
కర్నూలు, డిసెంబర్ 4: యాబై వేలకు పైగా జనాభా ఉన్న ఆ పట్టణంకి కంటినిండా కునుకు లేకుండా పోయింది. నిత్యం ఎక్కడో ఓచోట దొంగతనాలకు దొంగలు తెగబడుతున్నారు. ఏకంగా పోస్ట్ ఆఫీస్ దోపిడీ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దొంగతనాలు జరుగకుండా, జరిగినా పట్టించుకోకుండా, రికవరీ చేయకుండా, ప్రజలకు ధైర్యం కల్పించకుండా పోలీస్ చర్యలు ఉండటం ఇందుకు కారణంగా భావిస్తున్నారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని పోస్టాఫీసులో దొంగలు పడ్డారు. పోస్ట్ ఆఫీస్ మెయిన్ గేటు తాళాలు పగలగొట్టి కార్యాలయంలోకి ప్రవేశించిన దొంగలు ఇనుప బీరువాను పగలగొట్టి అందులో ఉంచిన రెండు లక్షల 90 వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం యధావిధిగా పోస్ట్ ఆఫీస్‌కు వచ్చిన ఉద్యోగులు ప్రధాన గేటుకు వేసిన తాళం పగలగొట్టి ఉండటం చూసి కంగారుపడ్డారు. చోరీ జరిగిందన్న విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన బీరువాలో తనిఖీ చేయగా అందులోనే ఉంచిన రూ. 2.90 లక్షలు చోరీకి గురైన విషయం బయటపడింది. పోస్ట్ మాస్టారు గురువయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీంను పిలిపించి దొంగలను పట్టుకునే వేటలో పడ్డారు పోలీసులు.
ఎన్నడు లేని విధంగా ఓ ప్రభుత్వ కార్యాలయాన్ని దొంగలు టార్గెట్ చేయడం కోవెలకుంట్ల పట్టణంలో తీవ్ర చర్చణీయాంశంగా మారింది. పోస్ట్ ఆఫీస్ కార్యాలయానికి సీసీ కెమెరాలు లేకపోవడం, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడం దొంగలను గుర్తుపట్టడం పోలీసులకు సాధ్యపడడం లేదు. ఇటీవల కాలంలో ప్రతి వ్యాపార సముదాయాల్లో, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నయి.
కోవెలకుంట్ల పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. కోవెలకుంట్ల పట్టణంలో ఆరు నెలల క్రితం ప్రముఖ స్వీట్ స్టాల్ యజమాని ఇంట్లో భారీ చోరీ జరిగింది. అయితే ఇంతవరకు పోలీసులు దొంగలను పట్టుకోలేక పోయారు. అంతేకాక అపోలో మెడికల్ స్టోర్, డాక్టర్ రామ్ రెడ్డి ఇంట్లో, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో, గడ్డ వీధిలో ఓ ఇంట్లో, బీనుపాడు గ్రామంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇంట్లో వరుస చోరీలు చోటు చేసుకున్నాయి. అయితే చోరీలకు పాల్పడిన దొంగలను పట్టుకోవడంలో మాత్రం పోలీసులు విఫలమవుతున్నారు. దీంతో ఇళ్లకు తాళాలు వేసినా.. ఊర్లకి వెళ్లాలంటే కోవెలకుంట్ల పట్టణంలో ప్రజలు భయాందోళన గురవుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.