Tadipatri: బాత్రూంలో వాటర్ హీటర్ పెట్టి.. పిల్లల్ని స్నానం చేయించేందుకు తీసుకెళ్లిన తల్లి..
వాటర్ హీటర్లను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లగ్‌లు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేదంటే షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. వాటర్ హీటర్‌లను బాత్‌రూమ్‌లో పెట్టుకోకూడదు. ఎందుకంటే అక్కడ అంతా తడితో ఉంటుంది కాబట్టి, షాక్ కొట్టే ప్రమాదం ఉంది. బకెట్లో నీరు వేడెక్కిందో లేదో తెలుసుకోవాలని.. నీటిలో వేలు పెట్టొద్దు. దీనివల్ల షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది.

ఇది చలికాలం. ఎలక్ట్రిక్ వాటర్ హీటర్స్ వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే.. చిన్న నిర్లక్ష్యంతో ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. తాజాగా బాత్రూమ్‌లో విద్యుత్ హీటర్ తాకడంతో షాక్‌కు గురై ఓ చిన్నారి చనిపోగా.. తల్లీ కుమార్తె గాయపడ్డారు. తాడిపత్రి అంబేడ్కర్ నగర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలో బస్టాండు సమీపంలో నివాసం ఉండే వెంకటరాముడు బేల్దారి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య వాలంటీర్‌గా పని చేస్తుంది. ఈ దంపతులకు 5 ఏళ్ల విహన్య శ్రీ, జేష్టశ్రీ కుమార్తెలు ఉన్నారు.
నాగజ్యోతి ఇద్దరు కుమార్తెలకు స్నానం చేయించేందుకు బాత్రూంలోకి వెళ్లింది. అప్పటికే నీళ్లు వేడి చేసేందుకు వాటర్ హీటర్‌ను బకెట్‌లో వేసి స్విచ్ ఆన్ చేసింది. దాన్ని చిన్నారి తాకడంతో ముగ్గురికి కరెంట్ షాక్ తగలింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. బాత్రూంలోకి వెళ్లినవారు ఎంతకీ బయటకు రాకపోవడం.. కేకలు వేసినా పలకకపోవడంతో.. వెంకటరాముడు, స్థానికుల సాయంతో డోర్స్ పగులగొట్టి ముగ్గురిని స్థానిక గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి విహన్యశ్రీ మృతి చెందినట్లు నిర్ధారించారు. అపస్మారక స్థితిలో ఉన్న నాగజ్యోతిని మెరుగైన చికిత్స కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చిన్న కుమార్తె జేష్టశ్రీ స్వల్ప గాయాలతో బయటపడింది. వాటర్ హీటర్ వాడేవాళ్లు జాగ్రత్తులు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..