Tirumala: తిరుమల భక్తులకు ఊరట..! మెట్లమార్గంలో ఎట్టకేలకు చిక్కిన చిరుత.. చిన్నారిపై దాడి చేసిన ప్రాంతంలోనే..

|

Aug 14, 2023 | 8:51 AM

టీటీడీ సిబ్బంది.. ఫారెస్ట్‌ అధికారుల ఎఫర్ట్స్‌ ఫలించాయి. తిరుమల కొండపై ఏర్పాటు చేసిన బోన్లకు చిరుత చిక్కింది. నెల్లూరు జిల్లాకు చెందిన చిన్నారి లక్షితను మూడు రోజుల క్రితం 7వ మైలు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత బలితీసుకుంది. దీంతో అలర్టయిన టీటీడీ.. ఆ స్పాట్‌తో పాటు మరోచోట బోను ఏర్పాటు చేసింది.

Tirumala: తిరుమల భక్తులకు ఊరట..! మెట్లమార్గంలో ఎట్టకేలకు చిక్కిన చిరుత.. చిన్నారిపై దాడి చేసిన ప్రాంతంలోనే..
Leopard caught in Tirumala
Follow us on

తిరుమల తిరుపతి, ఆగస్టు 14: టీటీడీ సిబ్బంది.. ఫారెస్ట్‌ అధికారుల ఎఫర్ట్స్‌ ఫలించాయి. తిరుమల కొండపై ఏర్పాటు చేసిన బోన్లకు చిరుత చిక్కింది. నెల్లూరు జిల్లాకు చెందిన చిన్నారి లక్షితను మూడు రోజుల క్రితం 7వ మైలు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత బలితీసుకుంది. దీంతో అలర్టయిన టీటీడీ.. ఆ స్పాట్‌తో పాటు మరోచోట బోను ఏర్పాటు చేసింది. దీంతో రాత్రివేళ అదే ప్రాంతానికి వచ్చిన చిరుత.. ఈసారి బోనుకి చిక్కింది. లక్షిత ఘటన అనంతరం టీటీడీ సిబ్బందిని అప్రమత్తంచేసింది. చిరుత సంచరించే ప్రాంతాల్లో బోన్లను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఆంక్షలు విధించడంతోపాటు సిబ్బందిని సైతం మోహరించింది. మూడు రోజుల తర్వాత బాలికపై దాడి చేసిన ప్రాంతంలోనే చిరుత ఎట్టకేలకు చిక్కింది. బోనులో పడిన చిరుత పెద్దదిగా అధికారులు గుర్తించారు. ఆలయ సమిపంలో బాలికపై దాడి చేసిన చోటనే చిరుత మూమెంట్ ఉంటుందని గుర్తించి బొన్లను ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

కొనసాగుతున్న ఆంక్షలు..

కాగా.. తిరుమలలో చిరుతల సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల నడక మార్గాల్లో చిన్న పిల్లల అనుమతిపై ఆంక్షలు విధించింది. అలిపిరి నడక మార్గంలో నడకమార్గంలో చిన్నారులపై ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు నడకదారుల్లో అనుమతి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు నడకదారిలో పోలీసులను అప్రమత్తం చేసింది. ఏడో మైలు వద్ద చిన్నపిల్లల చేతికి ట్యాగ్ లు సైతం వేస్తున్నారు. దీంతో పిల్లలు తప్పిపోయినా, అనుకోని ఘటనలు జరిగినా సులభంగా కనిపెట్టేందుకు ఈ ట్యాగ్‌లు ఉపయోగపడతాయని టీటీడీ వెల్లడించింది. పిల్లలకు వేస్తున్న ట్యాగ్‌పై పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్‌ నంబర్, పోలీసుల టోల్‌ ఫ్రీ నంబర్‌ నమోదు చేస్తున్నారు.

వీడియో..

రెండో ఘాట్ రోడ్డులో..

అలాగే రెండో ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 గంటల తరువాత బైక్‌లకు అనుమతి నిరాకరించినట్టు టీటీడీ తెలిపింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది. సాయంత్రం ఆరు గంటల నుండి 100 మందిని కలిపి గుంపులు గుంపులుగా ఏడోవ మైలు నుండి శ్రీ నృశింహ స్వామి వారి ఆలయం వరకు పంపనున్నారు. ఈ భక్తుల సమూహానికి ముందు భాగంలోనూ, వెనుక భాగంలోనూ పోలీసు సిబ్బంది భధ్రత కల్పించనున్నారు.

ఇవి కూడా చదవండి

నేడు కీలక సమావేశం..

ఇదిలాఉంటే.. ఇవాళ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి అధ్యక్షతన టీటీడీ బోర్డ్ సమావేశం కానుంది. ప్రధానంగా భక్తుల భద్రతకు సంబంధించి జాగ్రత్తలపై చర్చించనున్నారు. అంతేకాకుండా మెట్ల మార్గంలో తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చర్చించనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..