Andhra: ఆంధ్రా కుర్రోడు.. మెక్సికో అమ్మాయిని.. చెవినొప్పి కలిపింది..
ప్రేమకు హద్దులు లేవని చెబుతారు. భాష, దేశం, సంస్కృతి వేరు అయినా, హృదయాలు కలిసితే ఆ బంధం ఎప్పటికీ చెదరదు. అలాందిటే వీరి కథ. గన్నవరం మండలం మర్లపాలెంకి చెందిన జాస్తి యశ్వంత్ మెక్సికోలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. ఒకసారి అతనికి తీవ్రమైన చెవినొప్పి రావడంతో...

ప్రేమ అనేది ఒక అద్వితీయమైన అనుభూతి. దానికి పరిమితులు ఉండవు. హృదయాలు కలిసిన క్షణం నుండి భాషలు, దేశాలు, సంస్కృతులు అన్నీ మాయమైపోతాయి. ఒక చిన్న పరిచయం జీవితాంతం మధుర బంధంగా కూడా మారుతుంది. అలాంటి అద్భుతమైన ప్రేమకథే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో జరిగింది. సుదూర మెక్సికోకు చెందిన యువతి, మర్లపాలెంకు చెందిన యువకుడు వివాహ బంధంతో ఏకమయ్యారు.
మర్లపాలెం గ్రామానికి చెందిన జాస్తి యశ్వంత్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ మెక్సికోలో స్థిరపడ్డాడు. ఒకరోజు అకస్మాత్తుగా చెవినొప్పి రావడంతో.. లోకల్‌గా ఉండే ఈఎన్‌టీ డాక్టర్ వద్దకు వెళ్లాడు. ఆ ట్రీట్మెంట్ కొత్త బంధానికి నాంది పలికింది. వైద్యురాలు డాక్టర్ జ్యాన్యజాయ్ రూయిజ్ అంజర్ యశ్వంత్‌ను చూసి మాట్లాడిన ఆ క్షణాలే తరువాత ఫ్రెండ్షిప్, ప్రేమకు దారితీశాయి. తాము ఒకరినొకరం ఇష్టపడుతున్న విషయాన్ని కుటుంబాలతో పంచుకున్న తర్వాత, ఇరువురి పెద్దలు సంతోషంగా ఆ బంధాన్ని అంగీకరించారు. ఇటీవల గన్నవరం మండలం మర్లపాలెంలో వారి వివాహం భారతీయ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగింది. పురోహితుల సాక్షిగా వధూవరులు ఏకమవ్వగా, స్నేహితులు, బంధువులు అందరూ హాజరై ఆశీర్వదించారు.
భారతీయ అమ్మాయిలు విదేశీయులను వివాహం చేసుకోవడం లేదా విదేశీ అబ్బాయిలు మన సాంప్రదాయాల్లో మమేకమవడం కొత్త కాదు. కానీ వైద్య చికిత్సే పరిచయానికి కారణం కావడం ఇక్కడ విశేషం. యశ్వంత్ తల్లిదండ్రులు జాస్తి మురళీకృష్ణ, సునీత దంపతులు కుమారుడి మనసు కోరికను గౌరవించి ఘనంగా వివాహం నిర్వహించారు.




