TDP vs YCP: మంత్రాలయంలో మళ్లీ రాజుకున్న రాజకీయ చిచ్చు.. దాడి చేసినవారిపై చర్యలు తీసుకోండిః తిక్కారెడ్డి

|

Dec 13, 2021 | 12:33 PM

కర్నూలు జిల్లాలో అధికార పార్టీ వైసీపీ - తెలుగు దేశం నేతల మధ్య మరోసారి రాజకీయ చిచ్చు రాజుకుంది. మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ తిక్కారెడ్డిపై దాడికి యత్నం చిలికి చిలికి గాలివానగా మారుతోంది.

TDP vs YCP: మంత్రాలయంలో మళ్లీ రాజుకున్న రాజకీయ చిచ్చు.. దాడి చేసినవారిపై చర్యలు తీసుకోండిః తిక్కారెడ్డి
Mla Balanagi Reddy Vs Tdp Leader Thikka Reddy
Follow us on

Mantralayam political fight: కర్నూలు జిల్లాలో అధికార పార్టీ వైసీపీ – తెలుగు దేశం నేతల మధ్య మరోసారి రాజకీయ చిచ్చు రాజుకుంది. మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ తిక్కారెడ్డిపై దాడికి యత్నం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఇరు పార్టీల నేతల విమర్శలు ప్రతి విమర్శలతో హోరెత్తుతోంది. తనపై జరిగిన హత్యాయత్నంపై కచ్చితంగా కేసునమోదు చేయాల్సిందేనని తిక్కారెడ్డి పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగానే తిక్కా రెడ్డి సహా ఆ పార్టీ ముఖ్య నేతలంతా జిల్లా ఎస్‌పీ సుధీర్ కుమార్ రెడ్డిని కలిసి భద్రత పెంచాలని కోరారు. తిక్కారెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై కేసు నమోదు చేసి తగిన విచారణ జరిపించాలని ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందించారని టీడీపీ నేతలు తెలిపారు.

అయితే, ఇప్పటివరకు తనపై మూడు సార్లు దాడి జరిగినట్లు తిక్కా రెడ్డి చెప్తున్నారు. ఒక పథకం ప్రకారమే జరుగుతున్న ఈ విషయంపై తనకు ఏమి జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాలని తిక్కా రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. తనకు సెక్యూరిటీ కోసమే జరగని విషయాన్ని జరిగినట్లు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆరోపించారు. ఫ్యాక్షన్ గ్రామము పెద్ద బొంపల్లి జాతర సందర్భంగా ఇతరులెవరూ వెళ్లరాదని గ్రామస్తులు నిర్ణయించుకున్నప్పటికీ తిక్కా రెడ్డి వెళ్లడం తోనే ఉద్రిక్తత ఏర్పడిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇంత చిన్న విషయానికి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ స్పందించి లేని ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయని ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిందించడం ఏంటి అని నిలదీశారు. ఒక్క పెద్ద బొంపల్లి లోనే కాకుండా మంత్రాలయం నియోజకవర్గంలోని అనేక గ్రామాలలో తరచుగా ఘర్షణలు జరుగుతుండటంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి తిక్కారెడ్డి మధ్య చాలా కాలంగా పోటీ నెలకొంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన తిక్కారెడ్డి నియోజకవర్గం ఖగ్గల్‌లో ప్రచారం నిర్వహిస్తుండగా గాయపడ్డారు. ఆయనతో పాటు ASI వేణుగోపాల్ కాలుకు గాయమైంది. వైసీపీ నేతలు దాడి చేశారని టీడీపీ వర్గీయులు ఆరోపించాయి. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమారుడు ప్రదీప్ రెడ్డి, ఇతరులు అడ్డుకున్నారు. రెండు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో తిక్కారెడ్డికి చెందిన గన్ మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత తిక్కారెడ్డి కాలికి గాయం అయ్యింది.

ఈ విషయంపై పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడంతో తెలుగు దేశం పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, నియోజకవర్గంలో ఇరువర్గాల మధ్య అడపా దడపా ఘర్షలు చోటుచేసుకుంటుండంతో మరోసారి, తనపై దాడి జరిగే అవకాశముందని, తనకు భద్రత కల్పించాలంటూ తిక్కారెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Read Also… Chiranjeevi-Balakrishna: బాలయ్య-చిరు మల్టిస్టారర్.. మైత్రి ప్రొడ్యూసర్స్ కీలక కామెంట్స్