Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janasena: మంత్రి రోజానే టార్గెట్‌గా పావులు కదుపుతున్న జనసేన .. బలిజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్.. టెన్షన్లో టీడీపీ నేతలు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుపై జనసేన కసరత్తు ప్రారంభించింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన జనసేన.. ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీ బలం, పొత్తుతో పోటీ చేస్తే వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చిస్తోంది. ఈ మేరకు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పార్టీ కేడర్‌తో సమీక్షలు నిర్వహిస్తున్నారు.

Janasena: మంత్రి రోజానే టార్గెట్‌గా పావులు కదుపుతున్న జనసేన .. బలిజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్.. టెన్షన్లో టీడీపీ నేతలు
Pawan Kalyan
Follow us
Raju M P R

| Edited By: Surya Kala

Updated on: Sep 24, 2023 | 9:02 AM

ఉమ్మడి చిత్తూరు జిల్లాపై జనసేన దృష్టి పెట్టింది. బలిజలు ఎక్కువగా ఉన్న స్థానాలపై ఫోకస్ పెంచింది. టీడీపీతో కలిసి ఎలా నడవాలన్న దానిపై కేడర్‌కు దిశానిర్దేశం చేస్తోంది. మంత్రి రోజా టార్గెట్‌గా పావులు కదుపుతోంది. ఇక తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, శ్రీకాళహస్తి స్థానాలపై నాగబాబు సమాలోచనలు సైకిల్‌ పార్టీకి కూడా టెన్షన్‌ పుట్టిస్తోంది. ఎందుకంటే గతంలో మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రస్థానం పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి నుంచే మొదలైంది. తిరుపతిలో ప్రజారాజ్యం ఆవిర్భావ సభ పెట్టడమే కాదు.. చిరంజీవి పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒకటి తిరుపతి. చిరంజీవికి తిరుపతివాసులు  బ్రహ్మరథం పట్టారు. తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ లో అడుగు పెట్టారు. దీంతో ఇప్పుడు చిరు తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేగా తిరుపతి నుంచి పోటీ చేయాలనే డిమాండ్ మళ్ళీ తెరపైకి వచ్చింది. గత ఎన్నికల్లో భీమవరం, విశాఖ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగితే విజయాన్ని పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇస్తామని తిరుపతి లీడర్స్ ఇప్పటికే బహిరంగా చెబుతూనే ఉన్నారు ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా జనసేనకు ప్రాధాన్యత ఉన్న జిల్లాగా మారిపోయింది.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుపై జనసేన కసరత్తు ప్రారంభించింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన జనసేన.. ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీ బలం, పొత్తుతో పోటీ చేస్తే వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చిస్తోంది. ఈ మేరకు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పార్టీ కేడర్‌తో సమీక్షలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులపాటు ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలతో సుదీర్ఘ చర్చలే జరిపారు. తొలిరోజు చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు నియోజవర్గాల ముఖ్య నేతలు, కార్యకర్తలతో నాగబాబు ముఖాముఖి నిర్వహించారు.

పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేసిన నాగబాబు.. స్థానికంగా టీడీపీ కేడర్‌తో కలిసి పని చేయాలని ఆదేశించారు. టీడీపీ నేతలను గౌరవించాలంటూ జనసేన కార్యకర్తలను ఆయన కోరారు. పార్టీలో విభేదాలు, ఏకపక్ష నిర్ణయాలకు తావు లేదని కేడర్‌కు నాగబాబు స్పష్టం చేశారు. జిల్లాలో జనసేన బలాన్ని నాగబాబుకు వివరిస్తూనే టీడీపీతో పొత్తుంటే ఏయే స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై కూడా పార్టీ హై కమాండ్ దృష్టికి తీసుకొచ్చింది కేడర్‌. ఇక బలిజ కులస్తులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల పైనే నాగబాబు ఫోకస్‌ చేశారు. ఆయన సమీక్షల్లో కూడా వాటిపైనే చర్చ నడుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి చిత్తూరు, మదనపల్లి, శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాలపై జనసేన ఫోకస్ పెట్టింది.

ఇవి కూడా చదవండి

తిరుపతి చిత్తూరు మదనపల్లి శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో బలిజ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. నగరిలో మంత్రి రోజాను టార్గెట్‌ చేయాలని జనసేన కేడర్‌ ప్రయత్నిస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు చేసే రోజాపై పోటీ చేసి తీరాలంటూ నాగబాబుపై కేడర్‌ ఒత్తిడి తెచ్చింది. ఇక నాగబాబు పర్యటన సైకిల్‌ నేతల్లో కూడా గుబులు పుట్టిస్తోంది. పొత్తులో భాగంగా తమ సీట్లలో జనసేన కర్చీప్‌ వేస్తుందేమోనని టీడీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. జనసేనతో పొత్తు తమ కొంప ముంచుతుందని భావిస్తున్న కొందరు ఇన్‌చార్జీలు తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..