వ్యాపారం చేస్తున్నారు. వివిధ మందుల కంపెనీల ప్రతినిధులు ఇచ్చే తాయిలాలకు కక్కుర్తి పడి.. రోగులకు అవసరం లేకున్నా ఆయా మందులను అంటగడుగుతున్నారు. ఒకటి రెండు రకాల మందులతో నయం అయ్యే రోగానికి కూడా ఐదారు రకాల కంపెనీల మందులను రాసి కమీషన్ల రూపంలో వైద్యులు తమ జేబులు నింపుకుంటూ ప్రజలను ముంచుతున్నారు. దీంతో పలు షాపులకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఇలా మెడికల్ మాఫియాపై కూడా అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..