అయ్యన్నపాత్రుడి అనకాపల్లి ఆశలు గల్లంతయ్యాయా..? సీఎం రమేష్‌ను ఆహ్వానిస్తారా.. నెక్స్ట్ ఏంటి..?

అనకాపల్లి ఎంపీ టిక్కెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అయ్యన్నపాత్రుడికి షాక్‌ తగిలిందా?.. కూటమి పొత్తులో అనకాపల్లి ఎంపీ టిక్కెట్‌ సీఎం రమేష్‌కు కేటాయించడంపై అయ్యన్న రగిలిపోతున్నారా?.. కొడుక్కి ఇవ్వకున్నా.. నాన్‌లోకల్‌కి మాత్రం టిక్కెట్‌ ఇవ్వొద్దన్న కామెంట్స్‌కు అయ్యన్న కట్టుబడి ఉంటారా?.. ఇంతకీ.. అనకాపల్లి బీజేపీ ఎంపీ టిక్కెట్‌ సీఎం రమేష్‌కు కేటాయించడంపై ఉత్తరాంధ్రలో జరుగుతున్న ప్రచారం ఏంటి?.. సీఎం రమేష్‌ అభ్యర్థిత్వంపై కూటమి నేతల రియాక్షన్‌ ఎలా ఉండబోతోంది?...

అయ్యన్నపాత్రుడి అనకాపల్లి ఆశలు గల్లంతయ్యాయా..? సీఎం రమేష్‌ను ఆహ్వానిస్తారా.. నెక్స్ట్ ఏంటి..?
Ayyanna Patrudu Cm Ramesh
Follow us
Eswar Chennupalli

| Edited By: Shaik Madar Saheb

Updated on: Mar 26, 2024 | 11:24 AM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడా లేదు.. అన్ని పార్టీల్లోనూ టిక్కెట్ల వ్యవహారంలో గందరగోళం నెలకొంది. ప్రధానంగా.. కూటమి పార్టీల్లో కుంపట్లు కాకరేపుతున్నాయి. అనకాపల్లి టిక్కెట్‌ విషయంలో టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడిలో అసహనం వ్యక్తం అవుతోంది. అధినేత చంద్రబాబు కంటే టీడీపీలో తానే సీనియర్ అని గర్వంగా చెప్పుకునే అయ్యన్నపాత్రుడికి కోపం వస్తే లోపల అస్సలు దాచుకోరు బహిరంగంగానే మాట్లాడేస్తారు. ఎన్నో సందర్భాల్లో అది జరిగింది కూడా. ఇటీవల అనకాపల్లి జిల్లా పర్యటనలో తన కుమారుడి అనకాపల్లి ఎంపీ సీటు అభ్యర్థనను పరిశీలించాలని చంద్రబాబును నేరుగానే కోరారు. 40 ఏళ్లుగా పార్టీకి సేవలు చేస్తున్న తమ కుటుంబంలో మరొకరికి టికెట్ ఇవ్వడంలో తప్పేమీ లేదనే సెంటిమెంట్‌ను కూడా జోడించారు. కుమారుడు చింతకాయల విజయ్ సైతం పార్టీకి సేవలందిస్తున్నారని.. టికెట్ ఇస్తే ఈ ప్రాంత వాసులు తనను ఆదరించినట్లే ఆదరిస్తారని తెలిపారు. అదే సమయంలో.. కొడుక్కి టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ.. నాన్‌లోకల్స్‌కి మాత్రం టికెట్ ఇస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అప్పట్లో బైరా దిలీప్‌కుమార్‌కి టీడీపీ అనకాపల్లి ఎంపీ టిక్కెట్‌ ఇస్తారని ప్రచారం జరగడంతో అయ్యన్న అలా కామెంట్స్‌ చేశారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అనకాపల్లి ఎంపీ టిక్కెట్‌ను టీడీపీ.. బీజేపీకి ఇచ్చేయడం అయ్యన్న ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. అందులోనూ.. ఆ సీటును టీడీపీ మాజీ నేత సీఎం రమేష్‌కి బీజేపీ కేటాయించడంతో ఇప్పుడు అయ్యన్నలో అసహనం మరింత కట్టలు తెంచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

సహకరించాలని అయ్యన్నకు ఫోన్ చేసి అడిగారా?

వాస్తవానికి.. సీఎం రమేష్ కడప జిల్లాకు చెందిన ఓసీ వెలమ.. అనకాపల్లిలో వెలమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉన్నా ఇక్కడ అంతా బీసీ వెలమలకే ఇంపార్టెన్స్‌ ఇస్తారు. స్థానికేతరుడు, అందులోనూ ఓసీ వెలమ కావడంతో సీఎం రమేష్ అభ్యర్థిత్వంపై అయ్యన్న ఎలా రియాక్ట్‌ అవుతారన్నది ఆసక్తి రేపుతోంది. అయితే.. స్థానికులకే టికెట్ ఇవ్వాలని అయ్యన్న గతంలో చేసిన కామెంట్స్‌కు కట్టుబడి ఉంటారా.. లేక.. ఇచ్చింది బీజేపీ కాబట్టి సైలెంట్‌ అవుతారా?.. అనేదానిపైనా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు.. తనకు అనకాపల్లి కన్ఫర్మ్ చేస్తారన్న నమ్మకంతో వారం క్రితమే సీఎం రమేష్.. అయ్యన్నకు ఫోన్ చేసి సహకరించాలని కోరినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అయ్యన్న ఘాటుగానే రియాక్ట్ అయ్యారట. ఒకదశలో ఘాటైన పదజాలాన్నే వాడినట్లు ఆయా పార్టీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. అయినప్పటికీ.. ఆయ్యన్నతో సీఎం రమేష్‌కి పాత ఫ్రెండ్‌షిప్‌ ఉండడంతో నేరుగా కలవాలని నిర్ణయించుకున్నారట. తాజాగా బీజేపీ నుంచి అనకాపల్లి ఎంపీగా అభ్యర్థిగా సీఎం రమేష్‌ పేరు ఫిక్స్‌ కావడంతో అయ్యన్న ఎలా రియాక్ట్ అవుతారన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

పుండు మీద కారం చల్లినట్లు గంటా వ్యవహారం..

ఇదిలావుంటే.. అనకాపల్లి సీటును సీఎం రమేష్‌కు కేటాయించడంతోనే అయ్యన్నలో అసహనం వ్యక్తమవుతుంటే.. పుండు మీద కారం చల్లినట్లు.. మరో అంశమూ ఇబ్బందిగా మారింది. సీఎం రమేష్ అనకాపల్లికి రావడం వెనుక సొంత పార్టీలో ప్రత్యర్థి అయిన గంట శ్రీనివాసరావు పాత్ర ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ అంశాన్ని కూడా అయ్యన్న సీరియస్‌గానే పరిగణించే అవకాశం ఉంది. గతంలో బైరా దిలీప్‌కి టిక్కెట్‌ వస్తుందనే ప్రచారం కూడా గంటా ప్రోత్సాహంతోనే జరిగిందనేది అయ్యన్న అనుమానం. ఈ క్రమంలో.. సీఎం రమేష్ విషయంలో అయ్యన్న అసంతృప్తి కామన్‌ అయినప్పటికీ.. ఎలా రియాక్ట్‌ అవుతారన్నది ఇంట్రస్టింగ్‌ మారుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..