Nayanthara Vignesh: తిరుమాఢవీధుల్లో చెప్పులతో నయనతార దంపతుల నడక.. అపచారమంటున్న తిరుమల శ్రీవారి భక్తులు

పెళ్లైన వెంటనే భర్తతో కలిసి శ్రీవారి దర్శనానికి తిరుమల వచ్చిన నయనతార అపచారానికి పాల్పడ్డారు. భర్త విఘ్నేశ్‌తో కలిసి శ్రీవారి దర్శనానికి ఈ మధ్యాహ్నం నయనతార తిరుమల వచ్చారు. ఇది సంతోషకరమైన విషయమే. కాని..

Nayanthara Vignesh: తిరుమాఢవీధుల్లో చెప్పులతో నయనతార దంపతుల నడక.. అపచారమంటున్న తిరుమల శ్రీవారి భక్తులు
Nayanatara
Follow us

|

Updated on: Jun 10, 2022 | 5:59 PM

మహబలిపురం సముద్ర ఒడ్డున నిన్న వివాహం చేసుకున్న నయనతార దంపతులు(Nayanthara) 24 గంటలు గడవకముందే వివాదంలో చిక్కుకున్నారు. పెళ్లైన వెంటనే భర్తతో కలిసి శ్రీవారి దర్శనానికి తిరుమల వచ్చిన నయనతార అపచారానికి పాల్పడ్డారు. భర్త విఘ్నేశ్‌తో కలిసి శ్రీవారి దర్శనానికి ఈ మధ్యాహ్నం నయనతార తిరుమల వచ్చారు. ఇది సంతోషకరమైన విషయమే. కాని, శ్రీవారి సన్నిధికి ఆమె చెప్పులు వేసుకొని రావడం, మాడవీధుల్లో చెప్పులతో తిరగడం భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. వెంట వచ్చిన ఆమె భర్త విఘ్నేశ్‌ చెప్పులు వేసుకోలేదు. చెప్పులు వేసుకొని అపచారానికి పాల్పడటమే కాదు, శ్రీవారి సన్నిధిలో ఆలయం ముందు నయనతార, విఘ్నేశ్‌ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. వీళ్లను షూట్‌ చేసేందుకు వచ్చిన కెమెరామెన్లు, ఫొటోగ్రాఫర్లు కూడా చెప్పులు, షూస్‌ వేసుకొని మాడవీధుల్లో తిరిగారు. అంతే కాదు శ్రీవారి సన్నిధిలో సన్నిహితంగా నిల్చొని నయనతార, విఘ్నేశ్‌ ఫొటోలకు పోజులివ్వడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు. దైవసన్నిధిలో ఉన్నామనే విషయాన్ని మరిచిపోయి ఇంటిమేట్‌ పోజులిచ్చి ఫొటోలు దిగడమేంటని ప్రశ్నిస్తున్నారు.

స్వామివారి సన్నిధిలో ఇంత జరుగుతున్నా భద్రతా సిబ్బంది ఎక్కడా కనిపించలేదు. శ్రీవారి సన్నిధిలో చెప్పులు వేసుకోవడం నిషేధం. శ్రీవారి ఊరేగింపు మాడవీధుల్లోనే జరుగుతుంది. సాధారణ భక్తులు సహ వీఐపీలు కూడా దూరంగానే చెప్పులు వదిలి మాడవీధుల్లోకి వస్తారు. అలాంటిది నయనతార చెప్పులు వేసుకొని తిరగడం, భక్తుల మనోభావాలు ఏ మాత్రం పట్టించుకోకుండా కెమెరా సిబ్బంది బూట్లతో పవిత్రమైన శ్రీవారి సన్నిధిలో తిరగడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు.

వాస్తవానికి నయనతార, విఘ్నేశ్‌ తిరుమలలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాని అనివార్య కారణాలతో వివాహ వేదికను మహబలిపురానికి మార్చారు. శ్రీవారి సన్నిధిలో వివాహం చేసుకోవాలనుకున్న జంటకు అక్కడ అనుసరించాల్సిన విధానాలు తెలియవా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

తిరుమాడ వీధుల్లో చెప్పులు వేసుకొని తిరగరాదనే బోర్డులు తిరుమల అనేక చోట్ల కనిపిస్తాయి. తెలుగు, ఇంగ్లిష్‌లో ఈ బోర్డులను టీటీడీ అనేక ప్రాంతాల్లో ఏర్పాట చేసింది. అంతే కాదు మైకుల ద్వారా కూడా టీటీడీ ఈ విషయాలను అనౌన్స్ చేస్తూ ఉంటుంది. సాధారణ భక్తులు ఎవరూ కూడా చెప్పులు వేసుకొని ఆలయం ముందుకు రారు.

పవిత్రమైన తిరుమల సన్నిధిని నయనతార దంపతులు సినిమా స్పాట్‌గా మార్చుకున్నారని జనసేన నేత కిరణ్‌ రాయల్‌ ఆరోపించారు. శ్రీవారి సన్నిధిలో సామాన్యులకో పద్ధతి, సెలబ్రిటీలకు ఒక పద్ధతి ఉంటుందా అని ప్రశ్నించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..