Viral: నిద్రలో ఛాతిపై దెయ్యం కూర్చున్నట్టుగా అనిపిస్తోందా.? దానికి అర్ధం ఏంటో తెలుసా
నిద్ర పక్షవాతం(స్లీప్ పెరాలసిస్) అనేది నిద్రపోతున్నప్పుడు కొన్ని సెకన్లు లేదా నిమిషాల పాటు మీ శరీరం కదల్లేని స్థితిలో ఉంటుంది. ఆ సమయంలో మీరు మాట్లాడలేరు. కేకలు వేయలేరు. అయితే ఇలా మీకు అనిపించిందా.? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

రాత్రుళ్లు నిద్రపోయేటప్పుడు.. ఆ రోజు జరిగిన మంచి, చెడు సంఘటనల ఆధారంగా మనకు పీడకలలు రావడం సర్వసాధారణం. కొన్నిసార్లు నిద్రలో ఉన్నప్పుడు మన చాతి బరువెక్కిపోయి.. ఎవరో కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. ఆ సమయంలో మన శరీరం కదలలేదు. నోటిలో మాటలు సైతం రావు. కొందరైతే నిద్రలో గుండెలపై దెయ్యం కూర్చుందని అంటుంటారు కూడా. అయితే దీనినే స్లీప్ పెరాలసిస్ అని అంటారు. ఎవరికైనా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు.. దెయ్యాలు లేదా చేతబడి చేశారని అనుకుంటారు. కానీ శాస్త్రవేత్తల ప్రకారం.. దీనికంటూ కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయని అంటున్నారు. స్లీప్ పెరాలసిస్ సమయంలో, వ్యక్తికి ఛాతీపై ఎవరో కూర్చున్నట్లు, గొంతు నులుముతున్నట్లు, గదిలో వింత ఆకారాలు ఉన్నట్లు అనిపిస్తుంది.
స్లీప్ టెర్రర్, నైట్మేర్ డిజార్డర్, స్లీప్ వాకింగ్ లాంటి మానసిక రుగ్మతల మాదిరిగానే స్లీప్ పెరాలసిస్ కూడా ఒక రుగ్మత. ఇది కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. ఇది మెదడు రాపిడ్ ఐ మూమెంట్(REM) నిద్ర దశ నుంచి మెలకువ దశకు పూర్తి స్థాయిలో మారినప్పుడు సంభవిస్తుంది. అప్పుడు శరీరం పెరాలసిస్ వచ్చినట్టుగా స్థంబించిపోతుంది. ఒత్తిడి, నిద్రలేమి, స్లీప్ ప్యాటర్న్స్‌లో మార్పులు.. లాంటివి ప్రధాన కారణాలు. రోజుకు 8 గంటల నిద్రపోతే స్లీప్ పెరాలసిస్‌ను నివారించవచ్చునని క్లినికల్ సైకాలజిస్టులు సూచిస్తున్నారు. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) ఉన్నవారు కూడా స్లీప్ పెరాలసిస్‌కు ఎక్కువగా గురవుతారని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
గతంలో విన్న భయంకరమైన కథలు లేదా చూసిన దృశ్యాలు మెదడులో నిక్షిప్తమై ఉండటం వల్ల స్లీప్ పెరాలసిస్ సమయంలో అవి మరింత భయాన్ని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్ర వేళలను పాటించడం, పడుకునే ముందు ఒత్తిడిని తగ్గించుకోవడం, ధ్యానం చేయడం లాంటివి ఈ స్లీప్ పెరాలసిస్‌ను దూరం చేస్తాయని అంటున్నారు.




