Kadapa MP Equations: వైసీపీ నుంచి బరిలోకి సిట్టింగ్‌ ఎంపీ.. విపక్ష పార్టీ ప్రత్యర్థి ఎవరు?

రాజకీయాల్లో అంతే బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతుంటాయి. సోయిలో లేదనుకున్న పార్టీనే సడెన్‌గా లేస్తుంది తిరుగులేదనుకున్న పార్టీ తప్పుకోవాల్సి వస్తుంది. ఆ పార్లమెంట్‌ స్థానంలో తెలుగుదేశం పార్టీకి కూటమి కుంపటిలా మారింది. వైసీపీకి చెక్‌ పెట్టేందుకు అంతా ఒక్కటవ్వాలన్న ప్రతిపాదనతో సీటు ఎవరికివ్వాల్సి వస్తుందోనని అంతా తలపట్టుకుంటున్నారు. ఆ పార్లమెంట్‌ సీటు కథ చివరికి ఏ మలుపు తిరగబోతోందో అన్న టెన్షన్ మొదలైంది.

Kadapa MP Equations: వైసీపీ నుంచి బరిలోకి సిట్టింగ్‌ ఎంపీ.. విపక్ష పార్టీ ప్రత్యర్థి ఎవరు?
Kadapa Politics

Edited By: Balaraju Goud

Updated on: Mar 23, 2024 | 4:20 PM

రాజకీయాల్లో అంతే బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతుంటాయి. సోయిలో లేదనుకున్న పార్టీనే సడెన్‌గా లేస్తుంది తిరుగులేదనుకున్న పార్టీ తప్పుకోవాల్సి వస్తుంది. ఆ పార్లమెంట్‌ స్థానంలో తెలుగుదేశం పార్టీకి కూటమి కుంపటిలా మారింది. వైసీపీకి చెక్‌ పెట్టేందుకు అంతా ఒక్కటవ్వాలన్న ప్రతిపాదనతో సీటు ఎవరికివ్వాల్సి వస్తుందోనని అంతా తలపట్టుకుంటున్నారు. ఆ పార్లమెంట్‌ సీటు కథ చివరికి ఏ మలుపు తిరగబోతోందో అన్న టెన్షన్ మొదలైంది.

కడప.. మూడక్షరాల ఈ పార్లమెంటు నియోజకవర్గం పేరు చెప్పగానే మొదట గుర్తుకొచ్చేది వైఎస్‌ కుటుంబం. ఆ ఫ్యామిలీకే పట్టం కడుతూ వస్తున్నారు కడప లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి.. తర్వాత జగన్మోహన్‌రెడ్డి.. నెక్ట్స్‌ అవినాష్‌రెడ్డి. వైఎస్‌ కుటుంబం చుట్టు తిరుగుతూ వస్తోంది అక్కడి రాజకీయం. వార్‌ వన్‌సైడ్‌ అన్నట్లుండే కడప పార్లమెంట్‌ సీటులో ఈసారి కొత్త స్ట్రాటజీతో ఉన్నాయి విపక్ష పార్టీలు. వైసీపీ నుంచి మరోసారి అవినాష్‌రెడ్డి పోటీ చేస్తుంటే.. అపోజిషన్‌ నుంచి ఏ పార్టీ ఉంటుందో, చివరికి ఎవరు అభ్యర్థి అవుతారో అంచనాలకు అందడం లేదు.

దశాబ్దాలుగా కడప గడపలో వైఎస్‌ కుటుంబం ఒకే మాట ఒకే బాట అన్నట్లుంది. కానీ మొదటిసారి వైఎస్ కుటుంబం నుంచి మరొకరు ప్రత్యర్థిగా నిలబడతారన్న చర్చ కడప రాజకీయాల్ని వేడెక్కించింది. వైసీపీపై అభ్యర్థిని నిలబెడతామన్న వైఎస్‌ షర్మిల ప్రకటనతో కొత్త సమీకరణాలు తెరపైకొస్తున్నాయి. ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల సొంత జిల్లా కడపపై ఫోకస్‌ పెట్టారు. మొన్నటిదాకా షర్మిల ఎన్నికల బరిలో ఉండరనుకుంది టీడీపీ. వైఎస్ వివేకా కూతురు సునీతని ఎంపీ అభ్యర్థిగా దించి షర్మిల మద్దతు కూడగట్టుకోవాలని భావించారు. కానీ షర్మిల ప్రకటనతో కడప ఎంపీ అభ్యర్థిగా ఆమె పోటీ ఖాయమనుకుంటున్నారు. ఈ పరిణామాలు టీడీపీ కూటమికి తల్నొప్పిగా మారుతున్నాయి.

కడప ఎంపీ సీటుని టీడీపీ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి కేటాయించింది. ఆయనే బరిలో ఉంటారని పార్టీ కేడర్‌కి చెప్పేసింది. అయితే పొత్తులో భాగంగా బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా ఉంటారన్న టాక్‌ కూడా బలంగా వినిపిస్తోంది. దీంతో కూటమి పొత్తుల్లో ఎంపీ సీటు టీడీపీకా.. బీజేపీకా అన్న ప్రశ్న మొదలైంది. అయితే ఉమ్మడి కడప జిల్లాలో మరో ఎంపీ సీటు రాజంపేటని బీజేపీకిచ్చి.. కడప నుంచి పోటీకి టీడీపీ సిద్ధమైంది. అవినాష్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చేందుకు వివేకా కూతురు సునీతని దించాలన్న ఆలోచన కూడా వచ్చిందట. అయితే ఈ ప్రతిపాదనని సునీత తిరస్కరించినట్లు చెబుతున్నారు. దీంతో ఇండిపెండెంట్ పోటీ చేసినా సునీతకు మద్దతివ్వడానికి సిద్ధపడుతున్నారట టీడీపీ నేతలు.

పార్టీ అభ్యర్థిగానైనా, లేదంటే ఇండిపెండెంట్‌గానైనా సునీతను నిలబెట్టి వైఎస్ కుటుంబానికి చెక్‌ పెట్టాలన్నది టీడీపీ ప్లాన్‌. కానీ వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ నుంచి పోటీకి సై అనటంతో కథ అడ్డంతిరిగేలా ఉందట. అయితే షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారా లేదా మరోచోటి నుంచి పోటీలో ఉంటారా అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే.. కూటమి నుంచి ఎవరో ఒకరిని బరిలోకి దింపాల్సి ఉంటుంది. అది టీడీపీ నుంచి శ్రీనివాసరెడ్డి.. లేదంటే బీజేపీ నుంచి ఆదినారాయణరెడ్డి అన్నది ఇంకా తేలలేదు. షర్మిల పోటీకి దిగితే కడప ఎంపీ బరిలో త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తుంది. అదే జరిగితే టీడీపీ ఇన్నాళ్లూ వేసుకున్న లెక్కలు వర్కవుట్‌ కావడం కష్టమేనన్నదీ కడప గడపలో జరుగుతున్న చర్చ..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…