మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా శుక్రవారం (మే19) మళ్లీ సీబీఐ విచారణకు హాజరుకానున్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. సీబీఐ నోటీసుల ప్రకారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు ఆయన రానున్నారు. ఇందుకోసం. గురువారం సాయంత్రానికే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. నిజానికి ఈనెల 16నే విచారణకు హాజరుకావాలని సీబీఐ అవినాష్ రెడ్డికి కబురు పంపింది. అయితే పులివెందుల నియోజకవర్గంలో.. ముందే అనుకున్న కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉందంటూ.. అవినాష్ 4రోజుల గడువు కోరారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ రెండు రోజులు మాత్రమే సమయం ఇచ్చింది. శుక్రవారం ఖచ్చితంగా విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ సందర్భంగా పులివెందులలోని ఎంపీ ఇంటికివెళ్లి, అక్కడున్న వారికి నోటీసులు అందజేశారు. కాగా ముందస్తు షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరుకాలేనని చెప్పిన అవినాశ్ రెడ్డి, ఆ మరుసటి రోజే సీబీఐ విచారణ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడా ఎంపీకి చుక్కెదురైదుంది.
కాగా వివేకా హత్య కేసులో సీబీఐ గత కొద్ది రోజులుగా దూకుడుగా వ్యవహరిస్తోన్న నేపథ్యంలో శుక్రవారం నాటి విచారణ కీలకంగా మారనుంది. అయితే సీబీఐ నోటీసుల మేరకు అవినాష్‌రెడ్డి విచారణకు హాజరవుతారా? లేక మరేదైనా కారణంతో గడువు కోరతారా? ఒక వేళ విచారణకు హాజరైతే పరిస్థితి ఏమిటనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..