AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో కలకలం.. తాకట్టు బంగారం మాయం! ఖాతాదారుల తీవ్ర ఆందోళన

పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ఖాతాదారులు తాకట్టు పెట్టిన 40 కాసులకు పైగా బంగారం మాయమైంది. గోల్డ్ లోన్ ఆఫీసర్ గైర్హాజరు కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమ బంగారం పోయిందని తెలుసుకున్న వందలాది మంది ఖాతాదారులు బ్యాంకు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో కలకలం.. తాకట్టు బంగారం మాయం! ఖాతాదారుల తీవ్ర ఆందోళన
Bank Of Baroda
B Ravi Kumar
| Edited By: |

Updated on: Jun 09, 2026 | 8:56 AM

Share

ఏలూరు: బ్యాంకుల్లో దాచుకుంటేనే బంగారం భద్రం అనుకున్న నమ్మకం కాస్తా అభాసుపాలైంది. ఓ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన విలువైన బంగారు ఆభరణాలు మాయమవ్వడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ఈ ఘోరం వెలుగుచూసింది. బ్యాంకులో ఉంచిన బంగారం మాయమైందనే సమాచారం కార్చిచ్చులా వ్యాపించడంతో, వందలాది మంది ఖాతాదారులు బ్యాంక్ ఎదుట బారులు తీరి తీవ్ర ఆందోళనకు దిగారు. తమ శ్రమకోర్చి కూడబెట్టుకున్న సొమ్ము ఏమైపోతుందోనన్న భయాందోళనలతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

గోల్డ్ ఆఫీసర్ గైర్హాజరు.. అసలు లీలలు వెలుగులోకి!

స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పక్క రోడ్డులో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో గత కొన్ని రోజులుగా గోల్డ్ లోన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రాజు అనే ఉద్యోగి విధులకు రాకపోవడంతో ఈ అనుమానాలు మొదలయ్యాయి. శనివారం నాడే ముగ్గురు ఖాతాదారులకు సంబంధించిన దాదాపు 30 కాసుల బంగారం మాయమైనట్లు ప్రాథమికంగా వెలుగుచూసింది. ఈ వార్త సోమవారం ఉదయానికి పట్టణమంతా పొక్కడంతో, తాకట్టు పెట్టిన మిగిలిన ఖాతాదారులు కూడా ఆందోళనతో బ్యాంకుకు పోటెత్తారు. తమ బంగారం సురక్షితంగా ఉందో లేదో చూపించాలంటూ యాజమాన్యాన్ని నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జంగారెడ్డిగూడెం ఎస్సై వీరప్రసాద్ తన సిబ్బందితో రంగప్రవేశం చేశారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి, ఖాతాదారులను సమన్వయపరుస్తూ లోపలికి వెళ్లేందుకు వీలుగా టోకెన్ల పద్ధతిని ప్రవేశపెట్టారు. సోమవారం రాత్రి 7 గంటల వరకు దాదాపు 80 మంది టోకెన్ల ఆధారంగా లోపలికి వెళ్లి పరిశీలించుకోగా, అనేకమంది ఖాతాల్లో బంగారం మాయమైనట్లు నిర్ధారణ అయింది.

సుమారు 40 కాసుల బంగారం గల్లంతు

  • ఈ భారీ అక్రమంపై సమాచారం అందుకున్న బ్యాంక్ ఉన్నతాధికారులు, ప్రత్యేక సిబ్బంది సోమవారం అత్యవసరంగా జంగారెడ్డిగూడెం శాఖకు చేరుకున్నారు. రికార్డులను, ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించగా.. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 40 కాసుల పైగా బంగారం మాయమైనట్లు గుర్తించారు.
  • సబ్బారపు శ్రీనివాసరావు: జంగారెడ్డిగూడేనికి చెందిన ఈయనకు సంబంధించిన 5 కాసుల బరువున్న నల్లపూసల గొలుసు పూర్తిగా మాయమైంది.
  • సింహాద్రి గంగాధరరెడ్డి (నాగులగూడెం): ఈయన ఈ శాఖలో 13 కాసుల బంగారు వస్తువులను తాకట్టు పెట్టగా, తనిఖీల్లో కేవలం 32 గ్రాములు (సుమారు 4 కాసులు) మాత్రమే లభ్యమయ్యాయి. మిగిలిన 9 కాసుల బంగారం అదృశ్యమైంది.
  • చిలుకూరి శ్రీనివాసరెడ్డి (నాగులగూడెం): గత జనవరిలో ఈయన తన 4 బంగారు వస్తువుల రుణాన్ని నూతనీకరించుకున్నారు (రిన్యూవల్). అయితే ప్రస్తుత తనిఖీల్లో ఆ నాలుగు వస్తువుల్లో 8 కాసుల విలువైన మూడు వస్తువులు గల్లంతవగా, కేవలం ఒక్క వస్తువు మాత్రమే మిగిలింది.
  • కొప్పుల రమేష్ (ధర్మారావుపేట): ఈయనకు చెందిన 2 కాసుల బంగారు గాజులు మాయమయ్యాయి.
  • వీటితో పాటు మరో వ్యక్తికి చెందిన 6 కాసుల బంగారం సహా పలువురి ఆభరణాలు కూడా రికార్డుల్లో ఉన్నా, లాకర్‌లో కనిపించకుండా పోయాయి.

రాత్రి వేళల్లోనూ టెంటు కిందే బాధితుల నిరీక్షణ

బ్యాంకు సిబ్బంది చేతివాటం వల్లే ఈ ఘోరం జరిగిందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. రాత్రి చాలా సమయం గడిచినా, బ్యాంకు ఎదుట టెంట్లు వేసుకుని కుర్చీల్లోనే కూర్చుని నిరసన కొనసాగించారు. బాధితులంతా తాము నష్టపోయిన బంగారం వివరాలతో బ్యాంకు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందజేశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి, తప్పు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, తమ బంగారాన్ని తమకు సురక్షితంగా అప్పగించాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులోనే ఇలాంటి భద్రతా లోపాలు తలెత్తడంపై స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us