Kotia Dispute: ఆంధ్రా -ఒడిషా బోర్డర్‌లో టెన్షన్.. రోజు రోజుకూ హీటెక్కుతున్న కొటియా కొట్లాట..

ఆంధ్రా -ఒడిషా బోర్డర్‌లో కొటియా కొట్లాట రోజు రోజుకు హీటెక్కుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో ఓటు రాజకీయం మరింత ఆజ్యం పోస్తోంది. ఓటు కోసం ఒడిశా నేతలు సరిహద్దు పల్లెల బాట పట్టారు.

Kotia Dispute: ఆంధ్రా -ఒడిషా బోర్డర్‌లో టెన్షన్.. రోజు రోజుకూ హీటెక్కుతున్న కొటియా కొట్లాట..
Kotia
Follow us

|

Updated on: Oct 17, 2021 | 7:18 AM

ఆంధ్రా -ఒడిషా బోర్డర్‌లో కొటియా కొట్లాట రోజు రోజుకు హీటెక్కుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో ఓటు రాజకీయం మరింత ఆజ్యం పోస్తోంది. ఓటు కోసం ఒడిశా నేతలు సరిహద్దు పల్లెల బాట పట్టారు. ఏ వూళ్లో కాలుపెట్టినా కొట్లాట సీన్‌మనం మనం బరంపురం అంటూ సరిహద్దు గ్రామాల్లో పర్యటిస్తోన్న ఒడిశా లీడర్లకు పల్లెలు చుక్కలు చూపిస్తున్నాయి. ఆంధ్రా ఒడిశా బోర్డర్ లోని వివాదాస్పద కొటియా గ్రామాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఒడిశా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొటియా గ్రామాల్లో పర్యటిస్తున్న ఒడిస్సా ప్రజాప్రతినిధులను గ్రామాల్లోకి రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు కొటియా గ్రామాల ప్రజలు.. ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో కొటియా ప్రజలు పాల్గొనేలా చూడాలని ఒడిస్సా ప్రజాప్రతినిధులు పట్టుబట్టడంతో కొటియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది..

ఆంధ్ర, ఒడిస్సా రాష్ట్రాల మధ్య దశాబ్దాల పాటు వివాదంగా ఉన్న కొటియా గ్రామాల్లో.. కొద్ధి నెలలుగా నువ్వా నేను అంటూ ఏపీ, ఒడిస్సాల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతుంటే కొటియా గ్రామాల ప్రజలు మాత్రం ఇరు రాష్ట్రాల పథకాలు, ప్రయోజనాలు పొందుతూ వస్తున్నారు. ఈ గ్రామాలను తమ హస్తగతం చేసుకునేందుకు ఒడిస్సా మాష్టర్ ప్లాన్ వేసింది. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.

కొటియా గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా సుప్రీంకోర్టు స్టేటస్ కో ఇచ్చినప్పటికీ.. ఒడిసా మాత్రం ఆదేశాలను ఏమాత్రం పట్టనట్టు వ్యవహరించింది. ఒడిస్సా ప్రభుత్వానికి అడ్డుకట్ట వేసేందుకు.. ఏపీ కూడా మాస్టర్ ప్లాన్ వేసింది. రాష్ట్రంలో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలను కొటియా గ్రామాల్లో అమలు చేయడమే కాకుండా.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో తెలుగులో బోర్డులు పెట్టి సంచలనం రేపింది.

అంతే కాకుండా ఐటీడీఏ పీవో కూర్మనాధ్.. కొటియా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి బాగోగులు తెలుసుకుంటున్నారు. వీటికి ఆకర్షితులైన కొటియాలోని కొన్ని గ్రామాలు ఏపీకి దగ్గరవుతున్నాయి.

కొటియాలోని పగులు చెన్నూరు, పట్టు చెన్నూరుతో పాటు సుమారు పది గ్రామాల ప్రజలు పగులుచెన్నూరు వద్ద సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఏపీ పథకాలే బాగున్నాయనీ.. మన రాష్ట్రంతోనే కొనసాగాలని ఆ గ్రామాలు నిర్ణయించుకున్నాయి.

మరో రెండు నెలల్లో ఒడిస్సాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా ఒప్పందం చేసుకున్నారు. అంతే కాకుండా ఎవరూ బెదిరింపులకు లొంగకుండా ఉండాలని, ఒడిస్సా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏవీ తీసుకోకుండా తిరస్కరించాలని కూడా తీర్మానం జరిగింది.

స్థానికులు ఏర్పాటు చేసుకున్న సభకు.. పార్వతీపురం ఐటిడిఎ పీవో కూర్మనాద్ కూడా చేరుకున్నారు. ఈ పరిస్థితులు ఒడిశాకి మింగుడు పడటం లేదు. వెంటనే ఒడిస్సాకు చెందిన స్థానిక పొట్టంగి ఎమ్మెల్యే ప్రితంపాడి.. తన అనుచరులతో అక్కడకు చేరుకుని హడావుడి చేశారు. కొటియా గ్రామాల్లో ఏపీ అధికారులకు ఏం పని అంటూ ఘర్షణకు దిగారు ఎమ్మెల్యే అనుచరులు. ఒడిస్సాకు సంబంధించిన గ్రామాల్లో ఏపీ అధికారులకు ఏం పని అంటూ నిలదీశారు. పీవో కూర్మనాద్ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వెళ్లటంతో ఒకానొక సమయంలో పరిస్థితి చేయిదాటింది.

ఒడిస్సా పొట్టంగి ఎమ్మెల్యే అనుచరులు.. పీవో కూర్మనాధ్ పై గొడవకు దిగారు. అయితే పరిస్థితి గమనించిన స్థానిక గ్రామాల ప్రజలు.. పీవో కూర్మనాధ్‌కు అండగా నిలిచారు. ఎమ్మెల్యే ప్రితంపాడిపై విరుచుకుపడ్డారు. మేము ఆంధ్రాలోనే ఉంటామని, తమ గ్రామాలు ఏపీలో ఉంటాయనీ.. కాదనడానికి మీరెవరని ప్రశ్నిస్తూ.. ప్రితంపాడికి రివర్స్ కౌంటర్ ఇచ్చారు స్థానికులు.

ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ఒడిస్సా స్థానిక సెల్ టవర్స్ నుంచి నెట్ వర్క్ నిలిపివేసింది. సుమారు మూడు రోజుల పాటు నెట్ వర్క్ లేక నానా అవస్థలు పడ్డారు కొటియా గ్రామాల ప్రజలు. స్థానికులు తీవ్రంగా మండి పడటంతో.. చేసేది లేక నెట్ వర్క్ పునరుద్ధరించారు అధికారులు.

ఇక కొటియాలో జరుగుతున్న పరిణామాలపై సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర స్పందించారు. స్నేహపూర్వక వాతావరణంతో ఏపీ ముందుకు వెళ్తుంటే.. ఒడిస్సా మాత్రం కవ్వింపులకు దిగుతుందని మండిపడ్డారాయన. ఇప్పటికైనా చర్చించి సమస్య పరిష్కరించుకోవడానికి సహకరించాలని కోరారు ఎమ్మెల్యే. ఓట్ల కోసం ఒడిస్సా రాజకీయ నాయకులు తమను కలిస్తే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుత్తానికి కొటియా గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి: Venomous Spider: ఫోటోగ్రాఫర్ బెడ్‌రూమ్‌లో పిల్లలతో స్పైడర్ కాపురం.. అది కరిస్తే ప్రాణాలకే ప్రమాదం

Worst Passwords: ఈ పాస్ వర్డ్స్ పెట్టుకున్నా ఒకటే.. పెట్టుకోకున్నా ఒక్కటే.. మీవి కూడా ఉన్నాయేమో చెక్ చేసుకోండి..