Andhra Pradesh: ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది..?
లాడ్జిలో తల్లి కొడుకులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. సింహాచలం దర్శనానికి వచ్చి.. ఉరివేసుకుని వారు బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సమస్యలే ఈ ఆత్మహత్యకు కారణమా..? కొడుకు మానసిక సమస్యలతో బాధపడుతున్నారా..? అసలు ఏం జరిగింది..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖ సింహాచలం అడవివరంలో విషాదం చోటుచేసుకుంది. ఓ లాడ్జిలో తల్లి కొడుకులు బలవన్మరణానికి పాల్పడ్డారు. గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సింహాచలం దర్శనానికి వచ్చి.. ఆ తర్వాత సూసైడ్ చేసుకున్నారు. అసలు ఏం జరిగింది..? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పాత గాజువాక ప్రాంతానికి చెందిన నీలవతి తన కొడుకు గయప్పాంజన్ కలిసి సింహాచలం వెళ్లారు. అక్కడ అడవివరంలోని సిరి చందన లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం నాడు ఆలయానికి వెళ్లి వచ్చారని.. సాయంత్రం గదిలోకి వెళ్లిన తల్లి కొడుకులు.. బయటకు రాలేదని లాడ్జి ఓనర్ సుధాకర్ తెలిపారు. మరుసటి రోజు అద్దె కోసం అడిగేందుకు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదని చెప్పారు. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు.
లాడ్జి ఓనర్ ఫోన్‌తో రంగంలోకి దిగిన గోపాలపట్నం పోలీసులు.. కిటికీ అద్దాలు పగలగొట్టి చూశారు. దీంతో ఇద్దరూ వేలాడుతున్నట్టు కనిపించారు. తలుపు విరగగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి.. సీలింగ్ హుక్కుకు ఉరి వేసుకొని తల్లీకొడుకులు మరణించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సీఐ సన్యాసినాయుడు తెలిపారు.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా..!
మృతుడు గయప్పాంజన్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. 2021లో హైదరాబాద్ యువతితో గయప్పాంజన్ వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో 2023లో గయప్పాంజన్ పై నాంపల్లి పీఎస్‌లో కేసు నమోదైనట్టు పోలీసులు గుర్తించారు. భార్యకు దూరంగా ఉంటున్న గయప్పాంజన్.. గత కొంతకాలంగా తీవ్ర మానసిక వేదనతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




