Pawan Kalyan: నన్ను చంపేందుకు సుపారీ గ్యాంగులను దింపారు.. భయపడేది లేదు.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

|

Jun 18, 2023 | 7:22 AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్కస్థానం కూడా దక్కకూడదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. వైసీపీ గోదావరి జిల్లాలుగా మారాలని, దానికోసం వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున బలమైన వ్యూహం ఉండాలన్నారు

Pawan Kalyan: నన్ను చంపేందుకు సుపారీ గ్యాంగులను దింపారు..  భయపడేది లేదు.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్కస్థానం కూడా దక్కకూడదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. వైసీపీ గోదావరి జిల్లాలుగా మారాలని, దానికోసం వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున బలమైన వ్యూహం ఉండాలన్నారు. దానికి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పూర్తిస్థాయి ప్రణాళికతో సంసిద్ధమవ్వాలన్నారు. శనివారం సాయంత్రం కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ నాయకుల సమావేశంలో పవన్‌ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ‘డబ్బు, పేరు కాదు.. జనసేన పార్టీ శ్రేణులను బలమైన ఆలోచనా విధానం కలిపింది. మొదటి నుంచి ఓ నిర్ధిష్ట విధానంలో నేను బతకాలని అనుకున్నాను. క్రమశిక్షణతో పాటు సమాజాన్ని చదువుతూ ముందుకెళ్లగలిగాను. నిత్యం నా మనసు బరువుగా ఉంటుంది. ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్పే వేల వేదనలు నిత్యం వింటూ, రాత్రి వేళ వారి గురించి ఆలోచిస్తూ బరువెక్కిన గుండెతో నిద్రపోతాను. నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులు లేవు.. ప్రజల వేదనలు, వారి కన్నీటి గాథలే నన్ను మరింత రాటు దేల్చాయి. ఘోరమైన ఓటమి తర్వాత కూడా నేను నిలబడి ఉన్నానంటే వారికి ఏదైనా మేలు చేయాలన్న బలమైన సంకల్పమే ముందుకు నడిపిస్తోంది. నాకు డబ్బు వ్యామోహం లేదు. డబ్బు మనిషిగా మారితే పోరాట బలం పోతుందని బలంగా నమ్మేవాడిని. పీడితుల కోసం బలమైన భావజాలం ఉండాలని, అది నిర్దుష్టంగా ఉండాలని నమ్మే వ్యక్తిని. పార్టీ కోసం నిత్యం వేలాది మంది పనిచేస్తున్నారు. జనసేన పార్టీకి కోట్లాది మంది మద్దతు ఉంది. అందరినీ నేను కలవకపోవచ్చు. మీరు మాత్రం నా ప్రతినిధులుగా వారిని కలవండి. ప్రజల కష్టాలను వినే నాయకుడే భవిష్యత్తులో బలంగా మారతాడు. నన్ను చూసి ఓట్లు వేస్తాం అనే స్థాయి నుంచి, మిమ్మిల్ని చూసి ఓట్లు వేస్తాం అనే స్థాయికి ప్రజలను తీసుకురావాలి. వారి కష్టాల్లో, కన్నీళ్లలో జనసేన ప్రతినిధులుగా మీరు తోడుగా ఉండాలి’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

అదే మమ్మల్ని కలిపింది..

‘నాకు చేగువేరా స్ఫూర్తి అని పదేపదే ఎందుకు చెబుతాను అంటే తన ప్రాంతం.. తన మనుషులు కాని వారి కోసం ప్రాణత్యాగం చేసి అమరుడయ్యాడు. నాయకత్వం అంటే త్యాగాలతో నిండిన బాధ్యతగా నేను భావిస్తాను. కేవలం హడావుడి చేస్తే నాయకులు కాలేరు. నాతో రెండుసార్లు ఫొటోలు దిగితే నాయకత్వం రాదు. ప్రజల్లో ఉండి, వారి కోసం బలంగా పనిచేసి, పార్టీ భావజాలాన్ని విస్తరిస్తారో కచ్చితంగా మీకు గుర్తింపు లభిస్తుంది. సాధారణ ప్రజల బాధలు, వారి సమస్యలు చాలా దగ్గరగా వినాలని నాకు మనసులో బలంగా ఉంటుంది. అయితే అభిమానుల తాకిడి దాన్ని అడ్డుకునే అవకాశం ఉంది. నేను సినిమా నటుడికి కాకపోయి ఉండే బలమైన రాజకీయ నాయకుడిని అయ్యేవాడిని. జనసేన పార్టీని తపనతో నడుపుతున్నాను. దీనివెనుక బలమైన భావజాలం, సిద్ధాంతం ఉన్నాయి. నన్ను యువత నమ్మతున్నారంటే అది కేవలం భావజాలం కలిపిన ఓ సున్నితమైన బంధం. దాన్ని మీరు కొనసాగించాలి. యువత నమ్మితే సిద్ధాంతం కోసం ప్రాణాలివ్వడానికి అయినా సిద్ధంగా ఉంటారు. ఏ గొప్ప నాయకుడి చరిత్ర చూసినా ఎన్నో త్యాగాల మిళితం అయి ఉంటాయి’

అధికారం పోతుందనే భావనే క్రూరంగా మార్చేస్తుంది

‘అధికారం చేజిక్కించుకునే నాయకులు క్రూరంగా మారిపోతారు. అన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచి వెళ్ళకూడదు అని బలంగా భావిస్తారు. అధికారం నిలబెట్టుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. బాలు సినిమా సమయంలో ఓ ఐపీఎస్ అధికారి నా దగ్గరకు వచ్చి మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టాలని భావిస్తున్నారా అని అడిగారు.. ఎందుకు అని నేను అడిగితే మీ కుటుంబానికి కాస్త హాని తలపెట్టే అవకాశం ఉందని చెప్పారు. రాజకీయాల్లోకి మా కుటుంబం వస్తే అప్పట్లో అధికారంలో ఉన్న నాయకులకు భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందని, మేం రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పించేందుకు మా ఇంటి ఆడబిడ్డల మీద విపరీతమైన దుష్ర్పచారం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. రాజకీయాల్లో పదవి పోతుందనే భయం చాలా చెడ్డది. తమకు హానీ చేస్తారని తెలిస్తే, కడుపులోని బిడ్డను కూడా చంపేందుకు వెనుకాడరు. ప్రస్తుతం జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో బలంగా ఉంది. అధికారం నుంచి వైసీపీ పాలకులను గద్దె దించే దిశగా పయనిస్తోంది. ఇలాంటి సమయంలో వారు ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారు. నాకు ప్రాణహాని ఉంది. సుపారీ గ్యాంగులను ప్రత్యేకంగా దింపారనే సమాచారం ఉంది. కచ్చితంగా భద్రతా నియమాలను నాయకులతో పాటు జనసైనికులు, వీర మహిళలు తప్పనిసరిగా పాటించాలి. నేటి వైసీపీ పాలకులు అధికారం కోసం ఏం చేయడానికి అయినా సిద్ధమే. నన్ను భయపెట్టే కొలది నేను మరింత రాటు దేలుతాను’

ఇవి కూడా చదవండి

జనసేన పార్టీ వేదికను బతికించుకుందాం

‘జనసేన పార్టీ విప్లవకారుల స్ఫూర్తిని నింపుకున్న నిజాయతీ గల వ్యక్తుల సమూహంతో నిండిన పార్టీ. పోరాటాల పార్టీ. ప్రజా సమస్యలపై ఎవరికీ భయపడకుండా ముందుకెళ్లే పార్టీ. అలాంటి వేదికను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. 2019లో పార్టీ ఓడిపోయినా బలంగా ఎందుకు నిలబడ్డాను అంటే నన్ను నమ్మిన 7 శాతం ప్రజల కోసం… వారిని వదిలి వెళ్లకూడదనే బలమైన మాట కోసం ఉన్నాను. పార్టీ నాయకత్వం అధికారికంగా ఒకరికి బాధ్యత అప్పగిస్తే, వారి తీరు నచ్చకపోతే పార్టీకి అవసరమయ్యేలా మీరు మరో మార్గంలో పనిచేయండి. పార్టీ ఉన్నతి కోసం చేసే ఏ కార్యక్రమం అయినా మంచిదే. లేనిపోని అహం వల్ల పార్టీ నడవదు. క్రమశిక్షణ పార్టీకి బలం. దానిని ఎట్టి పరిస్థితుల్లో తప్పొద్దు. ఏకత్వ స్ఫూర్తితో ముందుకు వెళ్లండి. సమాజంలో మనుషుల్ని చదవండి. వారి నుంచి నేర్చుకోండి’ అని పవన్‌ పిలుపునిచ్చారు.

 

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..