Andhra: పోలీసుల ఆకస్మిక తనిఖీలు.. బట్టబయలైన యువతీయువకులు బాగోతం
దొరకనంత వరకు దొరలే. నీట్‌గా డ్రెస్సింగ్ .. పోష్‌గా డ్రైవింగ్.. ఇలా బిల్డప్ ఇచ్చే వాళ్లంతా మంచోళ్లని డిసైడైతే తప్పులో కాలేసినట్టే. మన నీడను మనమే నమ్మలేని రోజులివి. ఇదంతా ఎందుకంటారా..? అనకాపల్లి జిల్లాలో పోలీసులు జరిపిన తనిఖీల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో మీరే చూడండి.

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అసంబద్దంగా, నీళ్లు నములుతూ సమాధానాలిచ్చిన యువతీ, యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లు ఏం చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. వాళ్లు చెప్పిన వివరాలు విని షాక్ అయ్యారు.
కొద్దిరోజులు ఉద్యోగ వేటలో.. సొంతూళ్లకి వెళ్లలేక..
యువతీ యువకులంతా ఈశాన్య రాష్ట్రాలకు చెందినవాళ్లే. ఏదో చిన్నపాటి జాబ్ చేసుకుందామని వచ్చారు. కొద్ది రోజులు ఉద్యోగ వేటలో పడ్డారు. కానీ వాళ్లు అనుకున్న స్థాయి జాబ్ రాలేదు. దీంతో సొంతూళ్లకి వెళ్లలేక..తక్కువ జీతానికి ఉద్యోగాలు చేయలేక.. అసాంఘీక కార్యకలాపాలు షూరూ చేశారు.
ఏజెంట్ల నుంచి ఫోన్ నెంబర్ల సేకరణ
కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన ఈ గ్యాంగ్ ఆన్‌లైన్ మోసాలు.. సైబర్ నేరాలకు పాల్పడుతోంది. అపాయింట్ చేసుకున్న ఏజెంట్ల నుంచి ఫోన్ నెంబర్లు సేకరించడం.. ఓటీపీలతో అకౌంట్లు కొల్లగొట్టడం. ఇలా ఎంతోమంది అకౌంట్లకు కత్తెరేశారు. ఈ గ్యాంగ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌తో ఆన్‌లైన్ చీటింగ్ వ్యవహారం బయటికొచ్చింది.
భోగాపురం, శ్రీరామ్‌పురం లేఅవుట్‌లో తనిఖీలు
ముఠా సభ్యులిచ్చిన సమాచారంతో భోగాపురం, శ్రీరామ్‌పురం లేఅవుట్, రామన్నపాలెంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎంతమంది వచ్చారు.. ఇప్పుడు వాళ్లంతా ఏం చేస్తున్నారనే కోణంలో ఆరాతీస్తున్నారు. లీగల్‌గా ఏం చేసినా ఫర్వాలేదు.. కానీ ఇల్లీగల్‌గా ఎలాంటి కార్యక్రమాలు చేసినా బెండు తీస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి