Andhra Pradesh: అమానుషం.. పురిటి నొప్పులతో ప్రసవ వేదన.. డోలీపై మోసుకెళ్లిన దైన్యం.. ఆఖరికి..
గిరిపుత్రులను కష్టాలు వీడడం లేదు. జీవించేందుకూ నిత్యం పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తోంది. తినే తిండి నుంచి వైద్యం వరకు అన్నీ అందని ద్రాక్షలా మారిపోయాయి. ముఖ్యంగా వైద్య సౌకర్యాలు...

గిరిపుత్రులను కష్టాలు వీడడం లేదు. జీవించేందుకూ నిత్యం పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తోంది. తినే తిండి నుంచి వైద్యం వరకు అన్నీ అందని ద్రాక్షలా మారిపోయాయి. ముఖ్యంగా వైద్య సౌకర్యాలు వారి పాలిట మరణశాసనాలు రాస్తున్నాయి. తీవ్ర అనారోగ్యం వస్తే.. ప్రాణాలపై ఆశ కోల్పోయే పరిస్థితి దాపురించింది. తాజాగా.. విశాఖ మన్యంలో ఇలాంటి ఘటనే జరిగింది. పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో గర్భిణీని డోలీలో మోసుకెళ్లారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని పెదగరువు కొండ శిఖర గ్రామానికి చెందిన కమల అనే మహిళకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. అయితే.. ఆ గ్రామంలో ఆస్పత్రి లేదు. బుచ్చింపేట పీహెచ్సీ కి తరలించారు.
విషయం తెలుసుకున్న గ్రామస్థులు, మహిళ బంధువులు.. ఆమెను చికిత్స కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారు. అయితే గ్రామం నుంచి బయటకు వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో చేసేదేమీ లేక.. నిండు గర్భిణీని డోలిపై మోసుకెళ్లారు. కొండలు, గుట్టలు దాటుకుంటూ మూడు కిలోమీటర్లు డోలిపై తీసుకెళ్లారు. అర్ల వరకు మోసుకెళ్లి.. ఆ తర్వాత బుచ్చింపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు 108 వాహనంలో తరలించారు. మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్య పరిస్థితి విషమించి.. మృతి చెందింది. దీంతో బాధిత తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.
విశాఖ ఏజెన్సీలో గర్బిణీలకు డోలీ కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నిన్న హుకుంపేటలో గర్బిణీని ఆసుపత్రికి తెచ్చేలోపు డోలీలోనే డెలివరీ-అయి బిడ్డ చనిపోయాడు. అంతకు ముందు విజయనగరంలో డోలీలో గర్భిణీని ఎక్కించిన ఆశావర్కర్లు ఆమెను.. ఆసుపత్రికి మోసుకొచ్చారు. రెండురోజుల్లో రెండు ఘటనలు జరగడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..