Eluru: ఇది సినిమా చెట్టు..! ఇక్కడి గోదారి గట్టున సినిమా తీస్తే హిట్టే.. ఆ చెట్టు కింద 300లకు పైగా సినిమాల షూటింగ్

Eluru: ఓ చెట్టు రికార్డు సృష్టిస్తుంది. అది మామూలు రికార్డు కాదు ఆల్ టైం రికార్డ్. చెట్టు ఏంటి రికార్డ్ సృష్టించడం ఏంటి అనుకుంటున్నారా..? ఇక సినిమావాళ్ళకి అయితే, ఈ చెట్టు సెంటిమెంట్ ఎంతగా ఉందంటే మొత్తం సినిమాలో ఒక్క షాట్ అయినా ఈ చెట్టుకింద పెడితే, లేదా చెట్టుపై ఒక్క షాట్ తీసినా ఆ సినిమా హిట్ అనేంత వరకు సెంటిమెంట్ పెంచుకున్నారు. ఇదేం చెట్టు, ఏంటా కథ అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.!

Eluru: ఇది సినిమా చెట్టు..! ఇక్కడి గోదారి గట్టున సినిమా తీస్తే హిట్టే.. ఆ చెట్టు కింద 300లకు పైగా సినిమాల షూటింగ్
History Of Cinema Chettu
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Aug 21, 2023 | 6:26 PM

ఏలూరు,ఆగస్టు 21; సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న వాటిలో సినిమా రంగం ముందు ఉంటుంది. ముహూర్తం షాటు నుంచి సినిమా పూర్తి అయ్యేవరకు ప్రతి సీను విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు నిర్మాతలు, దర్శకులు. హీరో వేసుకోవాల్సిన షర్టు రంగు, షూటింగ్ చేయాల్సిన ఏరియాల విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తారు. కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు, హైదరాబాదులో చార్మినారు ఇలాంటివి చాలా సినిమాల్లో సహజంగా కనిపించేవి. ఒక చెట్టు ఇప్పటివరకు అత్యధిక సినిమాల్లో కనిపిస్తూ రికార్డు సృష్టించింది. అది మామూలు రికార్డు కాదు ఆల్ టైం రికార్డ్. చెట్టు ఏంటి రికార్డ్ సృష్టించడం ఏంటి అనుకుంటున్నారా..? 300కు పైగా సినిమాల్లో ఈ చెట్టు కనిపించిందంటే ఆశ్చర్య పోవాల్సిందే..

సినిమా వాళ్ళకి ఉన్న సెంటిమెంట్లలో గోదావరి ఒకటి. గోదావరి తీరం లో సినిమా తీస్తే, ఆ సినిమా హిట్ అవుతుందనేది చాలా మందికి ఉన్న నమ్మకం . సహజత్వం, ప్రక్రృతి రమణీయత గోదావరి ప్రత్యేకత. ఒక్క తెలుగే కాదు హిందీ సినిమాలు సైతం గోదావరి తీరంలో షూటింగ్ చేసి హిట్స్ కొట్టాయి. గోదావరి తో పాటు గోదావరి గట్టునే ఉండే చెట్టు అంటే కూడా సినిమావాళ్ళకి మరో సెంటిమెంట్. ఆ చెట్టు కింద ఏకంగా 300 సినిమాల షూటింగ్ జరిగిందంటే మీరు నమ్ముతారా. నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఆ చెట్టు ప్రత్యేకత అలాంటిది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం లో కుమారదేవం లో ఉంది ఈ చెట్టు. గ్రామం గోదావరి ఒడ్డున ఉంటుంది. గట్టుకు ఆనుకుని పెరిగింది ఈ సినిమా చెట్టు. ఇది నిద్ర గన్నేరు చెట్టు.. దీని కొమ్మలు గోదావరిలోకి పెరిగి ఉంటాయి. దీని కొమ్మలకు ఊయల కట్టి ఊగుతుంటే కింద గల గల పారే గోదావరి, చుట్టూ ప్రశాంత వాతావరణం తన్మయత్వం తో శరీరం పులకించి పోతుంటుంది. సమీపంలోనే ఒక కొబ్బరి, మామిటి చెట్లు ఉంటాయి. చెట్టు కింద సినిమా తీస్తే, ఆ సినిమా హిట్ అని చాలా మంది సినిమా వాళ్లు నమ్ముతారు. నమ్మకమే కాదు, ఇది చాలా సినిమాల్లో ప్రూవ్ కూడా అయింది. అందుకే అదే సెంటిమెంట్ తో ఈ చెట్టు కింద ఏకంగా 300కి పైగా సినిమాలు తీశారు.

సినిమావాళ్ళకి ఈ చెట్టు సెంటిమెంట్ ఎంతగా ఉందంటే మొత్తం సినిమాలో ఒక్క షాట్ అయినా ఈ చెట్టుకింద పెడితే, లేదా చెట్టుపై ఒక్క షాట్ తీసినా ఆ సినిమా హిట్ అనేంత వరకు సెంటిమెంట్ పెంచుకున్నారు. మొదటిసారిగా 1964లో మూగమనసులు సినిమాలోని ఒక పాటని ఇక్కడ చిత్రీకరించడంతో అప్పటి నుంచి దీని ప్రాభవం పెరిగింది. 1975 లో కృష్ణ నటించిన పాడిపంటలు సినిమా నుంచి రామ్ చరణ్ నటించిన రంగస్థలం వరకు ఈ సినిమా చెట్టు కింద షూటింగ్స్‌ జరిగాయి. మంచి హిట్ కొట్టాయి. ప్రముఖ దర్శకుడు పసలపూడి వంశీకి ఇక గోదావరి అంటే ప్రాణం. గోదావరి తీరంలో ఉన్న సినిమా చెట్టు ఆయనకు మహా ఇష్టం. ఈ చెట్టు గురించి ఆయన ప్రత్యేకంగా తన డైరీలో రాసుకున్నారట. గోదావరిని వంశీ చూసే కెమెరా కళ్లు భిన్నంగా ఉంటాయి. గోదావరి లొకేషన్స్, ఇక్కడ ప్రజల యాస, జీవనశైలిని ఆయన ప్రత్యేకంగా చూపిస్తారు. ఇలా మరే తెలుగు సినీ దర్శకుడు చూపించలేదంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే గోదావరి – వంశీ అంతగా ఒకరితో మరొకరు ఊసులు ఆడుకుంటారు. అంతగా గోదావరి అణువు అణువునూ అర్ధం చేసుకున్నారు వంశీ. అందుకే ఆయన తీసిన సినిమాలు ఈ చెట్టు పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికి ఆయన అటుగా వెళ్తే ఆ చెట్టుకింద కూర్చుని అక్కడ ఉన్న మిత్రులతో కలిసి భోజనం చేస్తారని స్ధానికులు చెబుతుంటారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా చెట్టుకున్న హిస్టరీ, సెంటిమెంటు మాటల్లో చెప్పలేము. ఇన్ని వందల సినిమాల షూటింగ్ జరుపుకున్న ఈ చెట్టుని ఎప్పుడో 150 ఏళ్ల క్రితం సింగలూరి తాతబ్బాయి అనే ఆయన నాటినట్లు స్ధానికులు చెబుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ చెట్టుని కుమారదేవం ప్రజలు సంరక్షించుకుంటూ వస్తున్నారు. అయితే గోదావరి వరదలు వచ్చినపుడల్లా గట్టు కోతకు గురవుతుంటుంది. ఆ కోత ఈ చెట్టుకు ముప్పుగా మారింది. అందుకే ఈ సారి మీరు అలా పోలవరం వెళ్లేపుడు ఓ సారి ఈ చెట్టు దగ్గర ఆగి గోదావరి ఒడిలో కాస్త సేద తీరటం మాత్రం మర్చిపోకండే..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..