అమ్మ లేవడం లేదని తెలియక.. రాత్రంతా తల్లి మృతదేహం పక్కనే ఏడ్చి సొమ్మసిల్లిన మూడేళ్ల చిన్నారి!
కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్న 30 ఏళ్ల స్వాతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లి మరణించిన విషయం తెలియని మూడేళ్ల కుమారుడు శ్రీయాన్.. ఆమెను నిద్రలేపేందుకు ప్రయత్నిస్తూ రాత్రంతా పక్కనే గడిపాడు. ఉదయం పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా కనిపించిన దృశ్యం స్థానికులను కన్నీటిపర్యంతం చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

కర్నూలు, నవంబర్ 8: కుటుంబ కలహాలు, ఒంటరితనం ఓ వివాహిత జీవితాన్ని విషాదాంతం చేశాయి. భర్తతో విడిపోయి మూడేళ్ల కుమారుడితో కలిసి జీవిస్తున్న ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లి మరణించిన విషయం తెలియని మూడేళ్ల చిన్నారి.. ఆమెను నిద్రలేపేందుకు ప్రయత్నిస్తూ రాత్రంతా మృతదేహం పక్కనే గడిపాడు. ఉదయం ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు.
అసలేం జరిగిందంటే..?
కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో నివాసం ఉంటున్న ఎ. స్వాతి (30) శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదోనికి చెందిన స్వాతికి హైదరాబాద్‌కు చెందిన గణేశ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు శ్రీయాన్ ఉన్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా ఏడాది క్రితం భార్యాభర్తలు విడిపోయారు. అప్పటి నుంచి స్వాతి తన కుమారుడు, తల్లి కళావతితో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. మూడు రోజుల క్రితం కళావతి హైదరాబాద్‌లో ఉంటున్న తన చిన్న కుమార్తె వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో స్వాతి కుమారుడితో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. శుక్రవారం రాత్రి చుట్టుపక్కల వారితో మాట్లాడిన ఆమె.. రాత్రి 10 గంటల సమయంలో తన తల్లితోనూ ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తల్లి పక్కనే రాత్రంతా చిన్నారి..
శనివారం ఉదయం ఎంతసేపటికీ ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా.. పడకగదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న స్వాతి మృతదేహం కనిపించింది. అయితే ఆమె పాదాల దగ్గర ఉన్న చిన్న స్టూల్‌పై బాలుడు శ్రీయాన్ స్పృహతప్పి పడి ఉండటం అందరినీ కలచివేసింది. తల్లి కదలకపోవడంతో చిన్నారి ఆమె కాళ్లను పట్టుకుని ముద్దు పెట్టుకున్నట్లు, రాత్రంతా ఏడుస్తూ చివరకు అదే స్టూల్‌పై నిద్రలోకి జారుకుని స్పృహతప్పినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు బాలుడిని తట్టిలేపడంతో అతడు స్పృహలోకి వచ్చాడు. ఈ హృదయవిదారక దృశ్యం చూసిన స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
సమాచారం అందుకున్న స్వాతి తల్లి కళావతి కర్నూలుకు చేరుకున్నారు. పోలీసులు ఆమెను విచారించారు. ఒంటరి జీవితంపై విరక్తితోనే తన కుమార్తె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో కర్నూలు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




