Krishna District: కృష్ణా జిల్లా గుడివాడలో పిడుగుల బీభత్సం.. హడలెత్తిపోయిన ప్రజలు.. గేదెలు మృతి
ఏపీలో పిడుగులు ప్రజలను హడలెత్తించాయి. కృష్ణాజిల్లాలో పిడుగు పాట్లతో జనం బెంబేలెత్తిపోయారు. అకాల వర్షాలపై పలు చోట్ల పంట నష్టం వాటిల్లింది. దీంతో నష్టపోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 2,3 రోజులు వర్షాలు కంటిన్యూ అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో పలుచోట్ల పిడుగులు భీభత్సం సృష్టించాయి. కొన్ని చోట్ల పచ్చటి చెట్లు కూడా పిడుగులతో భగ్గున మండిపోయాయి. కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. దానితో పాటే పిడుగు పడడంతో పిడుగుపాటుకి కొన్ని చోట్ల పశువులు మృత్యువాత పడ్డాయి. పొలాల్లో పిడుగులు పడడంతో గడ్డివాములు తగులబడ్డాయి.
పిడుగులతో కూడిన వర్షంతో హడలెత్తిపోతున్నారు ప్రజలు. అకాల వర్షాలకు అతలాకుతలమౌతోన్న రైతులకు పిడుగుపాట్లతో మరిన్ని తిప్పలు తెచ్చిపెట్టాయి. పెదమద్దాలిలో పిడుగుపాటుకు రెండు చూడి పశువులు మృతి చెందాయి. పిడుగుల ధాటికి పొలాల్లోని వరి కుప్పలు దగ్ధమవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
పామర్రు మండలం…కొమరవోలులో పిడుగుపాటుకు కారు ఇస్సాకు అనే వ్యక్తి తీవ్రగాయాల పాలయ్యాడు. గాయపడ్డ ఇస్సుకుని ఆసుపత్రికి తరలించారు స్థానికులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
