Mandous Cyclone: అల్పపీడనంగా బలహీనపడిన మాండూస్.. ఏపీలో తుపాను ప్రభావం చూపిన ప్రాంతాలివే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల శాఖ
ఆగ్నేయ బంగాళాఖాతంలోని మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీనపడినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో ఆది, సోమ..

ఆగ్నేయ బంగాళాఖాతంలోని మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీనపడినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో ఆది, సోమ వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మాండూస్ తుపాను ప్రభావం నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ముందు నుంచి ప్రత్యేక చర్యలను తీసుకుందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్. జవహర్ రెడ్డి ప్రతిరోజు సమీక్షలు నిర్వహించి అధికారులకు అమలు చేయాల్సిన విధివిధానాలు గురించి ఆదేశాలు జారీచేసారని తెలిపారు. అల్పపీడనం ఏర్పడినప్పటి నుంచి విపత్తుల సంస్థలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి విపత్తుల సంస్థ డైరెక్టర్ అంబేద్కర్ తో కలసి తుపాను కదలికలు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడూ సంబంధిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేశామన్నారు. తుపాను సమయంలో విపత్తుల సంస్థ యంత్రాంగం 24 గంటలు నిరంతరం పనిచేస్తూ సత్వరం స్పందించడం, ఉద్రిక్తతను స్పష్టంగా అంచనా వేయడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన నష్టతీవ్రతను తగ్గించగలిగామని అన్నారు. సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులను వెనక్కి పిలిపించామన్నారు. భారీ వర్షాలు, ఈదుర గాలుల నేపధ్యంలో కామన్ అలర్ట్ ప్రోటోకాల్, ఏపీ అలెర్ట్ ద్వారా ఆరు జిల్లాల్లోని సుమారు కోటిమందికి పైగా సబ్ స్ర్కైబర్లకి ముందుగానే తుపాను హెచ్చరిక సందేశాలు పంపినట్లు వివరించారు.
ఆరు జిల్లాల్లోని 32 మండలాల్లో తుపాను తీవ్రతను చూపిందన్నారు. ప్రమాదకరమైన లోతట్టు ప్రాంతాల నుంచి 708 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకి తరలించామన్నారు. 33 సహాయక శిబిరాలని ఏర్పాటు చేసామని, 778 మందికి పునరావాసం కల్పించామని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో భోజనం, తాగునీరు సదుపాయం కల్పించామన్నారు. సహాయక చర్యలకోసం ప్రకాశం జిల్లాలో 2, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 3, తిరుపతి జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో 2 మొత్తంగా 5 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించామన్నారు.
శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నమయ్య జిల్లాలో 20.5 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లాలో 22 , ప్రకాశం జిల్లాలో 10.1, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 23.4., తిరుపతి జిల్లాలో 2.4, వైయస్సార్ కడప జిల్లాలో 13.2 మిల్లీమీటర్ల వంతున సరాసరి వర్షపాతం నమోదైందని అన్నారు. ఆరు జిల్లాల్లోని 32 ప్రాంతాల్లో 50 మిల్లీ మీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైనట్టు తెలిపారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..