AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఏపీ రైతులకు పండుగ ముందే వచ్చింది.. ఆగష్టు 2న ఖాతాల్లోకి రూ. 7 వేలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ఎన్నికల హామీని నెరవేర్చబోతోంది. ఎప్పుడెప్పుడా అని ఆంధ్రప్రదేశ్ రైతులు ఎదురు చూపుకు తెరపడబోతోంది. ఆగష్టు 2న నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు నిధులను సిద్ధం చేసింది. ఆ వివరాలు ఇలా..

Andhra: ఏపీ రైతులకు పండుగ ముందే వచ్చింది.. ఆగష్టు 2న ఖాతాల్లోకి రూ. 7 వేలు..
Ap News
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Jul 29, 2025 | 7:24 AM

Share

అన్నదాతల కోసం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కలిసి రైతులకు ఒకేసారి అన్నదాత సుఖీభవ నిధులు దక్కేలా నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 2న దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకం కింద 20వ విడత నిధులు విడుదలవుతుండగా, అదే రోజున ఆంధ్రప్రదేశ్‌లో ‘అన్నదాత సుఖీభవ’ నిధులూ రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. ఇది ఏపీ రైతులకు ఒక పెద్ద ఊరట. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సీఎం చంద్రబాబు తొలి దశ నిధుల్ని విడుదల చేయనున్నారు.

పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు అందించనుంది. మొత్తంగా ఒక్కరోజే రైతు ఖాతాలోకి రూ.7 వేలు నేరుగా డిపాజిట్ కానుంది. కేంద్రానికి సంబంధించిన కార్యక్రమం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ హాజరై నిధులు విడుదల చేస్తారు. ఈ విడతలో ఏపీకి రూ.831.60 కోట్లు పీఎం కిసాన్ నిధులు లభించనున్నాయి. వీటిని 41.58 లక్షల మంది రైతు కుటుంబాలకు జమ చేస్తారు. ఈ లెక్కన ప్రతి అర్హులైన రైతు కుటుంబానికి రూ.2 వేలు చొప్పున అందుతుంది.

టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారిగా రైతులకు చేస్తున్న సహాయం ఇది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు అన్నదాత సుఖీభవ పథకాన్ని మళ్లీ ప్రారంభించింది. ఇప్పుడు తొలివిడతగా రూ.5 వేలు నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఇది నేరుగా రైతు ఖాతాలోకి జమవుతుంది. మరిన్ని విడతలూ త్వరలోనే వస్తాయని అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 46.64 లక్షల మంది రైతు కుటుంబాలను సుఖీభవకు అర్హులుగా గుర్తించారు. వీరిలో 46.20 లక్షల మంది ఈకేవైసీ పూర్తిచేశారు. కేవలం 40,346 మంది రైతులు మాత్రమే ఇంకా ఈకేవైసీ చేయాల్సి ఉంది. వారూ త్వరలో పూర్తి చేస్తే వీళ్లకూ నిధులు అందుతాయి.

ఇంకో ముఖ్యమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకూ పెట్టుబడి ఆర్ధిక సహకారం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీరికి కార్డుల జారీ ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండో విడతలో నిధులు జమ చేస్తారు. ఆ సమయంలో వాళ్లకు మొదటి విడత + రెండో విడత కలిపి మొత్తంగా ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి