Andhra News: అర్థరాత్రి అటవీలో తవ్వకాలు.. బయటపడిన 2 లంకెబిందెలు.. ఓపెన్ చేయగా
ప్రకాశం జిల్లా పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గుప్తనిధుల వేటగాళ్లు, వన్యప్రాణుల వేటగాళ్లు రెచ్చిపోతుండటంతో పలువురు అటవీశాఖ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గిద్దలూరు డివిజనల్ ఫారెస్ట్ పరిధిలోని తురిమెళ్ల రేంజ్ ఆరవీటికోట సెక్షన్‌లో చోటుచేసుకున్న గుప్తనిధుల అక్రమ తవ్వకాలు, పులిని వేటాడి చంపిన కేసుకు సంబంధించి లోతైన విచారణ జరిపిన అధికారులు మొత్తం ముగ్గురు ఫారెస్ట్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు.

మూడు నెలల కిందట ఎర్రగొండపాలేనికి చెందిన గుప్తనిధుల ముఠాను విచారించిన క్రమంలో అటవీశాఖ ఉన్నతాధికారులకు కొంతమేర రహస్య సమాచారం అందింది. దట్టమైన అడవిలో వన్యప్రాణుల కోసం నీటి కుంటలు తవ్వుతున్నట్టుగా చెబుతూ పొక్లెయిన్‌తో అర్ధరాత్రి వేళల్లో తవ్వకాలు చేపట్టారు. గుట్టుచప్పుడు కాకుండా జరిపిన ఈ తవ్వకాల్లో ప్రాచీన కాలం నాటి లంకెబిందెలుగా భావించిన రెండు పెద్ద మట్టి కుండలు బయటపడ్డాయి. ఈ కుండల్లో విలువైన బంగారు నగలు, వజ్రాలు ఉన్నాయని, వాటిని అటవీ సిబ్బంది గుట్టుగా హైదరాబాద్, బెంగళూరులకు తరలించి విక్రయించారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ, పోలీసు అధికారులు వెంటనే విచారణ చేపట్టారు.
మరోవైపు ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పురావస్తు శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, అది దాదాపు 2,500 ఏళ్ల నాటి బృహత్ శిలాయుగ సంస్కృతికి చెందిన సమాధుల ప్రదేశమని, అక్కడ లభించిన మట్టి కుండల్లో బంగారు నగలు, వజ్రాలు ఉండే అవకాశం లేదని తేల్చారు. ఏది ఏమైనా ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అభయారణ్యంలో పొక్లెయిన్‌తో తవ్వకాలు జరపడం, ఆ దృశ్యాలను వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని అటవీశాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు కింది స్థాయి అటవీశాఖ సిబ్బందిని సస్పెండ్ చేయగా, తాజాగా ఓ రేంజ్ అధికారిపై వేటు వేసినట్టు తెలిసింది.
ఒకవైపు గుప్తనిధుల తవ్వకాల వివాదం అటవీ శాఖను కుదిపేస్తుండగా, అదే గిద్దలూరు డివిజన్ నాగార్జునసాగర్ పరిధిలోని శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న పెద్దపులి అనుమానాస్పద మృతి మరింత కలకలం రేపింది. గిద్దలూరు డివిజన్‌లోని రాచర్ల అటవీ బీట్ తెట్లమడుగు ప్రాంతంలో పులి కళేబరం లభ్యమైంది. వేటగాళ్లు దానిని తుపాకీతో కాల్చి చంపి, కాళ్లను నరికి గోళ్లను ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. పులి గోళ్లను అక్రమ రవాణా చేశారని తేల్చారు.
పులిని చంపిన దారుణ ఘటనపై పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. వన్యప్రాణుల రక్షణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరిస్తూ ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో హనుమాన్ ప్రాజెక్ట్ డాగ్ స్క్వాడ్ సాయంతో అటవీ, పోలీసు శాఖలు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో ఇప్పటికే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి పులిగోళ్లు, వేటకు ఉపయోగించిన నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
ఒకవైపు నల్లమల అడవుల్లో వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలతో వేటగాళ్ల ఉచ్చులకు పులులు ప్రాణాలు విడుస్తుంటే, మరోవైపు అడవిని కాపాడాల్సిన అధికారులే స్వయంగా తవ్వకాలకు తెగబడుతూ కంచే చేను మేసిన చందంగా వ్యవహరించడం అటవీశాఖలో కలకలం రేపింది. ఈ వరుస ఘటనలపై తాజాగా చేపట్టిన సస్పెన్షన్ చర్యలతోనైనా క్షేత్రస్థాయి సిబ్బందిలో జవాబుదారీతనం పెరుగుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వన్యప్రాణుల రక్షణ, అటవీ గ్రామాల సరిహద్దు ప్రాంతాల భద్రతపై గిద్దలూరు డివిజన్ అటవీశాఖ అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
