గోవు, వృషభాలకు ఇంతటి విశిష్టత ఉందా..? కనుమనాడు వీటిని ఎందుకు పూజిస్తారంటే..?

Kanuma Festival: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. మూడోరోజైన కనుక పండుగనాడు గోపూజ, వృషభ పూజలు నిర్వహించారు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగమైన కనుమ రోజున పశువులను పూజించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఉదయాన్నే వృషభాలను చక్కగా నీళ్లతో కడిగి, పసుపు, కుంకమలతో అలంకరించి, మెడలో గంట కట్టి, కాళ్లకు గజ్జెలు కట్టి పంట పొలాలకు తీసుకువెళ్తారు. ధర్మానికి ప్రతిరూపమైన వృషభాన్ని పూజించడం ద్వారా కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.

గోవు, వృషభాలకు ఇంతటి విశిష్టత ఉందా..? కనుమనాడు వీటిని ఎందుకు పూజిస్తారంటే..?
Kanuma Festival
Follow us
Fairoz Baig

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 15, 2025 | 6:24 PM

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంరంభాలు మిన్నంటాయి. మూడో రోజు కనుమ పండుగ సందర్భంగా పాడి పశువులను పూజించారు. గోశాలలో గోవులను భక్తి ప్రపత్తులతో పూజించి నైవేద్యాలను సమర్పించారు. అలాగే ధర్మానికి ప్రతిరూపమైన వృషభం అనుగ్రహాన్ని కనుమ వేళ పొందాలని కోరుకుంటారు భక్తులు. దుక్కి దున్నే సమయం నుంచి నూర్పిళ్ల వరకు రైతులకు ఆసరగా నిలిచే వృషభాలను రైతులు పూజించారు. ఉదయాన్నే వృషభాలను చక్కగా నీళ్లతో కడిగి, పసుపు, కుంకమలతో అలంకరించి, మెడలో గంట కట్టి, కాళ్లకు గజ్జెలు కట్టి పంట పొలాలకు తీసుకువెళ్తారు. ధర్మానికి ప్రతిరూపమైన వృషభాన్ని పూజించడం ద్వారా కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.

సర్వ దేవమయీ గౌః అంటే గోవు సర్వదేవతా స్వరూపంగా వేద, పురాణాలు చెబుతున్నాయి. గోవు మనయింట ఉంటే సకల దేవతలూ మన ఇంట ఉన్నట్లే. గోపూజ వల్ల సకల దేవతలు అనుగ్రహిస్తారు. అటువంటి గోవును హింసిస్తే సమస్త పాపాలూ చుట్టుకొంటాయి. మనిషి పుట్టింది మొదలు మరణించేదాకా – అంతేకాదు.. పుట్టక ముందు నుండి మరణించాక కూడా గోవుతో అవసరం ఉంటుంది. ఆడవారి గర్భదోషాలు పోగొట్టే శక్తి, మగవారికి పుంస్త్వాన్ని పెంచేశక్తి ఆవుపాలలో ఉంది. గో సేవతో దిలీప మహారాజు సంతానం పొందగల్గాడు. ఇలాంటి గోమాతలకు సంక్రాంతి పండుగ సందర్బంగా బాపట్ల జిల్లా చీరాలలో ప్రత్యేకంగా పూజలు చేశారు. చీరాల సంతబజారులో శ్రీ మహాలక్ష్మమ్మ మందిరం ఆవరణలో గోపూజా కార్యక్రమం నిర్వహించారు…

పసిపిల్లవానికి తల్లిపాల తరువాత అంత మేలైనవి ఆవుపాలు.. అందుకే గో మాత అంటాము. ఆవుపాలలో ఉన్న ఆరోగ్యం మరి ఎందులోనూ లేదు. ఆవుపాలు అమృతంతో సమానం, గోవుయొక్క వెన్ను కేంద్రంలో సూర్యనాడి ఉంటుంది. దానిద్వారా సూర్యశక్తి దాని పాలలో ప్రవేశిస్తుంది. ‘ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్’ అన్నారు. అంటే సూర్యుని ద్వారా ఆరోగ్యం లభిస్తుంది. అటువంటి సూర్యనాడివల్ల ఆవుపాలు అంత ఆరోగ్యం. గేదె పాలలో ఉన్నట్లుగా కొలెస్ట్రాల్ ఆవుపాలలో ప్రమాదకరంగా ఉండదు. కాబట్టి బి.పి. గుండె జబ్బులు రాకుండా ఉండటం కోసం ఆవుపాలు వాడటం మంచిది. ఆవుపాలు పిల్లలకు వాడితే వారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

కొత్తగా కట్టిన ఇంట్లో ముందు గోవు ప్రవేశిస్తే అందులోని దోషాలన్నీ పోతాయి. అందుకే గృహప్రవేశం చేయాలంటే ఆవు కావాలి. గోవు ఉన్నచోట చేతబడులువంటి దుష్ట ప్రయోగాలు పారవు. కాబట్టి మన సమీపంలో గోవు ఉండటంకూడా మనకు శ్రేయస్కరమే. ‘గోదానేన సమం దానం నాస్తి నాస్త్యేవ భూతలే’ అని శాస్త్రాలు గోదానంతో సమానమయిన దానం లేదని చెప్తున్నాయి. మరణించాక కూడా మనకు ఉత్తమగతులు కల్పించేది గోదానం. గోమయం అంటే ఆవుపేడలో రోగక్రిములను పోగొట్టేశక్తి ఉంది. అందుకే ఇంట్లో, ఇంటిముందు కూడా ఆవుపేడతో కళ్ళాపి చల్లితే ఆ ఇంట రోగ క్రిములుండవు. అంతేకాదు గోమయం లక్ష్మీ నివాసం. అటువంటి ఇళ్ళలో సంపదలు నిలుస్తాయి.

గోవుపైన, ఆవుపాల పైన విదేశాలలో చాలా పరిశోధనలు జరిగాయి. గోవు విశిష్టత గ్రహించి వాళ్ళు గో సంపదను పెంచుకొంటున్నారు. మన దేశంలో గోహత్యలు పెచ్చు పెరగటంతో వినాశం ఏర్పడి అన్ని విధాలా నష్టపోతున్నాము. ఆవు విష పదార్థాలు తిన్నా దానిపాలలోకి ఆదోషం రాదని, గేదెకు అటువంటి’ శక్తి లేదని విదేశాలలో పరిశోధనలు చేసి తేల్చారు. నిత్యం ఆవుపాలు వాడేవారికి వార్ధక్యము, దానివల్ల వచ్చే వ్యాధులు దరిజేరవు. ఇన్ని రకాల ఉపయోగాలు కల గోసంతతిని వృద్ధి చేసుకొందాం. గో మాతను పూజించుకొని ఆయురారోగ్య భోగభాగ్యాలు సంపాదించు కొందాం..