Cyclone Michaung: వాయుగుండంగా మారనున్న మిచౌంగ్‌ తుపాన్.. ఆ 11 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ..

|

Dec 05, 2023 | 9:03 PM

తుఫాన్‌ తీరాన్ని తాకిన సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. గాలుల తీవ్రతకు చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. కరెంట్ సరఫరా నిలిచింది. తీరానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల్లోని పూరిళ్లు కూలిపోయాయి. తీరం సమీపంలో.. రోడ్లపై ఉన్న చిన్న తాత్కాలిక దుకాణాలు ఈదురుగాలులకు కొట్టుకుపోయాయి.

Cyclone Michaung: వాయుగుండంగా మారనున్న మిచౌంగ్‌ తుపాన్.. ఆ 11 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ..
Cyclone Michaung Update
Follow us on

ఏపీని వణికించిన మిచౌంగ్‌ తుఫాన్‌ బాపట్ల సమీపంలో తీరం దాటింది. కాసేపటి క్రితం తీరాన్ని దాటిన తుఫాన్‌.. క్రమంగా బలహీనపడుతోంది. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలహీన పడే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. తుఫాన్‌ తీరాన్ని తాకిన సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. గాలుల తీవ్రతకు చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. కరెంట్ సరఫరా నిలిచింది. తీరానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల్లోని పూరిళ్లు కూలిపోయాయి. తీరం సమీపంలో.. రోడ్లపై ఉన్న చిన్న తాత్కాలిక దుకాణాలు ఈదురుగాలులకు కొట్టుకుపోయాయి. జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వందల సంఖ్యలో రైలు సర్వీసులను రద్దు చేశారు అధికారులు. బాపట్ల, తిరుపతి, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోనూ తుఫాన్ ఎఫెక్ట్ ఉంది. దాదాపు 11 జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. దీంతో 11 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. రాబోయే 24 గంటల్లో తుఫాన్ ప్రభావం ఉంటుందని.. అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇప్పటికే బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాకాసి గాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి.

ఏయే ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైందంటే?

  • బాపట్ల 22 సెం.మీ
  • నెల్లూరు 22 సెం.మీ
  • రాపూర్‌ 21 సెం.మీ
  • ఆత్మకూరు 19 సెం.మీ
  • కారంచేడు 17 సెం.మీ
  • అద్దంకి 17 సెం.మీ
  • కావలి 15 సెం.మీ
  • వింజమూరు 14 సెం.మీ
  • అవనిగడ్డ 14 సెం.మీ
  • ఉదయగిరి 13 సెం.మీ

తుఫాన్‌ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లో మోకాళ్లోతు వరద నీరు వచ్చి చేరింది. ఇక వరద ధాటికి పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. మిచౌంగ్‌ ప్రభావంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షంతో వరి పంట నేలకొరిగింది. కోతలు కోసే సమయంలో వర్షాలు పడటంతో పంటను కాపాడుకునేందుకు కంటికి కునుకులేకుండా రైతులు నానావస్థలు పడుతున్నారు.

తేరుకుంటోన్న చెన్నై..

మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో అతలాకుతలమైన చెన్నై ఇప్పుడిప్పుడే క్రమంగా తేరుకుంటోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి నగరంలోని చాలా చోట్ల వర్షం లేకపోవడంతో చెన్నై వాసులు ఊపిరి పీల్చుకున్నారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు ఉండకపోవచ్చని అటు వాతావరణ శాఖ చెబుతోంది. అయితే తమిళనాడు ఉత్తర తీర ప్రాంతాలు, పుదుచ్చేరీలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..