Konaseema: మూర మల్లెదండ రేటెంతో తెలిస్తే బిత్తరపోవడం ఖాయం
గిరాకీకి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో మల్లె ధరలు ఓ రేంజ్‌లో పెరిగాయి. వేసవి సీజన్ వచ్చిందంటే చాలు.. మగువ మనసు మల్లెపూల వైపే ఉంటుంది. అందులో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్. మల్లెపూలు పెట్టుకోకుండా పెళ్లికి కానీ, ఫంక్షన్‌కి కానీ వెళ్లడం ఆడవాళ్లకి చాలా పెద్ద విషయం. సీజన్ ఆరంభం దశ కావడంతో ఇంకా పూర్తి స్థాయిలో పూలు అందుబాటులోకి రాలేదు.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మల్లెపూల ధరలు మండుతున్నాయి. మాఘమాసం ప్రారంభం కావడంతో మార్కెట్లోకి వచ్చిన మల్లెపూలు ఒక్కసారిగా ధరలు ఆకాశాన్ని అంటాయి. మల్లెపూల సీజన్ ప్రారంభం అయింది. అయితే పూల దిగుబడి అంత అంత మాత్రంగానే ఉండటంతో.. రేటు అధికంగా ఉంది. అందులోనూ మరోవైపు మాఘమాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు ఎక్కువగా ఉన్నాయి. హోల్ సెల్ మార్కెట్లలో కేజీ.. రెండు వేల రూపాయలు పలుకుటుండగా.. బహిరంగ మార్కెట్ లో రెండు వేల అయిదు వందల రూపాయలు పలుకుతున్నాయి. ఒక మూర మల్లెపూల దండను 100 నుంచి 150 రూపాయలు అమ్ముతున్నారు.

Jasmine
మల్లెపూలు సీజన్ స్టార్టింగ్ కావడం,పెళ్ళిళ్లు ఎక్కువగా ఉండటంతో.. రేట్లు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు వ్యాపారులు. కొన్ని రోజుల పాటు ధరలు ఇలానే ఉంటాయని చెబుతున్నారు. పూలు మార్కెట్‌కి ఎక్కువ మొత్తంలో వచ్చినప్పుడు ధరలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. మల్లె పూల వాసన మధురం.. ధర మాత్రం ఘాటు అంటున్నారు వినియోగదారులు. సువాసనలు వెదజల్లుతూ మధురానుభూతులు పంచె మల్లె అంటే ఇష్టపడే ఆడవాళ్లు మాత్రం రేటు ఎక్కువ అయిన సీజన్లో మాత్రమే దొరికే పూలను ఒక మూర అయినా కొంటున్నారు. బారెడు మూరలు కొనుక్కునేవారు కూడా.. చిన్న దండ అయినా కొనుక్కుని.. కొప్పుల్లో పెట్టుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…