Pawan Kalyan-Chandrababu: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. ఆ విషయాలపై చర్చ జరిగిందా.. లేదా..?
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన పొత్తు ప్రకటన తర్వాత రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణ దిశగా ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే రెండు పార్టీల నుంచి ఉమ్మడి కమిటీల నియామకం జరిగింది. వైఎస్సార్‌సీపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని రెండు పార్టీలు ప్రకటించాయి. అయితే రాజమండ్రిలో మొదటిసారి సమావేశమైన ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశంలో ముందుగా రెండు పార్టీల భాగస్వామ్యంపై ఫోకస్ పెట్టాయి.

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన పొత్తు ప్రకటన తర్వాత రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణ దిశగా ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే రెండు పార్టీల నుంచి ఉమ్మడి కమిటీల నియామకం జరిగింది. వైఎస్సార్‌సీపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని రెండు పార్టీలు ప్రకటించాయి. అయితే రాజమండ్రిలో మొదటిసారి సమావేశమైన ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశంలో ముందుగా రెండు పార్టీల భాగస్వామ్యంపై ఫోకస్ పెట్టాయి. క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల కేడర్ మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా ముందుకు సాగేలా చర్యలు చేపట్టాయి. దీంతోపాటు ఉమ్మడి జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు కూడా పూర్తయ్యాయి. అన్ని జిల్లాల్లో తెలుగుదేశం-జనసేన కలిసి సమన్వయ సమావేశాలు ఏర్పాటుచేసుకున్నాయి. చిన్నచిన్న విభేదాలు వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. ఇలా రెండు పార్టీల మధ్య పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిన తర్వాత ప్రభుత్వంపై ఆందోళనలకు కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించాయి.అయితే ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి..? ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై చర్చించేందుకు రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించాయి. దీనికంటే ముందుగానే ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని కూడా రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. కానీ కొన్ని కారణాల వల్ల రెండు కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. నవంబర్ ఒకటో తేదీన విడుదల చేయాలనుకున్న ఉమ్మడి మేనిఫెస్టో, నవంబర్ మూడో తేదీన నిర్వహించాలనుకున్న ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం కూడా వాయిదా పడ్డాయి. అయితే చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడం, వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. మరోవైపు ఇటలీ నుంచి తిరిగొచ్చిన పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. దీంతో కేవలం పరామర్శ మాత్రమే కాకుండా రాజకీయపరమైన చర్చ కూడా జరిగినట్లు ఆయా పార్టీల వర్గాలు చెబుతున్నాయి.
పవన్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఇద్దరూ చంద్రబాబు ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. 53 రోజుల పాటు జైలులో ఉన్న చంద్రబాబు.. ఆరోగ్య కారణాలతో బెయిల్ మీద బయటకు వచ్చారు. ఏఐజీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఇటు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలోనూ కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ చంద్రబాబును కలిశారు.. అయితే ఇదే ఇప్పుడు ఇంటరెస్టింగ్‌గా మారింది. చంద్రబాబు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ములాఖత్‌లో ఆయనను కలిసిన తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నామని…జైలు పరిసరాల్లోనే పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆ నేపథ్యంలో తాజాగా చంద్రబాబుతో రెండు పార్టీల మధ్య పొత్తులు, సీట్ల పంపకాలు లాంటి విషయాలపై చర్చ ఏమైనా జరిగిందా అనే విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఉమ్మడి మేనిఫెస్టోపై విడుదలపై రానున్న స్పష్టత..
రాజమండ్రిలో జరిగిన ఉమ్మడి కార్యాచరణ కమిటీ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, లోకేష్ లు మేనిఫెస్టో అంశంపైనా చర్చించారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రకటించిన సూపర్ సిక్స్ లో కీలక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. దీనికి తోడు మరో నాలుగు ప్రతిపాదనలు జనసేన తరపున ఇచ్చారు. టీడీపీ సూపర్ సిక్స్‌లో మహిళల కోసం మహా శక్తి పథకం పొందుపరిచారు. రైతుల కోసం అన్నదాత, నిరుద్యోగుల కోసం యువ గళం, ఇంటింటికీ నీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్ పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ పథకాలకు అంగీకరించిన జనసేన కూడా తమ పార్టీ ప్రధానంగా గుర్తించిన సమస్యలు, హామీలను మేనిఫెస్టోలో చేర్చాలని నిర్ణయించింది. రైతులు, యువత, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దుర్వినియోగం పైనా మేనిఫెస్టోలో చేర్చాలని నిర్ణయించింది. అయితే రెండు పార్టీలు కలిసి నవంబర్ ఒకటో తేదీన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలి అనుకున్నప్పటికీ వాయిదా పడింది. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల తర్వాత ప్రజల్లోకి వెళ్తామని ఇద్దరు నేతలు ప్రకటించారు. పలు కారణాలతో వాయిదా పడిన ఉమ్మడి మేనిఫెస్టోపై చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలిసింది. దీంతో త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టో విడుదలపై స్పష్టత వస్తుందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు.
టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణపై క్లారిటీ వచ్చేనా?
తెలుగుదేశం-జనసేన క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన పోరాటాలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల తర్వాత ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించాలని భావించారు. అయితే అది కాస్తా వాయిదా పడింది. తాజాగా చంద్రబాబుతో భేటీతో ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. రెండు పార్టీల నుంచి ముఖ్య నేతలు పాల్గొనేలా ఉమ్మడి ఉద్యమ కార్యాచరణ ఉండాలని భావిస్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగిస్తూ మరోవైపు టీడీపీ కూడా తమ కార్యాక్రమాలు కొనసాగిస్తుందని చెబుతున్నారు. రెండు పార్టీల ఆందోళనలు, సభలకు ఇరు పార్టీల కేడర్ హాజరయ్యేలా చూస్తున్నారు. ఇక ఉమ్మడిగా వారంలో రెండు మూడుసార్టు సమావేశాలు నిర్వహించేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
