YS Jagan: ఢిల్లీలో సీఎం వైఎస్ జగన్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత.. హస్తిన రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ

|

Aug 08, 2022 | 1:45 PM

నీతి ఆయోగ్‌ సమావేశం అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్వయంగా ప్రధాని మోడీతో కలిసి సీఎం జగన్‌ లంచ్‌ చేశారు.

YS Jagan: ఢిల్లీలో సీఎం వైఎస్ జగన్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత.. హస్తిన రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ
Ys Jagan
Follow us on

PM Modi – YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి హస్తిన రాజకీయాల్లో ప్రాధాన్యత పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్న వైఎస్‌ జగన్‌కు.. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరింత ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు జగన్‌తో స్వయంగా మాట్లాడిన ప్రధాని మోడీ.. మరోసారి జగన్‌తో పలువిషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. దీనికి నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశం వేదికైంది. ఆదివారం ఢిల్లీలో నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ సహా.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్లు, కీలక అధికారులు హాజరయ్యారు. నీతి ఆయోగ్‌ సమావేశం ప్రారంభం నుంచి మధ్యాహ్నం వరకు కీలక చర్చలు జరిగాయి. సమావేశం అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్వయంగా ప్రధాని మోడీతో కలిసి సీఎం జగన్‌ లంచ్‌ చేశారు. దాదాపు ఒంటి గంట నుంచి రెండు వరకూ భోజన కార్యక్రమం కొనసాగగా.. ఆ సమయంలో ప్రధాని మోడీ సీఎం జగన్‌తో పలు అంశాలపై ముచ్చటించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. ప్రభుత్వ నిర్ణయాలు, సంక్షేమ పథకాలు, విడుదల చేయాల్సిన నిధుల గురించి ప్రధాని.. సీఎంతో స్వయంగా మాట్లాడినట్లు సమాచారం. నీతి ఆయోగ్‌ సమావేశానికి బీజేపీ అధికారంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు హాజరైనప్పటికీ.. ప్రధాని మోడీ వారిని కాదని జగన్‌కు ప్రాధాన్యం ఇవ్వడం హస్తిన రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది.

ప్రధాని మోడీ కూర్చున్న లంచ్‌ టేబుల్‌పై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, రాజస్థాన్‌ సీఎం గెహ్లాట్, అసోం సీఎం హిమంత్‌ బిశ్వాస్‌ శర్మ, ఇద్దరు లెఫ్టినెంట్‌ గవర్నర్లు కూర్చున్నారు. ఆ రకంగా ప్రధాని మోడీ.. సీఎం జగన్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం.. ఢిల్లీ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్ గా మారింది. విపక్షాలను ఏకం చేసేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఏపీలో అధికారంలో ప్రధాని మోడీ జగన్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఆసక్తికర పరిణామం. ఓ వైపు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ వ్యవహరించిన తీరు.. మరోవైపు దేశ రాజకీయాల్లో వైసీపీ వైఖరి కారణంగా ఈ అవకాశం లభించినట్లు పార్టీ ప్రముఖులు చెబుతున్నారు. ఒకే టేబుల్‌పై ప్రధాని మోడీతో కలిసి జగన్‌ను కూర్చొని లంచ్‌ చేయడం.. వైసీపీ అధినేతకు హస్తిన రాజకీయాల్లో పెరుగుతున్న ప్రాధాన్యతకు తార్కాణంగా ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. గతంలో చంద్రబాబుకు జాతీయ రాజకీయాల్లో లభించిన గుర్తింపు ఇప్పుడు జగన్‌కు వస్తోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Pm Modi Ys Jagan

కాగా.. అంతకుముందు రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలోని అధికార పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ రెండూ కూడా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతునిచ్చాయి. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం అనంతరం.. కేంద్రం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పిలుపువచ్చింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ.. చంద్రబాబుతో కొన్ని నిమిషాల పాటు మాట్లాడారు. ఆ తర్వాత.. నీతి ఆయోగ్‌ సమావేశంలో సీఎం జగన్‌తో దాదాపు గంటపాటు ప్రధాని మోడీ మాట్లాడటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..