AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Mining: ఏపీ నేలలో ఖనిజ బంగారం.. రాష్ట్రానికి దక్కే అసలు ఆదాయం ఎంత..?

కడప బేసిన్‌లో లిథియం, గ్యాలియం ఆనవాళ్లు బయటపడటంతో ఇప్పుడు యావత్ దేశం దృష్టి ఆంధ్రప్రదేశ్‌పైనే ఉంది. ఖనిజాల విస్తృత అన్వేషణ కోసం దాదాపు రూ.140 కోట్లతో కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే కడపలో భారీగా లిథియం, గ్యాలియం నిల్వలు ఉన్నాయని ఇప్పుడే నిర్ధారించలేం. ప్రస్తుతం ఖనిజాల ఆనవాళ్లు, కొన్ని ప్రాంతాల్లో వాటి సాంద్రత మాత్రమే గుర్తించారు. వాస్తవ నిల్వలు ఎంత, ఎంత లోతులో ఉన్నాయి, వాణిజ్యపరంగా ఎంతవరకు వెలికితీయగలమన్నది పూర్తి స్థాయి అన్వేషణ తర్వాతే క్లారిటీ వస్తుంది.

AP Mining: ఏపీ నేలలో ఖనిజ బంగారం.. రాష్ట్రానికి దక్కే అసలు ఆదాయం ఎంత..?
Andhra Pradesh Mining
Siva Nagaraju
| Edited By: |

Updated on: Sep 03, 2026 | 4:49 PM

Share

మన నేలలో బంగారం ఉంటే మనకు లాభం వస్తుంది. భూమి విలువ పెరుగుతుంది. రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటాం. కానీ నేలలో ఉన్న ప్రతి ఖనిజం విషయంలో లెక్క అంత సులభంగా ఉండదు. ఖనిజాన్ని ఎవరు తవ్వుతారు, ఎవరు అమ్ముతారు, ప్రభుత్వానికి ఎంత వస్తుంది, స్థానికులకు ఏం దక్కుతుంది అన్నదే అసలు విషయం.

తాజాగా కడప బేసిన్‌లో లిథియం, గ్యాలియం ఆనవాళ్లు బయటపడటంతో ఆంధ్రప్రదేశ్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ఈ ఖనిజాల కోసం విస్తృతంగా అన్వేషణ చేపట్టేందుకు దాదాపు రూ.140 కోట్లతో కార్యక్రమం మొదలుకానుంది. అయితే ఇప్పుడే కడపలో ఇన్ని లక్షల టన్నుల లిథియం, ఇంత గ్యాలియం ఉందని చెప్పే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఖనిజం ఉందనే ఆనవాళ్లు, కొన్ని ప్రాంతాల్లో దాని సాంద్రత మాత్రమే గుర్తించారు. ఎంత పరిమాణంలో ఉంది, ఎంత లోతులో ఉంది, ఎంతవరకు తవ్వి బయటకు తీయగలం అన్నది పూర్తి స్థాయి అన్వేషణ తర్వాతే తెలుస్తుంది.

లిథియం అంటే బ్యాటరీకి ప్రాణం

లిథియం పేరు మనకు పెద్దగా తెలియకపోయినా.. మన చేతిలోని మొబైల్‌ ఫోన్‌ నుంచి రోడ్డుపై పరుగులు తీస్తున్న ఎలక్ట్రిక్‌ కార్ల వరకు దీని అవసరం ఉంది. ముఖ్యంగా బ్యాటరీల తయారీలో లిథియం కీలకం. ఎలక్ట్రిక్‌ వాహనాలు పెరగాలన్నా, సౌర విద్యుత్‌, గాలి విద్యుత్‌ను పెద్ద ఎత్తున నిల్వ చేసుకోవాలన్నా బ్యాటరీలు అవసరం. ఆ బ్యాటరీలకు లిథియం ముఖ్యమైన ముడి పదార్థం.

కడప బేసిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో లిథియం సాంద్రత 1,000 పీపీఎం వరకు ఉందని ప్రాథమిక అధ్యయనాల్లో గుర్తించారు. పీపీఎం అంటే పది లక్షల భాగాల్లో ఎంత భాగం ఉందన్న లెక్క. 1,000 పీపీఎం అంటే ఒక కిలో రాతిలో సుమారు ఒక గ్రాము లిథియం ఉందని చెబుతారు. అయితే ఈ లెక్కను మొత్తం కడప ప్రాంతానికి వర్తింపజేయలేం. ఖనిజం ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎంత మందం ఉంది, ఎంత శాతం వెలికితీయగలం అన్నది ఇంకా తేలాల్సి ఉంది.

గ్యాలియం.. భవిష్యత్తు చిప్‌లకు కీలకం

గ్యాలియం పేరు మనకు అంతగా తెలియదు. కానీ ఆధునిక టెక్నాలజీలో దీని ప్రాధాన్యం ఎక్కువ. గ్యాలియం ఆధారిత పదార్థాలను సెమీకండక్టర్ల తయారీలో ఉపయోగిస్తున్నారు. 5జీ పరికరాలు, రాడార్లు, రక్షణ రంగంలోని ఎలక్ట్రానిక్‌ పరికరాలు, హైటెక్‌ పరికరాల్లో వీటి అవసరం ఉంది. కడప బేసిన్‌లో కొన్ని ప్రాంతాల్లో గ్యాలియం సాంద్రత 250 పీపీఎం వరకు ఉందని గుర్తించారు. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ప్రపంచ గ్యాలియం సరఫరాలో చైనాకు భారీ ఆధిపత్యం ఉంది. అందుకే దేశంలోనే గ్యాలియం వనరులను గుర్తించడం భవిష్యత్తులో భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకం కావచ్చు.

మన దేశంలో లిథియం ఎక్కడుంది

కడపతో పాటు దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా లిథియం వనరులు గుర్తించారు. జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో దాదాపు 5.9 మిలియన్‌ టన్నుల లిథియం రిసోర్స్‌ గుర్తించారు. అంటే సుమారు 59 లక్షల టన్నులు. కర్ణాటకలోని మండ్య ప్రాంతంలో కూడా సుమారు 1,600 టన్నుల లిథియం రిసోర్స్‌ గుర్తించారు. అయితే ఇక్కడ రిసోర్స్‌, రిజర్వ్‌ రెండూ ఒకటి కావు. భూమిలో ఖనిజం ఉందని గుర్తించడం ఒకటి. దాన్ని వాణిజ్యంగా తవ్వి బయటకు తీసి అమ్మగలిగే స్థాయిలో ఉండటం మరోటి.

ఏపీకి కొత్త ఖనిజాలతో పాటు పాత సంపద కూడా ఉంది ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే ఎన్నో ఖనిజాలకు పెట్టింది పేరు. దేశంలోని బరైటీస్‌ వనరుల్లో దాదాపు 92 శాతం ఏపీ వాటానే. లైమ్‌స్టోన్‌, ఇనుప ఖనిజం కూడా రాష్ట్రానికి పెద్ద సంపద. 2023–24లో ఏపీలో దాదాపు 6 కోట్ల టన్నుల లైమ్‌స్టోన్‌ ఉత్పత్తి జరిగింది. రాష్ట్రంలో సుమారు 1,938 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజ వనరులు ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అంటే లిథియం, గ్యాలియం కొత్తగా వెలుగులోకి వచ్చిన సంపద అయితే.. బరైటీస్‌, లైమ్‌స్టోన్‌, ఐరన్‌ ఓర్‌ లాంటి ఖనిజాలు ఏపీకి ఎప్పటి నుంచో ఉన్న సహజ సంపద.

ఖనిజాల నుంచి ప్రభుత్వానికి ఎంత ఆదాయం

ఇక్కడే అసలు లెక్క మొదలవుతుంది. 2023–24లో ఏపీకి ఖనిజ రంగం నుంచి దాదాపు రూ.3,392 కోట్ల ఆదాయం వచ్చింది. మేజర్‌ మినరల్స్‌ నుంచి సుమారు రూ.1,079 కోట్లు, మైనర్‌ మినరల్స్‌ నుంచి రూ.2,062 కోట్లు, ఇసుక నుంచి దాదాపు రూ.251 కోట్లు వచ్చాయి. అయితే ఖనిజాల మొత్తం అమ్మకపు విలువ అంతా ప్రభుత్వానికి రాదు. కంపెనీలు ఖనిజాన్ని తవ్వి అమ్ముతాయి. ప్రభుత్వం రాయల్టీ, ఫీజులు, ఇతర చట్టబద్ధమైన చెల్లింపుల రూపంలో ఆదాయం పొందుతుంది. అందుకే ఖనిజం మార్కెట్‌ విలువ, కంపెనీకి వచ్చే ఆదాయం, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం.. మూడు వేర్వేరు లెక్కలు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత…

2025–26లో ఏపీ గనుల శాఖ దాదాపు రూ.3,416 కోట్ల ఆదాయం సాధించింది. 2026–27లో రూ.4,650 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. 2023–24లో వచ్చిన రూ.3,392 కోట్లతో పోలిస్తే ఈ లక్ష్యం రూ.1,258 కోట్లు ఎక్కువ. అంటే దాదాపు 37 శాతం పెరుగుదల ఉంది. ఇక లిథియం, గ్యాలియం వాణిజ్య స్థాయిలో వెలికితీసే దశకు వస్తే.. ఈ కొత్త ఖనిజాలు రాష్ట్ర ఆదాయంలో ఎంత వాటా తీసుకొస్తాయన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

గతంలో లిథియం, గ్యాలియం తవ్వారా

కడపలో తాజాగా గుర్తించిన లిథియం, గ్యాలియంను గత ప్రభుత్వాలు తవ్వి తీసుకెళ్లారని ఆధారాలు లేవు. ఈ ఖనిజాల విషయంలో ప్రస్తుతం జరుగుతున్నది అన్వేషణ మాత్రమే. అయితే కడప ప్రాంతంలో లైమ్‌స్టోన్‌, బరైటీస్‌ వంటి ఇతర ఖనిజాల తవ్వకాలు మాత్రం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాయి.

కాబట్టి లిథియం, గ్యాలియం విషయంలో అసలు కథ ఇప్పుడు మొదలవుతోంది. ముందుగా ఎంత ఖనిజం ఉందో లెక్క తేలాలి. ఆ తర్వాత తవ్వకం సాధ్యమా, ఎంత ఖర్చవుతుంది, ఏ కంపెనీలు రంగంలోకి వస్తాయి, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది అన్నది నిర్ణయమవుతుంది.

లాభం ఎంత..?

ఒక రైతు భూమి కింద ఖనిజం ఉందనుకుందాం. ఆ ఖనిజాన్ని ఒక కంపెనీ తవ్వుతుంది. మార్కెట్లో అమ్ముతుంది. కంపెనీకి ఆదాయం వస్తుంది. ప్రభుత్వం రాయల్టీ, పన్నులు, ఇతర చెల్లింపుల రూపంలో ఆదాయం పొందుతుంది. కానీ ఆ ఖనిజం ఉన్న భూమి రైతుదే. అతని భూమికి ఎంత విలువ కడతారు, ఎంత పరిహారం ఇస్తారు, ఆ ప్రాంతంలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, గ్రామానికి ఏం అభివృద్ధి జరుగుతుంది అన్నదే కీలకం. ఇక ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఎంత భాగం స్థానిక ప్రాంత అభివృద్ధికి వెళ్తుంది అన్నదీ చూడాలి.

అందుకే కడపలో లిథియం, గ్యాలియం కథ కేవలం ఖనిజాల కథ కాదు. ఇది భూమి, పరిశ్రమ, పెట్టుబడి, ప్రభుత్వ ఆదాయం, రైతుల ప్రయోజనం అన్నింటినీ కలిపిన పెద్ద కథ. నేల మనది.. సంపద మనది. ఆ సంపదతో వచ్చే లాభంలో మన వాటా ఎంత అన్నదే ఇప్పుడు తేలాల్సిన అసలు లెక్క.

– కొండవీటి శివనాగరాజు, డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్, టీవీ9.

Follow Us