ఏం టాలెంట్ గురూ.. ఆధునిక యుగంలో ఏకలవ్య శిష్యుడు..! విద్యార్థి ప్రతిభకు నెటిజన్లు ఫిదా..!
చిన్న వయస్సులోనే ఓ యువకుడు తన ప్రతిభకు పదును పెట్టి, అందరి ప్రశంసలు పొందుతున్నాడు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం జాడవారి కొత్తవలసకు చెందిన రాజాపు సిద్దు అనే విద్యార్థి, రాజాం ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. సిద్దు తన గ్రామం నుండి రాజాంలోనే ప్రభుత్వ కాలేజ్ కి వెళ్లాలంటే పదిహేడు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

చిన్న వయస్సులోనే ఓ యువకుడు తన ప్రతిభకు పదును పెట్టి, అందరి ప్రశంసలు పొందుతున్నాడు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం జాడవారి కొత్తవలసకు చెందిన రాజాపు సిద్దు అనే విద్యార్థి, రాజాం ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. సిద్దు తన గ్రామం నుండి రాజాంలోనే ప్రభుత్వ కాలేజ్ కి వెళ్లాలంటే పదిహేడు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాలేజ్ కి వెళ్లడానికి సిద్దు తన గ్రామం నుండి మూడు కిలోమీటర్లు కాలినడకన వచ్చి, అక్కడ నుండి ఆటో లేదా బస్సు ద్వారా వెళ్లాల్సి వచ్చేది.
సిద్ధూతోపాటు తన చెల్లెలు ఒకే కాలేజ్‌లో చదువుతున్నారు. అలా తన చెల్లి, సిద్దు ఇద్దరూ కలిసి ప్రతి రోజు అవస్థలు పడి కాలేజ్ కి రావల్సి వస్తోంది. కాలేజ్‌కి వెళ్లడానికి ఒక్కొక్కరికి రవాణా ఛార్జీలు కూడా డెబ్బై రూపాయలు ఖర్చు అవుతోంది. తనకు, తన చెల్లికి కలిపి రోజుకు 140 రూపాయలు ఖర్చు అవుతుంటుంది. అయినా సరే సమయానికి కాలేజీకి వెళ్లడం ఒక ప్రహసనంగా మారింది. దీంతో ఎలాగైనా ఇలాంటి పరిస్థితి నుండి బయటపడాలని సుదీర్ఘంగా ఆలోచించాడు. అప్పుడు తనకు పాఠశాలల్లో చదివిన రోజుల్లో జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్స్ గుర్తుకు వచ్చాయి.
సైన్స్ ఎగ్జిబిషన్స్ లో తెలుసుకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఏదైనా కొత్త తరహాలో తక్కువ వ్యయంతో ఒక వాహనం తయారుచేయాలని నిర్ణయించుకున్నాడు సిద్ధు. అందులో భాగంగా ఎలక్ట్రికల్ సైకిల్ తయారుచేస్తే బాగుంటుందని భావించాడు. అలా తనకు వచ్చిన ఐడియాను కార్యాచరణలో పెట్టేందుకు అడుగులు వేశాడు. ఎలక్ట్రికల్ సైకిల్ తయారీకి కావలసిన సామాన్లు, తయారీ విధానం కోసం చాట్‌జీపీటీ, గూగుల్ వంటి సోషల్ మీడియాను ఉపయోగించుకున్నాడు. తరువాత ఎలక్ట్రికల్ సైకిల్ తయారీకి అవసరమైన భాగాలను ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ పెట్టి 35 వేల రూపాయలతో కొనుగోలు చేశాడు. తన స్నేహితుడు రాజేష్ తో కలిసి ఈ ప్రాజెక్టు ప్రారంభించాడు.
ఎట్టకేలకు ఎంతో కష్టపడి ఎలక్ట్రికల్ సైకిల్ విజయవంతంగా తయారుచేశాడు. ఈ సైకిల్ ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 50 కిమీ వేగంతో గరిష్ఠంగా 80 కిమీ ప్రయాణించగలదు. అంతేకాక బ్యాటరీ ఛార్జ్ అయిపోతే సాంప్రదాయ సైకిల్‌లా తొక్కుకుంటూ వెళ్లే సౌలభ్యం కలదు. మూడున్నర గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. అలా తయారుచేసిన ఎలక్ట్రికల్ సైకిల్ మీద రోజు తన చెల్లిని ఎక్కించుకొని పదిహేడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ కాలేజ్ కి వెళ్తున్నాడు.
వీడియో చూడండి..
సిద్ధు చేసిన ఈ ఎలక్ట్రికల్ సైకిల్ తయారీ అందరినీ ఆకర్షిస్తుంది. స్థానికులు ఈ సైకిల్ తయారు చేసిన సిద్దు ను ప్రశంసిస్తూ తమకు ఒక సైకిల్ తయారుచేసి ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఇలాంటి ప్రతిభ గల వారిని గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామీణ యువతలో ఉన్న ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తే ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తారనేది కాదనలేని వాస్తవం..!
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..