Cotton Candy Ban: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం, పీచు మిఠాయి అమ్మకాలపై ఫోకస్, కారణమిదే
సాధారణంగా చిన్న పిల్లలు తినే పీచు మిఠాయి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా.. వీటిని తినడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. గత వారం తమిళనాడు, పుదుచ్చేరిలో కాటన్ మిఠాయి ('పీచు మిఠాయి') అమ్మకాలపై విధించిన నిషేధం ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రమాద ఘంటికలు మోగించింది. శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపాలని ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది

సాధారణంగా చిన్న పిల్లలు తినే పీచు మిఠాయి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా.. వీటిని తినడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. గత వారం తమిళనాడు, పుదుచ్చేరిలో కాటన్ మిఠాయి (‘పీచు మిఠాయి’) అమ్మకాలపై విధించిన నిషేధం ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రమాద ఘంటికలు మోగించింది. శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపాలని ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది.
వారు పరీక్షించిన మిఠాయి నమూనాల్లో పారిశ్రామిక రంగు రోడమైన్-బి కనిపించడంతో తమిళనాడు నిషేధం విధించింది. ఈ వారంలో నమూనాలను పరీక్షలకు పంపుతామని, పరీక్ష ఫలితాల ఆధారంగా నిషేధంపై నిర్ణయం తీసుకుంటామని ఆరోగ్య, రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ జె.నివాస్ తెలిపారు. కాటన్ క్యాండీలను సింథటిక్, అనుమతి లేని రంగులను ఉపయోగించి తయారు చేస్తారని, ఇవి క్యాన్సర్ కారకమని చెప్పారు. రోడమైన్-బి, మెటానిల్ ఎల్లో వంటి అన్ని పారిశ్రామిక రంగులు ఆరోగ్యానికి ప్రమాదకరం. కానీ వాటి దుష్ప్రభావాలపై అవగాహన పెరగడంతో వాటి వాడకం తగ్గినప్పటికీ స్వీట్లు, ఇతర వంటకాల్లో వాటిని ఉపయోగిస్తున్నారు’ అని నివాస్ తెలిపారు.
నమూనాల సేకరణ, పరీక్షల ప్రక్రియ మొత్తం నెల రోజులు పట్టొచ్చని తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో ఈ ఉత్పత్తిపై నిషేధం ఉందన్న వార్తలు రావడంతో ఇప్పటికే కొందరు విక్రేతలు అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. కృత్రిమ రంగు లేని కాటన్ క్యాండీలు కూడా తినడానికి సురక్షితం కాదు. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో దీన్ని తయారు చేస్తారు. కొన్నిసార్లు, యంత్రం నుండి వచ్చే ఇనుప ఫైలింగ్స్ ఈ ప్రక్రియలో చక్కెరతో కలిసిపోవచ్చు” అని ఆయన చెప్పారు. ప్రస్తుతం, పండుగలు, జాతరలు ఉండటంతో అమ్మకాలను తగ్గించేలా నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు.
ఇటీవల కాలంలో బెల్లం, సుగంధ ద్రవ్యాలు, గుంటూరు మిరపకాయలు, పాల ఉత్పత్తులపై నిఘా పెంచినట్లు నివాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపామని, నెల రోజుల్లో రిపోర్టులు వస్తాయని చెప్పారు. చాలాసార్లు ఎక్స్పైరీ డేట్ దాటిన ఉత్పత్తులను విక్రయించే పాఠశాలల వెలుపల ఉన్న స్టాల్స్ నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను తిననివ్వరాదని నివాస్ సూచించారు.
ఈ నేపథ్యంలో ఏపీలో పీచు మిఠాయి అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి శాంపిళ్లను సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. సేకరించిన శాంపిళ్లను టెస్టింగ్ కోసం అధికారులు పంపనున్నారు. నేటి నుంచి శాంపిల్స్ సేకరించనున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ల్యాబ్ టెస్టింగ్ ఆధారంగా ఎపిలో పీచు మిఠాయిపై నిషేధంపై నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.