AP Weather: ఏపీవైపు ఉరుముతూ దూసుకువస్తోన్న వరుణుడు.. 3 రోజుల వానలు దంచుడే
‘నైరుతి’ రుతుపవనాలు మే 23 లేదా 24 నాటికి కేరళలోకి ప్రవేశించడానికి అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26 నాటికి రాయలసీమ మీదుగా ఆంధ్రాలోకి ప్రవేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే వచ్చే 2, 3 రాష్టంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఉత్తర కర్ణాటక-గోవా తీరాల నుండి కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి 3.1కి.మీ ఎత్తు వరకు ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు చెదురుమదురుగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 40-50కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు. పిడుగులతో కూడిన భారీ వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గురువారం(22-05-25) రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు,విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు,బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శుక్రవారం(23-05-25) అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు,శ్రీకాకుళం, విజయనగరం,పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
బుధవారం రాత్రి 7 గంటల నాటికి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 52మిమీ, అనంతపురం జిల్లా చిన్నమూష్టరులో 51.5మిమీ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 50మిమీ, గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో 48మిమీ, కృష్ణా జిల్లా గిలకలడిందిలో 47మిమీ, 43 ప్రాంతాల్లో 30మిమీ కు పైగా వర్షపాతం రికార్డైందన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి