Rohit Sharma: తూచ్ అవన్నీ వట్టి పుకార్లే.. రోహిత్ శర్మ భవిష్యత్ పై బీసీసీఐ కార్యదర్శి క్లారిటీ
Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జీత్ సైకియా కొట్టిపారేశారు. రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని, ఆధారాలు లేని పుకార్లను నమ్మొద్దని స్పష్టం చేశారు. 2027 ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ లేడనే ప్రచారానికి క్లారిటీ ఇచ్చారు. అజిత్ అగార్కర్ గైర్హాజరు, ఆటగాళ్ల గాయాలు, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవిపైనా కీలక విషయాలు వెల్లడించారు.

Rohit Sharma: భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ నిర్వహించిన రివ్యూ మీటింగులో అత్యంత కీలక నిర్ణయం వెలువడింది. ముంబైలో జరిగిన ఈ కీలక భేటీ ముగిసిన తర్వాత బోర్డు కార్యదర్శి దేవ్ జీత్ సైకియా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రచారంపై క్లారిటీ ఇస్తూ మీడియాకు బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. రోహిత్ శర్మ వన్డే కెరీర్ ముగిసిపోయిందని, వచ్చే 2027 ప్రపంచకప్ ప్రణాళికల్లో ఆయన లేరంటూ గత కొద్ది రోజులుగా సాగుతున్న ప్రచారానికి బీసీసీఐ కార్యదర్శి దేవ్ జీత్ సైకియా తెరదించారు. “రోహిత్ శర్మ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. దయచేసి ఎలాంటి ఆధారాలు లేని పుకార్లను నమ్మవద్దు, ప్రోత్సహించవద్దు” అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే టెస్టులు, టీ20 మ్యాచ్‌ల నుంచి తప్పుకున్న రోహిత్ ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లోనే కొనసాగుతున్నారు. సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు ఆయనను ఎంపిక చేయరని వస్తున్న వార్తలను బోర్డు తోసిపుచ్చింది.
మీటింగ్‌కు అగార్కర్ గైర్హాజరు
ముంబైలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ రివ్యూ మీటింగుకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్, టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హాజరయ్యారు. అయితే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ సమావేశానికి రాకపోవడమే కాకుండా కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కనెక్ట్ కాకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. రోహిత్ శర్మ విషయంలో సెలెక్షన్ కమిటీకి, బోర్డు పెద్దలకు మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయనే వార్తలకు ఇది మరింత బలం చేకూర్చింది. అయితే ఈ భేటీ అత్యవసరంగా, అకస్మాత్తుగా ఏర్పాటు చేయడం వల్లే అగార్కర్ వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోయారని సైకియా స్పష్టం చేశారు.
ఆటగాళ్ల గాయాలపై తీవ్ర ఆందోళన
ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా జట్టులోని కీలక ఆటగాళ్లు పదే పదే గాయాల పాలుకావడం, వారి కోలుకునే ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు. కొందరు ఆటగాళ్లు పదే పదే ఎన్‌సిఏ (నేషనల్ క్రికెట్ అకాడమీ) బాట పడుతుండటం మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. “ఆటగాళ్లు తరచూ గాయపడటం నిజంగా ఆందోళన కలిగించే విషయం. దీనిని తీవ్రంగా పరిగణించి రాబోయే రోజుల్లో కఠినమైన చర్యలు తీసుకుంటాం” అని బీసీసీఐ స్పష్టం చేసింది.
డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవిపై క్లారిటీ
గత కొద్దిరోజులుగా బీసీసీఐ కొత్తగా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ అనే హోదాను సృష్టించి, ఆ బాధ్యతలను వీవీఎస్ లక్ష్మణ్‌కు అప్పగించనుందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే సమావేశం అనంతరం ఈ వార్తలను కార్యదర్శి పూర్తిగా ఖండించారు. ప్రస్తుతానికి అలాంటి పదవిని ఏర్పాటు చేసే ఆలోచన ఏదీ బోర్డు వద్ద లేదని తేల్చి చెప్పారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
